Friday , 19 July 2019

Home » Slider News » లైక్ చేయండి……షేర్ చేయండి కాని ఆంధ్ర మీడియా మాయలో పడకండి

లైక్ చేయండి……షేర్ చేయండి కాని ఆంధ్ర మీడియా మాయలో పడకండి

November 23, 2018 9:16 am by: Category: Slider News, ఫోకస్ Comments Off on లైక్ చేయండి……షేర్ చేయండి కాని ఆంధ్ర మీడియా మాయలో పడకండి A+ / A-

మెయిన్ స్ర్టీమ్ మీడియా వర్సెస్ సోషల్ మీడియా

Social Media Social Networking Technology Connection Concept

ఫిఫ్టి- ఫిఫ్టి, సిక్స్టి – ఫార్టి, సెవంటి- ధర్టి, స్వీప్ వంటి పదాలు రోజూ వినాల్సి వస్తోంది. ఇంటర్ మీడియేట్ ఫలితాలో లేక ప్రొపెషనల్ కోర్సుల ప్రవేశాల ఫలితాలో వెలువడిన అనంతరం కోచింగ్ సెంటర్లు మాద్యమాల్లో ఊదరగొట్టే ఇలాంటి బాపతు  పదాలు మనం డిసెంబర్ 11 వరకు వినాల్సిందే….తప్పదు. గెలుపెవరిది? వోడిపోయే వారెవరు?  అనేదే ప్రస్తుత చర్చనీయాంశం.

ముచ్చట అంటేనే ఓ ఆసక్తి….. అందులో రాజకీయ ముచ్చట్లంటే మరి చెవులు కోసుకుంటారు. ఎవరు గెలుస్తారో ఎవరు వోడుతారో తెలియాలి… ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో.. ఏ పార్టి అధికారంలోకి వస్తుందో….గెలుపు గుర్రాలేవో తేలాలి. రాజకీయాలను ప్రజలు ఎవరూ తేలికగా తీసు కోవడం  లేదు. చదువుకున్న వారైనా చదువురాని వారైనా పరిస్థితులను పసి గడుతూ తమ తమ అవగాహన మేరకు ఓ అంచనా వేస్తున్నారు, వివిద మీడియా సంస్థలు ఇతర స్వతంత్ర సంస్థలు పలు ధపాలుగా వెల్లడించిన సర్వేల ఫలితాలు చర్చలను వేడెక్కిస్తున్నాయి.  ఆ పత్రిక అట్లనే రాస్తది…..ఆ టివీలో అట్లనే వస్తయ్……అవి అన్ని తప్పు…ఆ సర్వేలన్ని డబ్బులు ఇచ్చి చేయించుకున్నవే….అంటూ మీడియా సంస్థల నిజాయితీని సర్వేల విశ్వస నీయతను  ప్రశ్నిస్తూ తమ చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

భందువులైనా మిత్రులైనా తారస పడినా ఫోన్లో కనెక్ట్ అయినా కుశల ప్రశ్నల కన్నా ముందు ఏమిటి పరిస్థితి? అని పార్టీలతో పాటు అభ్యర్థుల స్థితి గతులు ఆరా తీస్తున్నారు.

సర్కార్ ఏం చేసిందో ఆయా ప్రాంతాలకు చెందిన మంత్రులు  ఎమ్మెల్యేలు తమ పదివి కాలంలో  ఏం చేశారో ఏం చేయలేక పోయారో అనే విషయాలతో పాటు వారు ఎట్లా గడ్డి కరిచారో…..ఎంతగా వెనకేసుకున్నారో…..ఎక్కడెక్కడ ఆస్తులు పోగేసుకున్నారో ప్రస్తుతం గట్టెక్కేందుకు ఎంత ఖర్చు చేయనున్నారో అనే విషయాలు కూడ కామన్ మాన్ సంభాషణల్లో చర్చకు వస్తున్నాయి.

