Friday , 19 July 2019

Home » Slider News » 10 శాతం ఇబిసి రిజర్వేషన్ల బిల్లు భవిష్యత్ ఏమిటి?

10 శాతం ఇబిసి రిజర్వేషన్ల బిల్లు భవిష్యత్ ఏమిటి?

January 12, 2019 12:02 pm by: Category: Slider News, ఫోకస్ Comments Off on 10 శాతం ఇబిసి రిజర్వేషన్ల బిల్లు భవిష్యత్ ఏమిటి? A+ / A-

చట్టసభల్లో గట్టెక్కిన బిల్లు “సర్వజనామోదం” పొందేనా? 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోది “సబ్ కా మాలిక్” అయ్యేనా?

Resrvations EBCఎన్నికల గడువు దగ్గర పడ్డ సమయంలో నరేంద్ర మోది అగ్రవర్ణాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం అంటూ 10 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ ఓ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు.  గతంలో  రాత్రికి రాత్రి  తీసుకున్న పెద్ద నోట్ల రద్దు కన్నా మించిన నిర్ణయం ఇది. ఈ అంశంపై ఇప్పడప్పుడే దేశంలో మంటలు చెల రేగక పోయినా నివురు గప్పిన నిప్పులా విస్తరించే ప్రమాదం లేక పోలేదు. వచ్చే ఎన్నికల్లో మోదీ పడవ మునుగుతుందో ఒడ్డుకు చేరుతుందో ఈ బిల్లు  తేల్చ నుంది.

దేశాన్ని అతలాకుతలం చేసిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత అనేక ఇబ్బందులు పడ్డ సామాన్యులు మోదీని తిట్టి పోసారు. ఆర్థిక నిపుణులు ఇది సరైన పద్దతి కానే కాదని విమర్శలు చేశారు. ఏడాది  రెండేళ్ల తర్వాత  పర్యవసానాలు పరిణామాలు అధ్యయనం చేసిన దేశ, విదేశి ఆర్థిక విశ్లేషకులు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వృధా ప్రయాసే కాక దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని బాగా దెబ్బతీసిందని అంకెలతో సహా నిరూపించారు. 2016,  నవంబరు 8 అర్ద రాత్రి నుండి రూ 1000, రూ500 నోట్లు చెల్లబోవంటూ రద్దు ప్రకటన చేసిన తర్వాత దేశ ప్రజల   కష్టాలు అన్ని ఇన్ని కావు.

“సబ్ కా సాత్ సబ్ కా వికాస్”  అనే మంత్రోప దేశం మోదీది.  దానికి తోడు “అచ్చే దిన్” అనే  ఓ టాగ్ లైన్ ఆయన నోటి నుండి వింటుంటాం. కాని ఎవరి అచ్చే దిన్ కోసం ఎవరి వికాసం కోసం మోది హఠాత్ నిర్ణయాలు తీసుకుంటాడో దేశ ప్రజలకు అర్దం కాని విషయం. తనది అవినీతికి తావులేని ఆదర్శ వంత పాలనే అయితే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం మోదీకి ఎందుకు కలుగతుందో అర్దం కాదు. మోది భయంలో ఉన్నాడుకనుకే రిజర్వేషన్ బిల్లు తెరపైకి తెచ్చాడనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఈ బిల్లు నోట్ల రద్దు అంశం కన్నా  మించిన దుమారానికి తెర లేపింది. ఈ నిర్ణయం వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాస్ర్తంగా పనిచేస్తుందని ప్రజలంతా మోదీకి జీ హుజూరనక తప్పదని ఇక మరో మారు మోదీజీనే ప్రధాని అంటూ కాశాయ కూటమి అమితానందంలో మునిగి తేలుతోంది.

చట్ట సభల్లో సునాయాసంగా గెట్టెక్కిన బిల్లు సర్వజనామోదం పొందే విషయంలో అనేక సవాళ్లకు నిలవాల్సి ఉంటుంది.

మోది తీసుకున్న నిర్ణయం వల్ల ఆగ్రవర్ణ పేదల్లో సహజంగానే సంతోషం వ్యక్తం అవుతుంటే బహుజనుల్లో  అనేక అనుమానాలు సంశయాలు కలుగుతున్నాయి. రిజర్వేషన్ల కోటా పెంచాలని  కోరుతున్న బహుజనులను పట్టించుకోకుండా మరో వైపు అగ్రవర్ణాల పేదల కంటూ 10 శాతం రిజర్వేషన్లకు పూనుకోవడం ఏమిటని ప్రశ్నిస్తు న్యాయ పోరాటానికి సిద్దపడ్డారు.

