Friday , 19 July 2019

Home » Slider News » శతచిత్ర యోగి ఆక్షర యుద్ధ వారధి…దాసరి నారాయణ రావు

శతచిత్ర యోగి ఆక్షర యుద్ధ వారధి…దాసరి నారాయణ రావు

June 1, 2017 12:32 pm by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on శతచిత్ర యోగి ఆక్షర యుద్ధ వారధి…దాసరి నారాయణ రావు A+ / A-

దాసరి జ్ఞాపకాలు…ఉదయం దిన పత్రిక అనుభవాలు

దిన పత్రికలను స్థాపించి నడిపించడమంటే ఆరోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ఇక ముందు రోజుల్లో అయినా ఓ పెద్ద దుస్సాహసమే. దిన పత్రిక  చిన్నదైనా పెద్దదైనా ప్రారంభించడమంటే రోట్లో తల పెట్టినట్లే. ఇందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉదంతాలు ఉన్నాయి. అందుకే దినపత్రికను “వైట్ ఎలిఫెంట్” తో పోలుస్తుంటారు. తెలుగు దినపత్రిక రంగం చరిత్రలో అనేక మంది ఎంతో సదాశయంతో పత్రికలు నడిపి ఇళ్లు ఒళ్లు గుళ్ళ చేసుకున్నవారున్నారు. పత్రికలు పెట్టి  ‘పైసలు’ సంపాదించడంలో ఉండే “కమ్మదనం”  కొందరికి మాత్రమే బాగా అబ్బింది.

దినపత్రిక రంగంలో ఉండే కాసుల భారం కష్టాలు అన్ని తెలిసి కూడ ఓ సాహస ప్రయోగం చేసిన వారు శత చిత్ర దర్శక రత్న దాసరి నారాయణ రావు. అనివార్య పరిస్థితుల కారణంగా ఆర్థిక భారంతో తన మానస పుత్రిక ఉదయం దిన పత్రికను వదులు కోవాల్సి వచ్చింది.  కారణాంతరాల వల్ల చేతులు మారిన పత్రిక మూతపడితే ఆయన హృదయం తల్ల డిల్లి పోయింది. పత్రికను పున:ప్రారంభించేందుకు ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. దాసరి నారాయణ రావు అస్తమయంతో  ఉదయం దిన పత్రిక పున ప్రారంభం నెర వేరని కోరికగానే మిగిలి పోయింది.

తన యాభై ఏళ్ల సుదీర్ఘ సినీ రంగ ప్రయాణం దాసరి నారాయణ రావుకు ఎంతటి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిందో అతి తక్కువ కాలమే అయినా పత్రికా రంగంలో ఉదయం దిన పత్రిక ఆయనకు అంతకు మించిన ఘన కీర్తిని సమ కూర్చింది. పత్రికా రంగంలో విలువలను కాపాడేందుకు ఆయన అన్ కాంప్రమైజ్డ్  విధానం కడకు పాలకులకులతో కయ్యానికి దారి తీసినా వెనుకడుగు వేయలేదు.

ఏమైనా ఉదయం దిన పత్రికది తెలుగు పత్రికా రంగంలో ఓ సంచలనం. పెట్టుబడి దారుల పెత్తనం లేకుండా కట్టుకథలు కానరాకుండా ప్రజా పక్షంగా నిలిచి పాలకులకు సింహస్వప్న మైంది. ఈ పత్రిక కారణంగానే 1989 లో దాసరి నారాయణ రావు నటుడిగా అభిమానించే నవరస నటనా సార్వ భౌముడు నటరత్న ఎన్టీరామారావు ఆపజయం పాలు కావాల్సి వచ్చింది.