మరో వైపు మెయిన్ స్ర్టీమ్ మీడియా ఉనికినే ప్రశ్నార్దకం చేస్తూ ప్రస్తుతం సామాజిక మాద్యమాల హవా మొదలైంది. ఇందులో వాట్సప్ గ్రూపులు, ఫేస్ బుక్ లలో సంక్షిప్త సందేశాలు,  విశ్లేషణలు సమయం సందర్భోచితంగా  వైరల్ అవుతున్నాయి. అన్నిటికన్నా మించి లైక్ చేయండి…షేర్ చేయండి అంటూ మొదలయ్యే వెబ్ ఛానెళ్ళ ఎన్నికల వార్తలు అమితాసక్తిని కలిగిస్తున్నాయి.  మీడియా సంస్థలకు ఉన్నట్లు వీటికి ఏ ‘ఆబ్లిగేషన్స్’ లేక పోవడం కొంత వరకు మసాలా జోడించినవే అయినా విన సొంపు ఖంఠాలతో చేసే వ్యాఖ్యానాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

గత కొంతకాలంగా వివిద కంపెనీల మొబైల్ ఆపరేటర్లు ఒకరి కొకరు పోటీలు పడి డేటా చార్జీలు తగ్గించడం ఆండ్రాయిడ్ మొబైళ్లలో వెబ్ చానెళ్ళు  వీక్షించేందుకు అట్లాగే ఇంటర్నెట్ వార్తలు చదివేందుకు సులభం అయింది. డేటా చార్జీలు తగ్గి అందిరికి  సులభంగా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి సోషల్ మీడియా దశ తిరిగింది.  చాలావరకు ఆండ్రాయిడ్ మొబైళ్ళ దెబ్బకు టీవీల ముందు కూర్చుని వార్తలు వీక్షించే వారు తగ్గి పోతున్నారు. టివి సంస్థలు కూడ అందుకు తగ్గట్టుగా యూట్యూబ్ చానెళ్ళపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది.   టివి సంస్థల లైవ్ ప్రసారాలు వార్తలు మొబైల్ ఫోన్లలో ప్రత్యేకంగా డౌన్ లోడ్ చేసుకున్న ఆప్స్ ద్వారా  వీక్షిస్తున్నారు. అయితే ఇందులో ప్రముఖ  మీడియా సంస్థల ప్రసారాలకన్నా స్వతంత్ర వ్యక్తుల వెబ్ చానెళ్లలో ఎక్కువగా ఎడిటింగ్ లేని వార్తలు భిన్న కోణాలలో కొత్త పాయింట్లను ఎత్తి చూపుతూ ఫలానా వారికి దిమ్మ దిరిగే షాక్…….పలానా పార్టీకి ఎదురీత తప్పదా అంటూ ‘ఇన్ సైడ్ స్టోరీస్’ ఎక్స్ క్లూజివ్ స్టోరీ లంటూ వెబ్ చానెళ్లు లక్షల సంఖ్యలో వీక్షకులను అకట్టుకుంటున్నాయి.

ఇది ఒకందుకు మంచిదే అయింది. మెయిన్ స్ర్టీమ్ మీడియాకు సోషల్ మీడియా ఒక రకంగా క్రాస్ చెక్ పెట్టినట్లు అయింది. పార్టీకో మీడియా చొప్పున కొమ్ము కాస్తూ నిష్పక్షపాతమైన కాన్సెప్ట్ లేకుండా  పెయిడ్ న్యూస్ తో కమిట్ మెంట్లను అమలు చేస్తూ  పాఠకుల ఎదుట చులకనై పోయాయి. మెయిన్ స్ర్టీమ్ మీడియా వద్దనుకున్న వార్తలు  లేదంటే  కావాలనే వదిలివేసిన వార్తలను సోషల్ మీడియా ఆసక్తి కరంగా మలిచి కొంత వరకు మెప్పు పొందగలుగుతోంది.

ఇదే విషయం ఈ మధ్య బాగా బతక నేర్చిన ఓ మీడియా సంస్థ అధినేత కూడ అంగీకరించక తప్పలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు ముందుస్తు ఎన్నికలకు పోతున్నానంటూ అసెంబ్లి రద్దుకు ముందు కొంగర కలాన్ లో నిర్వహించిన సభ విజయం వంతం అయిందని మెయిన్ స్ర్టీమ్ మీడియా  బాగా ఎక్స్ ఫోజ్ చేసింది. ఎన్నికలకు పోయే ముందు ఆరంభం అదిరిపోయేలా ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్  ఆయన అనుచర వర్గం భావించింది. మెయిన్ స్ర్టీమ్ మీడియాకు కోట్ల రూపాయల ప్రకటనలు గుప్పించింది.  ఆశించిన రీతిలోనే మీడియా కెసిఆర్ కు భజన చేసింది.  కాని సోషల్ మీడియా ఆ సభ పెయిల్యూర్ ను ఎత్తి చూపింది. ఫెయిల్యూర్ తాలూకు రుజువులు పుంఖాను పుంఖాలుగా సోషల్ మీడియాలో వచ్చిన తదనంతరం కాని మెయిన్ స్ర్టీమ్ మీడియా బాసులకు పరిస్థితి తెల్సి రాలేదు.