రిజర్వేషన్లకు ఆర్థిక ప్రమాణాలే ఏకైక ఆధారం కాదని, పార్లమెంట్‌ ఆమోదించిన బిల్లును కొట్టివేయాలంటూ “యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ అనే సంస్థ” సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం   దాఖలు చేసింది.  ఇంకా అనేక సామాజిక వర్గాలవారు న్యాయ పోరాటంలో చేరేందుకు సిద్దపడుతున్నారు.

ఈ దేశ జనాభాలో షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుక బడిన కులాలు, అత్యంత వెనుక బడిన కులాల వారు 85 శాతం వరకు ఉన్నారు. బహుజనుల్లో ఎస్సి, ఎస్టీలకు అట్లాగే బిసి లకు ఇచ్చే రిజర్వేషన్లు సరి పోవడం లేదని తమ వాటా పెంచాలని కోరుతున్నారు. వీరికి తోడు మత మైనార్టీల వారు రిజర్వే,షన్లు కల్పించాలని అడుగుతున్నారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదని సుప్రీం కోర్టు పలుకేసుల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సమానత్వాన్ని సాధించాలనే రాజ్యాంగ స్పూర్తికి భంగం కలగనీయ రాదని జనాభాలో 50 శాతం ప్రతిభ గల వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో రిజర్వేషన్లను గీత దాట నీయడం లేదు.

కాని ప్రస్తుత రిజర్వేషన్లలో ఎస్సీలకు 15 శాతం ఎస్టీలకు 7.5 శాతం బీసీలకు 27 శాతం మొత్తం 49.5 శాతం అమల్లో ఉన్నాయి. జనాభాలో 53 శాతం వరకు ఉన్న బిసీలకు 27 శాతం సరిపోవని అట్లాగే ఎస్సీ, ఎస్టీలు తమ జనాభా నిష్పత్తి ప్రకారం వాటా డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీలకు 10, ఎస్సీలకు 18, బీసీలకు 33, ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపించింది. సుప్రీం కోర్టు ఇటీవల ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

ప్రస్తుతం మోది ప్రవేశ పెట్టిన బిల్లు కారణంగా అణగారిన కులాలు, వెనక బడిన కులాలు భయాందోళనలో పడ్డాయి. అగ్ర వర్ణ పేదల రిజర్వేషన్ల వల్ల తమ వాటాకు జరిగే నష్టం లేక పోయినా ఇంకా ఎక్కువ వాటా దక్కాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక అంశాల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ చేయడం వారిని మరింత ఆందోళన పరుస్తోంది.

దేశ జనాభాలో కేవలం 15 శాతం ఉన్న అగ్ర వర్ణ కులాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ లెక్కన జనాభాలో 85 శాతం ఉన్న ఎస్సి, ఎస్టి, బీసీలకు వారి వారి జనాభా శాతం మేరకు రిజర్వేషన్లు పెంచేందుకు ఎందుకు సంకల్పించలేదని అడుగుతున్నారు.

జనాభా దామాష ప్రాతిపదికన అన్ని కులాలకు ఎవరి జనాభా మేరకు వారికి  రిజర్వేషన్లు కల్పిస్తే  అగ్ర వర్ణాలు అణ గారిన వర్గాలు అనే భేదభావం లేకుండా సామాజిక న్యాయం అమలు చేసినట్లు అవుతుందనేది సామాజిక వేత్తలు చాలా కాలంగా సూచిస్తున్న మద్యే మార్గం.

జనాభా దామాష మేరకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు పెద్ద మంత్రాంగమే జరగాలి. దేశ వ్యాప్తంగా ప్రజలు రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి రావాలి. ఇది జరగాలంటే  ముందు రాజకీయ పార్టీలు తమ అధికార దాహాన్ని పక్కన పెట్టి స్వీయ ప్రయోజనాలు, ఓట్ల రాజకీయాలకు స్వస్థి చెప్పి దేశ ప్రజల  మేలు కోరి చిత్త శుద్దితో విశాల ప్రాతిపదికన  ఆలోచనలు చేయాల్సి ఉంటుంది.

