Friday , 19 July 2019

Home » Slider News » రైతే రాజు ఎజెండా – 2019 ఎన్నికలు గట్టెక్కడమే లక్ష్యం

రైతే రాజు ఎజెండా – 2019 ఎన్నికలు గట్టెక్కడమే లక్ష్యం

December 26, 2018 10:52 am by: Category: Slider News, ఫోకస్ Comments Off on రైతే రాజు ఎజెండా – 2019 ఎన్నికలు గట్టెక్కడమే లక్ష్యం A+ / A-

పావులు కదుపుతున్న పార్టీలు

 

Farmers Rally Delhiదేశ వ్యాప్తంగా రాజకీయాలన్ని ఇప్పుడు రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఇంత కాలం రైతుల శ్రేయస్సు కోసం ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప వారికి పెద్దగా చేసిన ఉపకరణం అంటూ ఏమి లేదు. దేశ వ్యాప్తంగా అందుకే రైతుల్లో ఆసహనం పెల్లుబికింది. రైతుల్లో సహనం నశించి ఏకంగా ఢిల్లీ బాట పట్టినప్పటి నుండి రాజకీయ పార్టీలకు భయం పట్టుకుంది. రైతుల మెప్పు పొందే వ్యూహ రచనల్లో పార్టీలు సమాలోచనలు జరుపుతున్నాయి. పార్టీల ఎన్నికల ఎజెండాల్లో రైతు ప్రధాన ఎజండాగా చేరి పోయాడు.

2019 ఎన్నికల్లో గట్టెక్కడమే ధ్యేయంగా  రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి.

స్వాతంత్రం అనంతరం ఏడు దశాబ్దాలుగా రైతులకు ప్రభుత్వం పెద్దగా ఒరగ బెట్టింది లేదు. వారి ఖర్మకు వారిని వదిలి వేశారు. ప్రకృతి వైపరీత్యాలకు తోడు పాలకుల వైపరీత్యాలు తోడై రైతుల బతుకు చిందరవందర అయింది. వ్యవసాయం గిట్టుబాటు కాక తిండి గింజలు పండించ లేక రుణ భారం పెరిగి ఆదుకునే వారు లేక రైతులు “అరి గోస” పడ్డారు.  దేశ వ్యాప్తంగా  క్రమంగా వ్యవసాయానికి దూరమవుతున్న రైతుల సంఖ్య  రోజు రోజుకూ గరిష్టస్థాయిలో తగ్గి పోతున్నది. ప్రతి 12 గంటలకు (అర పూట) కు 2,035 మంది రైతుల చొప్పున వ్యవసాయానికి దూరం అవుతున్నారు. ఇందులో కొందరు పూర్తిగా వలస బాటలు పట్టి ఇతర రంగాల కూలి పనుల వైపు మళ్లగా మరి కొందరు వ్యవసాయ కూలీలుగా మిగిలిపోతున్నారని ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ మాన్ పవర్ రిసెర్చ్ సంస్థ అధ్యయనంలో పేర్కొంది.

ఒకప్పుడు 80 శాతానికి పైగా  మన దేశ జనాభ వ్యవసాయ రంగంపై ఆధార పడగా ప్రస్తుతం ఆ సంఖ్య 53 శాతానికి పడి పోయింది.  ఈ రంగానికి దూర మవుతున్న వారి సంఖ్య అట్లా ఉంటే ఈ రంగంలో దివాలా తీసిన రైతులు ఇతర రంగాలకు బదిలీ కాలేక తనువులు చాలిస్తున్న వారు లక్షల సంఖ్యల్లో ఉన్నారు. జాతీయ నేర పరిశోథన విభాగం నివేదిక ప్రకారం రెండు దశాబ్దాల కాలంలో అంటే 1995-2015 వరకు దేశంలో 3 లక్షల 18 వేల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 2016లో 11,370 మంది రైతుల బలవన్మరణాలు జరిగాయి. దేశంలో సగటున గంటకో రైతు చొప్పన అంపశయ్య నెక్కుతున్నాడు.