సినీ రంగంలో ఓ వెలుగు వెలుగుతున్న తరుణంలో 1984 సంవత్సరం డిసెంబర్ 29 వ తేదీన ఉదయం దిన పత్రిక తొలి సంచిక వెలువడింది. తెలుగు పత్రికా రంగంలో ఏక చద్రాధి పత్యానికి అడ్డుకట్టలు వేయాలనే తలంపుతో దాసరి నారాయణ రావు  ప్రారంభించిన పత్రికను మొదటి నుండి బాలారిష్టాలు చివరి వరకు వెంటాడాయి. పత్రిక ఎంతో మంది సీనియర్ ఎడిటర్లు, జర్నలిస్టుల అధ్వర్యంలో  తెలుగు నాట తొలి తరం,నవతరం జర్నలిస్టుల మేల వింపులతో కొత్తపుంతలు తొక్కింది. దాసరి నారాయణ రావు చైర్మన్ గా కొండపల్లి రామకృష్ణ ప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్ గా అన్నే భవానీ కోటీశ్వర ప్రసాద్ అందరికి షార్ట్ ఫాంలో ఎబికేగా పరిచయం అయిన ఎబికె ప్రసాద్ ఎడిటర్ గా ఉదయం దిన పత్రిక ప్రారంభమైంది. సినిమా రంగంలో దాసరి నారాయణ రావు తిరుగు లేని బహుముఖ శాలిగా వెలుగు వెలుగుతున్న కాలం కావడంతో ఉదయం దిన పత్రికకు విశేష ప్రచారం లభించింది. తెల్లవారు జామున  కోడిపుంజు కూస్తున్న  గ్రాఫిక్ బొమ్మతో  పత్రిక కు మార్కెట్ లో ప్రచారం కల్పించారు.ఏజెంట్లు ఎగ బడి పోటీలు పడి చందా దారులను చేర్పించారు. ప్రారంభంలోనే రెండు లక్షల కాపీలతో ఉదయం దిన పత్రిక  ఆరోజుల్లో తెలుగు పత్రికా రంగంలో సంచలనం సృష్టించింది. పత్రిక ఓ దశలో 3.50(మూడు లక్షల యాభై వేల కాపీలు) లక్షల సర్కులేషన్ కు చేరింది.

దాసరి నారాయణ రావు పేరుతో పాటు జర్నలిస్టులు సామన్య ప్రజానీకం శ్రేయస్సు కోరుతూ  ప్రభుత్వ అలసత్వాన్ని అవినీతిని ఉతికి ఆర వేయడంతో పత్రిక ఓ సంచలనంగా మారింది. ప్రతి దినం పాఠకులు ఎదురు చూసే విదంగా ఉదయం దిన పత్రిక ఆ రోజుల్లో ప్రత్యేకతను సంపాదించింది.

సినీ రంగ నేపద్యం నుండి రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి  కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేకంగా అతి స్వల్ప కాలంలోనే పార్టి స్థాపించి సంచలనం సృష్టించిన మహా నటుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పదవి భాద్యతలు నిర్వహించిన కాలం. ఎన్టీఆర్ ముఖ్య మంత్రి అయిన కొద్ది కాలానికే అదే సిని రంగ నేపద్యం నుండి వచ్చిన దాసరి నారాయణ  రావు  ప్రజల పక్షాన నిలిచి ఎన్టీఆర్ పని తీరును ఆయన పాలనా వైఫల్యాలను నిర్మొహ మాటంగా ఉదయం దినపత్రిక ద్వారా ఎత్తి చూపుతూ నిద్ర పట్టకుండా చేసిన రోజులు చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

ప్రభుత్వంలో జరిగే అవినీతిని ఎండ గడుతూ  ప్రజాధనాన్ని దోచుకుని తినే పంది కొక్కుల భరతం పట్టి ఉదయం దిన పత్రిక ప్రజల ముందు నిల బెట్టింది. వార్త ప్రచురణలో దిన పత్రిక నూతన ఒరవడులతో అనేక ప్రయోగాలు చేసింది. క్రీడా రంగానికి ఒక ఫుల్ పేజి కేటాయించిన ఘనత తొలుత ఉదయం దిన పత్రికకే దక్కుతుంది. అంతే కాదు. గ్రామీణ వార్తలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చింది. ప్రజల సమస్యలకు,సామాజిక అంశాలకు ప్రాధాన్యత నిచ్చి మొదటి పేజీలో వార్తలు వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లింది. తెలంగాణ ప్రాంతంలో ఉండే జోగినీల ఆచారాలను పత్రిక వెలుగులోకి తెచ్చింది. వార్తలంటే లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కాదని సామాన్య ప్రజల ఈతి భాదలే వార్తాంశాలని మానవీయ కథనాలకు ప్రాధాన్యత కల్పించింది. ప్రజల హక్కులు,పౌరహక్కులు కాపాడేందుకు ప్రజా పోరాటాలకు హక్కుల సంఘాలకు అగ్ర పీఠం వేసి జన వాక్కై నిలిచింది ఉదయం దినపత్రిక.