ఇలా చేసేందుకు ఏ రాజకీయ పార్టీ సుముఖంగా లేదు. ఈ దేశంలో కులాల సమస్య రిజర్వేషన్ల సమస్య సజీవంగా ఉండాలి. వాటిని కేంద్రంగా చేసుకుని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకోవాలి.

స్వాతంత్ర్యానంతరం 70 ఏళ్ల కాలంలో రిజర్వేషన్లపై ఎందుకు సమగ్ర సమీక్ష జరగలేదు.? విద్య, ఉపాధి రంగాలను మినహాయించి రాజకీయ రంగంలో రిజర్వేషన్లను కేవలం 10 ఏళ్ల కాల పరిమితికే అమలు చేయాల్సి ఉండగా ఎందుకు పొడిగిస్తు వచ్చారు.? దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న ఓబీసిలను విద్యా ఉపాధి రంగాలకు పరిమితం చేసి రాజకీయ రంగంలో ఎందుకు రిజర్వేషన్లు కల్పించ లేక పోయారనే ప్రశ్నలకు సమాధానాలు లేవు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోది బిల్లుపై సమగ్ర చర్చకు తావు లేకుండా సామాజిక న్యాయ నిపుణుల సూచనలు సలహాలకు అస్కారం లేకుండా రాజ్యాంగ బద్దమైన విధి విధానాలను అనుసరించకుండా వివాదాలకు తావు  ఇచ్చే రీతిలో రిజర్వేషన్ల పుట్టలో వేలు పెట్టాడనే విమర్శలు ఉన్నాయి.

కీలకమైన విధానాలపై రాజ్యాంగ సూత్రాలకు లోబడి ప్రజాస్వామ్య రీతిలో న్యాయ నిపుణులతో ముందుగా ఓ కమీషన్ ఏర్పాటు చేయకుండా ఎకాఎకిన నిర్ణయం తీసుకోవడ మేమిటని  ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్లపై వివిద  రాష్ర్టాల నుండి వచ్చిన డిమాండ్లను పరిగణ లోకి తీసుకోకుండా కేవలం తన పీఠం కాపాడుకునేందుకు ఓట్ల ఖజానా కోసమే మోది  నిర్ణయం తీసుకున్నాడని బహుజనులు ఆగ్రహంతో ఉన్నారు.

రిజర్వేషన్ల విషయంలో చట్ట సభల్లో జరిగి పోయిన తంతుపై వివిద సామాజిక వర్గాల్లో విస్తృత స్థాయి చర్చ జరుగుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ చర్చ రాజకీయ రూపు దాల్చితే 85 శాతం వరకు ఉన్న అణగారిన సామాజిక వర్గాల నుండి నరేంద్ర మోదీకి  ఇబ్బందులు తప్పక పోవచ్చు. జరిగే నష్టం ఏం లేదని ఎస్సీ, ఎస్టీలు, బిసీలు ప్రస్తుత బిల్లుతో సరి పెట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు.

ఏడాదికి 8 లక్షల మేరకు ఆర్థిక పరిమితి ఈబిసి రిజర్వేషన్లకు విధించడంపై కూడ పలు విమర్శలు ఉన్నాయి. సాలీనా 8 లక్షల ఆదాయ పరిమితి కల వారంటే కేంద్ర ప్రభుత్వం నిభందనల ప్రకారం   ఆదాయ పన్ను చెల్లించే వారు అవుతారు. ఆదాయ పన్ను చెల్లించే వారు రిజర్వేషన్లకు ఎట్లా అర్హులవుతారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. న్యాయ నిపుణులు కూడ ఈ బిల్లుపై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

రిజర్వేషన్ల పుట్టను కదిలించినందుకు నరేంద్ర మోదీ ఏ పరిణామాలు ఎదుర్కోనున్నారో భవిష్యత్ లో తేలుతుంది. జనాభాలో 15 శాతం మాత్రమే ఉన్న అగ్రవర్ణాల ఓట్లతో గెట్టెక్కుతారో లేక 85 శాతం ఉన్న బహుజనుల ఆగ్రహంతో ప్రధాని పీఠం దిగిపోతారో తేల నుంది.