ఈ పాలకులు ఆ పాలకులు అంటూ పాలకుల్లో తేడా లేదు. పాలకులు అందరూ కల్సి చేసిన నిర్వాకానికి రైతులు బలయ్యారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టి అధికారం లోకి వచ్చిన తర్వాత రైతుల్లో తీవ్ర  అసహనం పెరిగింది. దేశ వ్యాప్తంగా గతంలో ఎన్నడూలేని విదంగా రైతులు పోరు బాట బట్టారు. వర్షాభావ పరిస్థితులు..కరవు…పండించిన వాటికి గిట్టు బాటు ధరలు లేకపోవడం వ్యవసాయ సంక్షోభానికి దారి తీసింది.

అదేం విచిత్రమో కాని బిజెపి కి ఉల్లి గడ్డకు అవినాభావ సంభందాలు కనిపిస్తాయి. గతంలో బిజెపి అధికారంలో ఉన్నపుడు ఉల్లి గడ్డ ధరలు మండిపడ్డాయి. ఇప్పుడేమో ఉల్లి గడ్డలకు మార్కెట్ లో ధర లేదు. మాహారాష్ర్టలో ఉల్లి గడ్డలకు మద్దతు ధర లేక  విక్రయాలకు తెచ్చిన  రైతులు  ఆగ్రహంతో వాటిని రోడ్లపాలు చేసారు.

మహారాష్ర్టలోని నాసిక్ జిల్లాకు చెందిన సత్తి అనే ఉల్లి రైతు 750 కిలోల ఉల్లి గడ్డలు మార్కెట్ కు తీసుకు వెళ్లగా కిలోకు రూ 1.40 పైసలు వచ్చాయి. ఆ రైతు పండించిన ఉల్లి గడ్డలు 750 కిలోలకు మొత్తం రూ 1,064 వచ్చాయి. గుండె తరుక్కుపోయిన రైతు భాదతో ఆ డబ్బులను ఇంటికి తీసుకు వెళ్ల లేక ప్రధాన మంత్రి నరేంద్ర  మోది వెల్ఫేర్ ఫండ్ కు నవంబర్ 2018 లో మని ఆర్డర్ చేశాడు. గతంలో అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్న బరాక్ ఒబామా ఇండియాకు వచ్చినపుడు ఆయనను కల్సుకున్న  రైతుల బృందంలో సత్తె కూడ ఉన్నారు. ఆనాడు ప్రభుత్వమే అతన్ని ఎంపిక చేసింది.

మద్దతు ధరలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనపుడు రైతులు తీవ్ర సంక్షోభం ఎదుర్కుంటున్నారు. అందుకే మరాఠ రైతులు దేశంలో మొదట పోరు బాట పట్టారు.  మహారాష్ర్టలో బిజెపి అధికారం లోకి వచ్చిన ఏడాది నుండే రైతులు తమ ఆందోళనలు ఉధృతం చేశారు. గత ఏడాది నుండి వారి ఆందోళనలు ఉధృత రూపం దాల్చాయి. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆరు నెలల పాటు తమ ఉత్పత్తులను రోడ్ల పాలు చేసి నిరసన తెలిపారు. గిట్టు బాటు కావడం లేదని పాలు రోడ్లపై కుమ్మరించారు. కూరగాయలు వెదజల్లారు.  వేలాది మంది రైతులు 2018 మార్చి 6 న నాసిక్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 11వ తేదీకి ముంబై చేరుకున్నారు. వీరు ఆరు రోజుల పాటు 180 కిలోమీటర్లు కాళ్లు బొబ్బలెక్కేలా నడిచి మహారాష్ర్ట  అసెంబ్లీని ముట్టడించారు. రైతుల నిరసన సెగ తగలడంతో ముఖ్యమంత్రి ఫడ్నవీస్  దిగి వచ్చి రైతు ప్రతినిధులతో అసెంబ్లీలోనే చర్చలు జరిపి వారి డిమాండ్ల అమలుకు లిఖిత పూర్వక హామీలిచ్చారు. మహారాష్ర్టలో ఫడ్నవీస్ ప్రభుత్వం రుణ మాఫి ప్రకటించక తప్ప లేదు.