కెసిఆర్ నూటికి నూరు శాతం సీట్లు గెలుస్తాడని ఆయనకు తిరుగు లేదని ఎపి సిఎం చంద్రబాబును కెసిఆర్ తో పెట్టుకోవద్దు సుమా అంటూ హెచ్చరిక జారి చేసి  తెలంగాణలో గెలక వద్దని సలహా ఇచ్చిన  మీడియా బాస్ ఇప్పుడు సోషల్ మీడియాను చూసి తెగ మెలికలు తిరిగి పోతున్నాడు.  పరిస్థితులు ఆయన అంచనా వేసినట్లులేక పోవడం కెసిఆర్ అసెంబ్లి రద్దు చేసిన తర్వాత రోజు రోజుకూ సీన్ మారి పోయి అఖరికి అధికార పార్టీ అభ్యర్థులను కూడ జనం వెంట పడి తరమడం చూసిన ఆ బాసు అవురా ఇది ఎంతటి వైపరీత్యం! అంటూ ముక్కునవేలేసుకున్నాడు. ఎపి బాసు ఆదేశించాడో లేక సోషల్ మీడియా క్రాస్ చెకింగ్ తో  జ్ఞానోదయం అయిందో తెలియదు కాని బాసు తెగ భాద పడిపోతున్నాడు. రాష్ర్టంలో మీడియా నిజాలు రాసే పరిస్థితి లేదని  ప్రభువుల కారణంగానే ఈ దుస్థితి నెలకొన్నదని లెంప లేసుకున్నట్లు వేదాంతం   చెబుతున్నాడు.  సోషల్ మీడియాను  మెయిన్ స్ర్టీమ్ మీడియా ఫాలోఅయ్యే పరిస్థితేమిటిరా బాబు అంటూ తల పట్టుకుంటున్నాడు. ఎందుకంటే అసలు వార్తలు కప్పి పెట్టి లేదా వదిలేసి అడ్డమైన వార్తలు రాస్తే  పబ్లిక్ గా బుక్ అయి పోవాల్సి వస్తదని ఆయన భాద పడి పోతున్నాడు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన కొత్తలోనే కెసిఆర్ ఆగ్రహానికి గురైన కారణంగా తెలంగాణ కేబుల్ ఆపరేటర్లు ఈయన గారి మీడియా ప్రసారాలు నిలిపి వేశారు. ఆ తర్వాత ఏం ఒప్పందాలు  కుదిరి పోయాయో గాని ‘బాగాకల్సి’ పోయాడు.  “పెడితే పెండ్లి కోరడం………… పెట్టక పోతే చావు కోరడం” ఈ మీడియా బాసుకు బాగా అలవాటు ఆయింది. అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణ లో రెండు రాష్ర్టాలలో దర్జాగా ఇదే వ్యాపార సూత్రం అవలంబిస్తున్నాడు ఈ పెద్ద మనిషి.