2018 లో బిసి కమీషన్ కు రాజ్యాంగ ప్రతి పత్తి కల్పించి మోది బహుజనుల ప్రశంసలు అందుకున్నాడు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల ప్రజల సమస్యలను అధ్యయనం చేసేందుకు 2018 ఆగస్ట్ లో 123వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా వెనుకబడిన తరగతుల కమీషన్ ఏర్పాటుకు చట్ట బద్దత కల్పించారు. అయితే ఎందుకో కారణాలు తెలియవు కాని ఈ కమీషన్  నియామకం జరగక పోగా హఠాత్తుగా అగ్ర వర్ణాల పేదల కోసం అంటూ 10 శాతం రిజర్వేషన్లు తెరపైకి తీసుకు వచ్చి మోది మెజార్టి బహుజనుల ముందు విలన్ గా నిలబడ్డాడు.

దేశంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయడం వెనుక సుదీర్ఘ కాల చరిత్ర ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వమే అణగారిన వర్గాలకు రిజర్వేషన్ల విధానం అమలైంది. మహారాష్ర్ట లోని కొల్హాపూర్ ఆస్థానా దీశులు ఛత్రపతి సాహు మహారాజ్  జులై 26 , 1902 ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో జనాభా దామాష ప్రకారం వివిద సామాజిక వర్గాలకు ప్రభుత్వోద్యోగాలన్నింటిలో రిజర్వేషన్లు కల్పించారు. “బహుజన హితాయ బహుజన సుఖాయ” అనే లక్ష్య సాదన కోసం పనిచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే 1882 లోనే రిజర్వేషన్లు వుండాలని  “హంటర్‌ కమీషన్‌” ఎదుట బలంగా వాదించారు. పలు ఉద్యమాలు పోరాటాల ఫలితంగానే వలసకాలంలో రిజర్వేషన్లను బ్రిటీషువారు కొన్ని సంస్ధానాలలో అమలు చేయక తప్పలేదు.

రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా దేశంలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి నప్పటి నుండి  ఈ 70 ఏళ్ల కాలంలో రిజర్వేషన్లపై అనేక చర్చలు సాగాయి. అసలు రిజర్వేషన్లు ఎందుకు దండగంటూ ప్రతిభకు చోటు లేదా అంటున్నారు కొందరు…….ఈ రిజర్వేషన్ల కారణంగానే దేశం అభివృద్ధి కుంటు పడి పోయిందని కొందరు………. ఇంకా ఈ రిజర్వేషన్లు  సరి పోవని పెంచాలని కొందరు…. అసలు మొత్తం రిజర్వేషన్లు రద్దు చేయాలని కొందరు వాదిస్తుంటే అసలు రిజర్వేషన్లు కులాలకు కాదు పేదల్లో పేదలకివ్వాలని ఇట్లా ఎవరి వాదనల్లో వారున్నారు.

ప్రపంచంలో ఏ దేశంలో లేని భిన్నమైన జాతులు భిన్న మతాలు, భిన్న కులాలు భిన్న ఆచార వ్యవహారాలు, భిన్న భాషలు ఈ దేశంలో ఉన్నాయి. లౌకిక ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే భారత దేశం అనాది కాలం నుండే వర్ణ భారతం. ఈ దేశంలో జన్మించే వారెవరైనా ఇంకా తల్లి గర్భం నుండి భూమి మీద పడకముందే వారి  భవిష్యత్ నిర్ణయించ బడుతుంది. వారు పుట్టిన కులాన్ని బట్టి వారి ప్రాప్తం  స్థిర పడుతుంది. ఓ అధ్యయనం ప్రకారం భారత దేశంలో 6500 కు పైగా కులాలు వాటికి ఉప కులాలు ఉన్నాయి. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ  సంస్కృతి ఈ దేశంలో వందలు వేల సంవత్సరాల నుండి ఎవరూ పెకిలి వేయలేనంతగా వేళ్లూనింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర  అనే చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా ఆచారకర్మల విభజన జరిగింది. బుగ్వేద కాలం నాటి నుండి భారత దేశంలో అమల్లో ఉన్న  చాతుర్వర్ణ వ్యవస్థ ద్వారా నిర్దేశిత సామాజిక కట్టుబాట్లు కొనసాగుతున్నాయి.

వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు ఆధిపత్యులుగా శూద్రులు  పీడితులుగా బ్రతికారు. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుక బడిన కులాలు జనాభాలో 85 శాతం ఉన్నా వారికి పాలించే అధికారం రాలేదు. జనాభాలో మైనార్టిగా ఉన్న ఆధిపత్య కులాలు ప్రజాస్వామ్య వ్యవస్థలకు ముందు అ తర్వాత కూడ మెజార్టి ప్రజలకు పాలకులుగా స్థిరపడి పోయారు. పార్లమెంటరి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎస్టి, ఎస్సి లను మినహాయిస్తే అగ్ర వర్ణ శూద్రులుగా పిలువ బడే రెడ్లు, వెలమ, కమ్మ,కాపులు, ఉత్తరభారతంలో  జాట్లు, రాజ్ పుత్ లు, పట్టీదార్ తదితరలు ప్రస్తుతం చట్టసభల్లో అధిక శాతం ఆధిపత్యంలో కొనసాగుతూనే మరో వైపు రిజర్వేషన్లు  కావాలని కోరుతున్నారు.

మొదటి నుండి రాద్దాంతంగా మారిన రిజర్వేషన్ తంతు ఏ రంగాలలో అమలు చేస్తున్నారంటే. కేవలం విద్యా, ఉద్యోగ, సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితం చేశారు. పాలనా వ్యవస్థలోని చట్టసభల్లో ఎస్సి, ఎస్టీలకు మినహా ఇతరులకు రిజర్వేషన్లు లేవు. వందలు వేల సంఖ్యలో ఉన్న వెనుక బడిన తరగతులు, కులాల వారిలో అనేక కులాలు ఇప్పటికి చట్ట సభల్లో అడుగు పెట్టలేదు. ఈ డిమాండ్ ను  చాలా కాలంగా  నిర్లక్ష్యం చేశారు. ఇలాంటి సమస్యలు మోది దృష్టికి వచ్చినా వాటిని పట్టించు కోకుండా ఇబిసి బిల్లును తెర మీదికి తేవడం  రాజకీయం తప్ప మరోటి కాదనే విమర్శలు ఉన్నాయి. చట్ట సభల్లో రిజర్వేషన్ల కోసం యుపిఏ సర్కార్ హయాంలో ప్రతిపాదించిన మహిళ రిజర్వేషన్ బిల్లుకు ఇప్పటికి మోక్షం కలగ లేదు.

‘సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్’ అంటే కులాలకు కులాలు మద్య కుమ్ములాటలు పెట్డడం,. తన్నుకు చావండి అంటూ రిజర్వేషన్లలో చిచ్చు పెట్టడం కాదు. నిశితంగా రిజర్వేషన్ల విధానానంపై   సమగ్రమైన అధ్యయనం తప్పని సరిగా జరిగి తీరాలి. వీటన్నింటికన్నా ముందుగా ఆర్థికంగా, సామాజికంగా వెనకపడిన వారి కుటుంబాల గణాంకాల నిర్దారణ జరగాలి. అణగారిన వర్గాల్లో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్న వారిలో అనేక సమస్యలు  పరిష్కారం కావాలి. రిజర్వేషన్ ఫలాలు పొందిన వారే పొందకుండా అవకాశాలు దక్కని వారికి అందేలా చూసేందుకు క్రిమిలేయర్ అమలుకు పకడ్బంది విధానం రూపొందించాలి.

అందరికి అన్ని రంగాలలో సమాన అవకాశాలు కలగాలంటే సామాజిక న్యాయం సిద్దించాలంటే జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ల అమలు జరిగి తీరాలి.

కూన మహేందర్

సీనియర్ జర్నలిస్ట్

ప్రజాతంత్ర దినపత్రిక 12-01-2019

 

 

 

10 శాతం ఇబిసి రిజర్వేషన్ల బిల్లు భవిష్యత్ ఏమిటి? Reviewed by on . చట్టసభల్లో గట్టెక్కిన బిల్లు “సర్వజనామోదం” పొందేనా? 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోది “సబ్ కా మాలిక్” అయ్యేనా? ఎన్నికల గడువు దగ్గర పడ్డ సమయంలో నరేంద్ర మోది అగ్రవర చట్టసభల్లో గట్టెక్కిన బిల్లు “సర్వజనామోదం” పొందేనా? 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోది “సబ్ కా మాలిక్” అయ్యేనా? ఎన్నికల గడువు దగ్గర పడ్డ సమయంలో నరేంద్ర మోది అగ్రవర Rating: 0
scroll to top