మహారాష్ర్ట రైతుల లాంగ్ మార్చ్ ఈ దేశంలో రైతుల భవిష్యత్ కు భరోసా ఇచ్చింది. అత్మ హత్యలు అనివార్యం కాదని పోరాటం ఒక్కటే మార్గమని రైతుల్లో ఆత్మవిశ్వాసం కలిగించింది. అంతకు ముందు డిల్లీలో తమిళ నాడు రైతులు రుణ మాఫి కోసం 2017 సంవత్సరంలో సుదీర్ఘంగా రోజుల తరబడి రక రకాల రూపాలలో నిరసనలు తెలిపారు. అయినా కేంద్ర పాలకులకు కనువిప్పు కలుగ లేదు. చివరికి సుప్రీం కోర్టు కలుగ జేసుకుని రైతుల సమస్యలు పరిష్కరించాలని తమిళ నాడు రాష్ర్ట ప్రభుత్వాన్ని ఆదేశించింది.

2018  నవంబర్ చివరి వారంలో (28,29,30) రైతుల పార్లమెంట్ మార్చ్ దేశ చరిత్రలో ఓ మైలు రాయి. ఇది కేంద్ర ప్రభుత్వంపై  రైతులు చేసిన దండ యాత్ర . అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటి అధ్వర్యంలో జరిగిన చారిత్రాత్మక మార్చ్ లో ఉత్తర. దక్షిణ ప్రాంతాలకు చెందిన పలు రాష్ర్టాల రైతులు కదం తొక్కారు. రైతులకు శాశ్వత రుణ విముక్తి తో పాటు పంటలకు మద్దతు ధర పై బిల్లులు తీసుకు వచ్చేందుకు పార్లెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలనే ప్రధాన డిమాండ్లతో ర్యాలి సాగింది. ఈ ర్యాలి అధికార భారతీయ జనత పార్టి నేతృత్వంలోని ఏన్ డిఏ ప్రభుత్వ చేతకాని తనానికి తార్కానం. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన 12 నెలల్లో స్వామినాధన్ కమీషన్ సిఫార్సులు అమలు చేస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం చాటేసింది.

2004 లో యుపిఏ ప్రభుత్వంలో  వ్యవసాయ శాస్ర్త వేత్త హరిత క్రాంతి మార్గదర్శి  ఎం.ఎస్‌ స్వామినాథన్‌ అద్వర్యంలో  కమీషన్ ఏర్పాటు అయింది. రైతాంగ సమస్యలు అధ్యయనం  చేసిన ఈ కమీషన్ 2006 లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. యుపిఏ ఒకటి రెండు ప్రభుత్వాలు స్వామి నాదన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయ లేదు. కాని  రైతుల పంట పెట్టు బడి పరపతి రుణాలు గతంలో కంటే రెట్టింపు చేసాయి.

బిజెపి ప్రభుత్వం మాత్రం తాము అధికారంలోకి వస్తే 12 నెలల్లో స్వామి నాధన్ సిఫార్సులు అమలు చేస్తామని హామి ఇచ్చి నెర వేర్చ లేక పోయింది.

అందుకే కేంద్ర పాలకులకు కనువిప్పు కలిగించాలని రైతులు డిల్లీ  పుర వీధుల్లో గర్జించారు. మట్టి పిసికే చేతులతో ఏమవుతుందనుకున్న పాలకులను అవే మట్టి చేతులతో జుట్టు పట్టి ఈడ్చినంత పనిచేశారు. రైతులు తల్చుకుంటే ఢిల్లీ ఎంతో దూరం కాదని నిరూపించారు. పాలకుల భండారాన్ని బట్ట బయలు చేశారు. భారత దేశ చరిత్రలో ఇదో చారిత్రక ఘట్టం.

రైతుల మేలు కోరని పాలకులకు ఇక నుండి అధో గతి పాలు తప్పదని ఈ ర్యాలీతో ఓహెచ్చరిక చేశారు. అన్నంత రీతిలోనే అదే సమయంలో జరిగిన ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో రైతులు అధికార బిజెపికి గుణపాఠం నేర్పారు. మీపాలన ఇక చాలని   సాదరంగా ఇంటికి సాగ నంపారు. దరిమిలా రక రకాల రాయితీలు, రూణమాఫీలు రాజకీయ పార్టీల ఎజెండాలో ప్రస్తుతం  వేగంగా చేరి పోతున్నాయి. రణమాఫి వాగ్దానంతో మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, రాజస్థాన్ మూడు రాష్ర్టాలలో అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ పార్టి అర్జంటుగా కసరత్తు మొదలు పెట్టింది. అన్ని రాజకీయ పార్టీలు  రానున్న ఎన్నికల్లో రైతే కేంద్రంగా పథకాలు రచిస్తున్నాయి.  రైతులను ప్రసన్నం చేసుకుని అధికారం నిలుపు కోవాలని లేదా అధికారంలోకి రావాలని తాపత్రయ పడుతున్నాయి.