ఇక్కడ తెలంగాణ రాష్ర్ట  ప్రజానీకం ఓ విషయం ఎప్పుడూ మరిచి పోవద్దు. సోషల్ మీడియా అంటే న్యూస్ కు సంభందించిన వెబ్ సైట్లు, వెబ్ చానెళ్ళు ఆంధ్ర ప్రాంత పెత్తందార్ల చేతుల్లోనే ఎక్కువ శాతం ఉన్నాయి.  మనం పూర్తిగా వీటి మాయలో పడితే చాలా ప్రమాదం. వీటి సమాచారాన్ని  అంత సులభంగా విశ్వసించలేం. వారు ఏ ఉద్దేశంతో వార్తలు వండుతున్నారో ఎవరిని టార్గెట్ చేస్తున్నారో అర్దం చేసుకోవాలి.   వీటిని నిర్వహించే వారంతా అమ్ముడు పోలేదన్న గ్యారంటి ఏం లేదు. రాజకీయ పార్టీలు ఈ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రచారం గావిస్తున్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ అక్కౌంట్లు, వెబ్ చానెళ్ల అక్కౌంట్లు తెరిచి అందులో దూరి పోయి గందరగోళ పరుస్తున్నారు. లక్ష లాది మందితో తమ సోషల్ మీడియా సైన్యం నిర్మించుకుని క్షణాల్లో వారి వాట్సప్ గ్రూపులకు సమాచారం, సందేశాలు పంపిస్తున్నారు.  వీరి సందేశాలు  ఆయా పార్టీల కార్యకర్తలకు చేరి పోతున్నాయి. సామాన్య ప్రజలు, తటస్థులు ఈ సమాచారంతో ప్రభావితం కాగలుగుతున్నారా లేదా అనేది ప్రశ్న. ఎందుకంటే ఎవరి స్వంత డబ్బా వారే వాయించుకుంటే  జనాలకు అంతగా ఆసక్తి కలగదు. రాజకీయ పార్టీల పోస్టింగులకు ప్రభావితం అయ్యే పరిస్థితులు లేవు. అది పక్కన పెడితే స్వతంత్రంగా సోషల్ మీడియా నిర్వహిస్తున్న వారి పోస్టింగులనే వీక్షకులు  ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. ‘ఐకాచింగ్’ హెడ్డింగులతో హాట్ హాట్ గురూ….. లేటెస్ట్ అప్ డేట్స్ అంటూ  ఆండ్రాయిడ్ మొబైళ్లలో వార్తలు వడ్డిస్తున్నారు.  మెయిన్ స్ర్టీమ్ మీడియా  ఆదాయం కోసం సాధారణంగా బయటి మార్కెట్ మీద ఆధార పడుతుంది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలపైన ఆధారపడి రెవెన్యూ కోసం నానా తంటాలు పడుతుంటారు. సోషల్ మీడియాకు ప్రధాన ఆదాయం ఆన్ లైన్ ప్రచురణ సంస్థల నుండి వీక్షకుల సంఖ్యను బట్టి యాడ్స్ క్లిక్కులను బట్టి రెవెన్యూ అందుతుంది. గూగుల్  యాడ్సేన్, బిడ్వర్టైజర్ లాంటి సంస్థల ద్వారా కొద్దో గొప్పో ఆదాయం పొందుతూ సమాచారం అందిస్తున్నాయి. అట్లాగని సోషల్ మీడియా వార్తా సంస్థలు అంత నిజాయితీగా ఏం లేవు.వారిపై ఎవరి ఆజమాయిషి లేదు వార్త విషయంలో ఇష్టారాజ్యంగానే వ్యవహరిస్తున్నాయి. ఎవరైనా అభ్యంతరం అనుకుని ఫిర్యాదు చేస్తే వాటిని తొలగిస్తున్నారు.