కనీస జీత భత్యాలు లేకుండా విధులు నిర్వహించే సుంకరులు,నీరడీల దీన గాధలను ఎత్తి చూపింది. మారు మూల అడవుల్లో ఆభయారణ్యాలలో మగ్గుతున్న ఆది వాసి గిరిజనుల బతుకులు చూసి వారి అవస్థలకు ఆక్షర రూపం ఇచ్చి సర్కార్ ను అడవులకు పరుగులెత్తించింది. అన్నార్తుల కోసం అన్నలు చేస్తున్న పోరాటాలకు  ఆ రోజుల్లో ఉదయం దిన పత్రిక పతాకంగా నిలిచింది. ఉదయం దిన పత్రికలో అందరూ తీవ్ర వాద భావ జాలం కలిగిన వారే పనిచేస్తున్నారని పోలీసులు బాహాటంగానే మండిపడే వారు. పోలీసుల వైపు నుండి ఉదయం దిన పత్రిక జర్నలిస్టులు ఎదుర్కున్నన్ని కేసులు,వేధింపులు ఎవరూ ఎదుర్కోలేదు. జర్నలిస్టుల్లో భయోత్పాతం సృష్టించేందుకు చివరకు ఉదయం జర్నలిస్టు గులాం రసూల్ ను భూటకపు ఎన్ కౌంటర్ లో పోలీసులు చంపేశారు. ఎన్ కౌంటర్ లో చంపిన గులాం రసూల్ ను గుర్తు తెలియని శవంగా ప్రకటించి మార్చురీలో వేస్తే  ఫోటోలు తీసేందుకు వెళ్ళిన ఫోటో గ్రాఫర్లు వెళ్ళి చూసిన తర్వాత గాని ఆ గుర్తు తెలియని శవం గులాం రసూల్ దని బయటి ప్రపంచానికి తెలయ లేదు.

పత్రికలో పనిచేసే జర్నలిస్టుల స్వేచ్ఛ విషయంలో పత్రికాధిపతిగా ఉన్న దాసరి నారాయణ రావు ఏ నాడూ తలదూర్చ లేదు. జర్నలిస్టులకు సంపూర్ణ స్వేచ్ఛ నివ్వడం వల్లే ప్రజల నాడిని పట్టి వారి మేలు కోరిన వార్తలతో పత్రిక మెప్పు పొందింది. ఉదయం దిన పత్రిక గమనం తక్కువ కాలమే అయినా ఆ పత్రిక దాసరి నారాయణ రావు చేతుల్లో ఉన్నంత కాలం పరిశోదనాత్మక కథనాలతో పాలకుల గుండెల్లో నిద్ర పోయింది. ఆ చరిత్ర గతం…చరిత్రలో వార్తగా నిలిచి పోయిన ఉదయం గతం……ఇక జర్నలిస్టులకు ఆరోజులు గతమే……ఈ రోజుల్లో అవేవీ ఎంతకూ సాద్యం కాదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా  విలేఖర్లను అడ్వర్టైజ్ మెంట్ల కోసం రాజకీయ నేతల ఇండ్ల ముందు నిలుచో పెట్టలేదు. అది దాసరి నారాణ రావు గొప్ప తనం.

నడిచినంత కాలం ఉదయం పత్రికను ప్రజలు తమ స్వంత పత్రికగా ఆదరించ గలిగారంటే యాజమాన్యం వేలు దూర్చక పోవడం అందుకు ప్రధాన కారణం. 1986 లో ఉదయం దిన పత్రిక ప్రధాన సంపాదక భాద్యతల నుండి ఎబికె ప్రసాద్ తప్పుకోగా ఆయన స్థానంలో దాసరి నారాయణ రావు ఆ బాద్యతలు 1991 వరకు పత్రికను కాంగ్రేస్ ఎంపి మాగుంటు సుబ్బరామిరెడ్డికి విక్రయించే వరకు నిర్వహించాడు.