2019 ఎన్నికలలో ఎట్లాగైనా రైతుల ఓట్లు రాబట్టు కోవాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రేపో మాపో ఏదో ఒక రైతు ఆకర్షక పథకం లేదంటే  దేశ వ్యాప్తంగా రైతు రుణ మాఫి పథకం ప్రకటించాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు  వెలు వడుతున్నాయి.  ఎందుకంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోది దేశ వ్యాప్తంగా రైతుల రుణ మాఫి ఎందుకు ప్రకటించడం లేదని కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు రాహుల్ గాంధి ఓ వైపు మోదీని నిలదీస్తున్నారు. ఓకవేళ మోది రుణ  మాఫి లేదా రైతులను ఆదుకునే పథకాలు ప్రకటించక పోయినా 2019 ఎన్నికల్లో ఆయనకు గడ్డు రోజులు తప్పవు.

తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రైతుల రుణ మాఫి చేసి తీరుతామని రాహుల్ గాంధి ఇప్పటికే ఓ వాగ్దానం కూడ చేసాడు కనుక మోదీకి వేరే తరుణోపాయం లేదు.

 

అనిల్ అంబాని సహా 15 మంది మోది – అమిత్ షా అనుంగ పారిశ్రామిక వేత్తలు చెల్లించాల్సిన 3,5 లక్షల కోట్ల రుణాల మాఫి  ఇప్పటికే జరిగి పోయిందని రైతుల రుణాలు ఎందుకు  మాఫి చేయడం లేదని రాహుల్ గాంది సందిస్తున్న ప్రశ్నల పరంపర నుండి నరేంద్ర మోది తప్పించు కోలేని పరిస్థితి నెలకొంది.  మోది కేవలం కార్పోరేట్ల  బడా బాబుల సేవలకే పరిమితమై  పేదలను పట్టించు కోవడం లేదని రాహుల్ గాంధి దుయ్య బడుతున్నాడు.

ఎవరైనా నిజంగా రైతులకు మేలు తలపెట్టాలనే చిత్తశుద్దితో ఉంటే సంతోషమే కాని రాజకీయపార్టీలు కేవలం రైతుల ఓట్ల కోసమే అయితే అంతకన్నా మించిన వంచన మరొకటి ఉండదు.

రైతు కేంద్రంగా రాజకీయాలు నడుస్తుంటే  రైతుల రుణ మాఫి విషయంలో కొందరు సమర్దిస్తూ  కొందరు వ్యతిరేకిస్తూ చాలా చర్చలు జరుగుతున్నాయి.  ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు మరో విదంగా ఉన్నాయి.  రైతు రుణమాఫీ పథకాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరించారు. రుణ మాఫి పథకాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావాన్ని చూపుతాయని ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని పేదలకు కాకుండా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

రుఘరాం రాజన్ చేసిన హెచ్చరికను కూడ పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఈ పథకాన్ని కేంద్రం ప్రకటిస్తే రాష్ర్టాలు ఆర్థిక భారం నుండి తప్పించు కోగలుగుతాయి.  లేదంటే ఆర్థిక వెసులు బాటు లేని రాష్ర్టాలకు ఈ రుణ మాఫి గగనం అవుతుంది.

దేశంలో రైతుల సమస్యలంటే చిన్న సన్నకారు , మద్య తరగతి రైతులనే విషయం మరిచి పోవద్దు. ఆర్థిక సమస్యలు ఎక్కువ శాతం ఈ క్యాటగరీల రైతులనే భాదిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి దూరమవుతున్నది కూడ ఎక్కువగా ఈ వర్గం రైతులే. బడా రైతులకు రుణ మాఫి చేసినా చేయక పోయినా పంట పెట్టు బడుల సహాయం అందినా అందక పోయినా పెద్దగా నష్టం లేదు. రుణ మాఫీలో అట్లాగే ఇతర రాయితి పథకాలలో  ధనిక పేద తరగతుల వారికి ఆర్థిక పరిమితులు విధిస్తే  ప్రభుత్వ ఖజానా పై భారం కూడ చాలా తగ్గుతుంది.