ఇక్కడ ఇంకో ప్రధానమైన విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ర్టం కొత్తగా ఏర్పడింది. ఆంధ్ర పాలకుల  కుట్రలను భగ్నం చేస్తూ మూడు నాలుగు తరాల తెలంగాణ వాదులు పోరాడి  రాష్ర్టం సాదించుకున్నారు. నాలుగేళ్ళ తర్వాత రాజకీయ సమీకరణాలు మారి పోయాయి. పొత్తులతో ఆంధ్ర, తెలంగాణ పార్టీలు , నేతలు చేతులు కలిపి ఒక్కటయ్యారు. సోషల్ మీడియాలో డామినేట్ చేస్తున్న వెబ్ చానెల్స్, న్యూస్ వెబ్ సైట్స్ ఆంధ్ర ప్రాంతానికి చెందినవే ఎక్కువ శాతం ఉన్నాయి. సినిమా రంగంలో స్థిర పడిన వారు లేదా ఆ రంగంతో ఎక్కువగా అనుభందం కలిగిన వారు మీడియా సంస్థల్లో పనిచేసిన  వారు వీటిని నిర్వహిస్తున్నారు. అందుకే ‘సినిమా గాసిప్స్’ రాసిన అనుభవంతో  అంత సులువుగా రాజకీయ వార్తలు వండి వారుస్తున్నారు. అందులో నిజా నిజాల సంగతి మనమే తేల్చుకోవాలి.  తెలంగాణ ప్రాంతానికి చెందిన పత్రికలలాగే వారి వెబ్ సైట్లు, వెబ్ చానెళ్లు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వెబ్ చానెళ్ళు , వెబ్ సైట్లు,  సంస్థలు ఎవరివో ఎవరు నిర్వహిస్తున్నారో  వారికి ఎవరు ఆర్థిక సహాయం చేస్తున్నారో తెలంగాణ ప్రజలు పసి గట్టి అప్రమత్తంగా ఉండటం అన్ని విధాలా శ్రేయస్కరం. ఎదుకంటే సాంస్కృతిక విధ్వంసం మొదట మీడియా ద్వారానే మొదలవుతుంది. ఆంధ్ర మీడియా హౌజ్ ల పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పటికైనా అప్రమత్తంగా ఉండాల్సిందే. తెలంగాణ రాష్ర్టానికి అడుగుడుగునా అడ్డం పడి మనతో జగడం చేసిన ఆంద్ర లగడ పాటి రాజగోపాల్ చెబితే కాని మన రాష్ర్టంలో ఎవరు అధికారంలోకి వస్తారో మనకు తెలియదా ? మనతో గొడవ పెట్టుకుని ఆఖరికి సన్యాసం తీసుకున్న లగడపాటిని ఆంధ్ర ఆక్టోపస్ గా మొత్తం ఆంధ్ర మీడియా కావాలనే బాగా ఫోకస్ చేసింది.  మన రాష్ర్టంలో ఎవరు అధికారంలో ఉండాలనేది లగడ పాటి లెక్కలతో కాదు. మనం ‘ఖుద్దుగా’ లెక్కలు కట్టి నిర్ణయించాలి. ఆనేక దశాబ్దాల తర్వాత అమరుల ప్రాణత్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టంలో మరో సారి మోస పోవద్దు.  తెలంగాణ రాష్ర్టం ఏర్పిడిన తర్వాత ఇంకా హైదరాబాద్ లోనే మకాం పెట్టి ఉన్న  ఆంధ్ర ప్రాంత మీడియా మన నాయకుల వీక్ నెస్ ను పట్టేసింది. మన నాయకుల ను జుట్టు పట్టుకుని ఆంద్ర మీడియా ఇప్పటికే ఆడిస్తోంది.  మీడియా మాయలో పడకుండా తెలంగాణ ప్రాంత నేతలు ప్రజలు  స్వంత బుర్రతో ఆలోచించి విజ్ఞతతో వ్యవహరించాలి.

ఫేస్ బుక్  అయినా  గూగుల్ అయినా యూట్యూబ్  అయినా వాట్సాప్ అయినా ట్విట్టర్ అయినా వాటికి వ్యాపార దృక్ఫథం ప్రధానం. కాసుల ఆశ చూపి వీటిని కూడ రాజకీయ పార్టీలు నేతలు కొనుగోలు చేసినా పెద్దగా ఆశ్చర్యం లేదు.  ఫేస్ బుక్ లో ఒక్కో పోస్టింగ్ కు ఎక్కువ లైకులు రావాలన్నా ఎక్కువ మంది చూడాలన్నా డబ్బులు చెల్లించి ప్రమోట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ మాద్యమాలతో జాగ్రత్తగా మెదలాలి. వార్తలను గుడ్డిగా నమ్మే పరిస్థితి ఉండకూడదు.  వాస్తవాలు ఏమిటో ప్రజలే తమకు అందుబాటులో ఉన్న సాదనా సంపత్తుల ద్వారా బేరీజు వేసుకోవాలి. ఆనాలోచితంగా ఎవరో చెప్పగా విని మంచి చెడుల అంచనాలకు రావడం కంటే ఆలోలించి మంచి నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ కు అన్ని విధాలా శ్రేయస్కరం.

కూన మహేందర్

సీనియర్ జర్నలిస్ట్

(ప్రజాతంత్ర దినపత్రిక 23-11-2018 )

 

లైక్ చేయండి……షేర్ చేయండి కాని ఆంధ్ర మీడియా మాయలో పడకండి Reviewed by on . మెయిన్ స్ర్టీమ్ మీడియా వర్సెస్ సోషల్ మీడియా [caption id="attachment_5027" align="aligncenter" width="700"] Social Media Social Networking Technology Connection మెయిన్ స్ర్టీమ్ మీడియా వర్సెస్ సోషల్ మీడియా [caption id="attachment_5027" align="aligncenter" width="700"] Social Media Social Networking Technology Connection Rating: 0
scroll to top