తొలి తెలుగు దిన పత్రిక అంధ్ర పత్రికకు అమృతాంజన్ కు ముడి పడి ఉన్నట్లు ఉదయం దిన పత్రికకు సినిమా రంగంతో ముడి పడి ఉంది. దర్శక రత్న దాసరి నారాయణ రావు సినిమా రంగం ఆటు పోట్లు పత్రికా రంగంపై కూడ ప్రభావం చూపాయి.  ఆర్థిక ఒడిదొడుకులు ఉండి పత్రికను బతికించేందుకు  దాసరి నారాయణ రావు ప్రారంభించిన ‘శివరంజని’ సినిమా రంగ వార పత్రిక రాష్ర్టంలో అత్యధిక సర్కులేషన్ తో  కొంత కాలం  ఉదయం కు తోడ్పడింది. దాసరి నారాయణ రావు అప్పుల్లో కూరుకు పోయాడని అయన ఆస్తులు జప్తు అయ్యాయని ఆ పత్రిక ఎప్పుడు మూత పడి పోతుందా అని ఎదురు చూసే పోటి పత్రికలో అప్పడప్పుడు వార్తలు కూడ వచ్చేవి.  నెలల తరబడి జర్నలిస్టులకు సిబ్బందికి  జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడ పత్రిక ఆగి పోకుండా నడిచింది. ఇక ఎక్కువ కాలం నెట్టుకు రాలేనని దాసరి నారాయణ రావు పత్రికను మాగుంట సుబ్బరాంరెడ్డికి తప్పని పరిస్థితులలో విక్రయించాడు.

మాగుంట చేతిలో ఉదయం దిన పత్రిక కాంగ్రేస్ పార్టీకి ఒక రకంగా అధికార పత్రికగా మారింది. సిబ్బందికి నెల నెల క్రమం తప్పకుండా మాగుంట సుబ్బరాం రెడ్డి జీత భత్యాలు చెల్లించి పత్రికను నడిపాడు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పనిచేసే  గ్రామీణ విలేఖర్లకు లైన్ అక్కౌంట్ కాకుండా జోనల్ వేలేఖర్లుగా నియమించి నెల నెల  కొంత జీతం రూపంలో చెల్లించారు. అదే సమయంలో పత్రిక సిబ్బంది తమకు జీతాలు పెంచాలని నోటీసు ఇవ్వడంతో చర్చలు జరిపినా ఫలితం లేక పత్రికను మూసి వేశాడు. కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే పత్రిక ప్రతిష్ట తగ్గినా జీతభత్యాలకు లోటులేకుండా పత్రిక నడిచేది. కాని ఎన్టీఆర్ తిరిగి అధికారం లోకి రావడం మద్య నిషేధం జరగడంతో సుబ్బరాం రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో పత్రికను నడప లేక పోయాడు.  అయితే  ఆ తర్వాత మాగుంట సుబ్బరాం రెడ్డి నక్సలైట్ల కాల్పుల్లో చనిపోయన తర్వాత ఉదయం దిన పత్రిక ను తిరిగి పున ప్రారంబించాలని దాసరి నారాయణ రావు చాలా సార్లు ప్రయత్నాలు చేశాడు. ఆయన తెలుగు తల్లి పార్టి పెట్టక ముందు పెట్టిన తర్వాత ఆ తర్వాత కాంగ్రేస్ పార్టీలో చేరి కేంద్రంలో మంత్రి అయిన తరువాత పదవి పోయిన తరువాత కూడ ప్రయత్నాలు చేశాడు కాని ఫలించ లేదు.

దాసరి నారాయణ రావు సిని రంగ జీవితంతో పాటు ఆయన పత్రికా రంగంలో చేసిన సాహసం కూడ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది.

కూన మహేందర్

(ఉదయం దిన పత్రికలో పనిచేసిన జ్ఞాపకంతో)

(01 JUNE 2017 ప్రజాతంత్ర- దినపత్రిక)

శతచిత్ర యోగి ఆక్షర యుద్ధ వారధి…దాసరి నారాయణ రావు Reviewed by on . దాసరి జ్ఞాపకాలు...ఉదయం దిన పత్రిక అనుభవాలు దిన పత్రికలను స్థాపించి నడిపించడమంటే ఆరోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ఇక ముందు రోజుల్లో అయినా ఓ పెద్ద దుస్సాహసమే. దిన దాసరి జ్ఞాపకాలు...ఉదయం దిన పత్రిక అనుభవాలు దిన పత్రికలను స్థాపించి నడిపించడమంటే ఆరోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా ఇక ముందు రోజుల్లో అయినా ఓ పెద్ద దుస్సాహసమే. దిన Rating: 0
scroll to top