రైతులకు రాయితీలు ఇస్తే ఆర్థిక నిపుణులు భయపడ్డట్లుగా కొంపలేం మునగవనే వాదనల ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోది తన స్వంత రాష్ర్టం అయిన గుజరాత్ లో నర్మదా నది తీరాన  మూడువేల కోట్ల రూపాయలు వ్యయ్యం చేసి నిర్మించిన సర్దార్ వల్లభ్ బాయ్ పటేల్ విగ్రహం నిర్మించినపుడు విగ్రహాలకు ఇన్ని  వేలకోట్లా అంటూ సోషల్ మీడియాలో అవాక్కయ్యారు. ఇలాంటి విగ్రహాలకు ఱ్చు చేసే బదులురులను ఆదుకుంటే బాగుండేదని సలహాలు కూడ ఇచ్చారు.  మోది నిజంగా  సర్దార్ పటేల్ పేరిట రైతులను అదుకునే పథకం అమలుచేస్తే ఆయనకు రెట్టింపు ఖ్యాతి మిగిలి ఉండేది.

బడా పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే రాయితీలతో పోలిస్తే  రైతులకు ఇచ్చేది చాలాతక్కువే అవుతుంది. ఓట్ల కోసం  అప్పటి కప్పుడు ప్రజాకర్షక పథకాలు రూపొందించి అమలు చేసే కన్నా రైతులకు శాశ్వత ప్రయోజనాలు కలిగించే  పథకాలు రూపొందించి అమలు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుంది.  ఎన్నికలకు వెళ్ళే ఆ ఒక్క ఏడాది రుణ మాఫి ప్రకటించడం  ఆ తర్వాత ఐదేళ్ళు  రైతుల సమస్యలు పట్టించు కోక పోయే ప్రమాదం లేక పోలేదు. రుణ మాఫీ, నేరుగా నగదు బదిలి చేసయడం కన్నా రైతుల ఉత్పత్తులకు సరైన మద్దతు థరలు  కల్పిస్తే ప్రయోజనంగ ఉంటుంది.  రైతులు ఆర్థిక పరిపుష్టితో స్వయం సమృద్ది సాధించే దిశగా ప్రభుత్వాల ఆలోచనలు ఉండాలి. స్వామి నాదన్ సిఫార్సులు అమలు చేస్తే చాలా వరకు రైతుల సమస్యకు పరిష్కారం ఏర్పడుతుంది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల సరఫరా మొదలు మార్కెట్లలో తగిన మౌలిక వసతులు కల్పించడం ఇన్ పుట్ సబ్సిడి పెంచడం వంటి ప్రయోజనాతో పాటే ఉత్పత్తులకు అయ్యే వ్యయంలో రెట్టింపు మద్దతు థర కల్పించాలన్న స్వామి నాధన్ ప్రతిపాదనలు అమలు చేస్తే రైతులకు మేలు చేసిన వారవుతారు.

 

కూన మహేందర్

సీనియర్ జర్నలిస్ట్

ప్రజాతంత్ర దినపత్రిక 26-12-2018

 

 

 

 

 

 

 

 

 

 

రైతే రాజు ఎజెండా – 2019 ఎన్నికలు గట్టెక్కడమే లక్ష్యం Reviewed by on . పావులు కదుపుతున్న పార్టీలు   దేశ వ్యాప్తంగా రాజకీయాలన్ని ఇప్పుడు రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఇంత కాలం రైతుల శ్రేయస్సు కోసం ఉపన్యాసాలు ఇవ్వ పావులు కదుపుతున్న పార్టీలు   దేశ వ్యాప్తంగా రాజకీయాలన్ని ఇప్పుడు రైతుల చుట్టూ తిరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు ఇంత కాలం రైతుల శ్రేయస్సు కోసం ఉపన్యాసాలు ఇవ్వ Rating: 0
scroll to top