Friday , 19 July 2019

Home » Slider News » రాజకీయ కళ ఉంటేనే రాజ యోగం …..కాసులున్న వారే పాసవుతారు

రాజకీయ కళ ఉంటేనే రాజ యోగం …..కాసులున్న వారే పాసవుతారు

December 2, 2018 10:36 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on రాజకీయ కళ ఉంటేనే రాజ యోగం …..కాసులున్న వారే పాసవుతారు A+ / A-

ఎలక్షన్ మేనేజ్ మెంట్ ఓ బిగ్ టాస్క్ గురూ…..

 

E Taskఎన్నికల్లో ఎవరి మెడలో పూల దండ పడుతుంది……విజయం ఎవరిని వరిస్తుందంటే ఈ రోజుల్లో ఓటర్లను బాగా మేనేజ్ చేయగలిగిన వారిని. ఎలక్షన్ మేనేజ్ మెంట్ అనేది ఓ “బిగ్ టాస్క్”. ఇది అందరికి సాధ్యం అయ్యే పని కాదు. అఫ్ కోర్స్ మేనేజ్ మెంట్ లో ప్రధాన భూమిక పోషించేది డబ్బే అయినా  అదొక్కటే ఉంటే సరిపోదు. కేవలం డబ్బులు వెదజల్లి నంత మాత్రాన గెలుపు సాధ్యం కాదు. ఇట్లా డబ్బులను నమ్ముకున్న వారంతా బోల్తా పడ్డ ఉదాహరణలు ఉన్నాయి. అయితే డబ్బులు లేకుండా ఇతరత్రా అన్ని  అర్హతలు ఉన్నా గెలుపు కష్టమే అని చెప్ప వచ్చు. అన్నిట్లో ఆరి తేరి వాటికి తోడు డబ్బులుండి తీరాలి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో  ఇదంతా ఓకళ…..ఈ రాజకీయ కళ ఉన్న వారినే రాజఠీవి వరిస్తుంది.

గెలుపుకు అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అభ్యర్థి గుణగణాల నుండి మొదలు ఏ పార్టి నుండి పోటి చేస్తున్నది  ఏ కులానికి, ఏ మతానికి చెందినది అతనికి ప్రజలతో ఉన్న సంభంధ భాందవ్యాలు తదితర అంశాలతో పాటు గెలిచినా ఓడినా ప్రజాసంభందాలు నెరప గలరా లేదా అనేది కూడ ప్రధానంగా చూస్తారు. గెలుపు ఓటములు బేరీజు వేసుకోకుండా నిత్యం ప్రజా సంభందాలు నెరిపే వారికి ప్రజలకు తోడు నీడగా ఉండే వారికి ఏ అర్ద రాత్రి తలుపు తట్టినా లేచే వారికి ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.

పార్టీల హవా ఉండి ప్రజలు నీరాజనం పట్టిన సందర్భాలలో పరిస్థితులు వేరు. 1983 లో ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టి ఏర్పాటు చేసినపుడు అనామకులు అనేక మంది ఎన్టీఆర్ అభిమానులు, విద్యాధికులు, వెనుకబడిన బడుగు వర్గాల వారు హవాలో గెలిచి రాజకీయ యోగం పొందారు. ఆతర్వాత ఇట్లాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీ ఆవిర్భావంతో కొందరికి దక్కాయి..

ఏ హవా లేనపుడు అభ్యర్థులు ఎన్నికల సమరంలో గట్టెక్కడం ఏటికి ఎదురీది నంత కష్టం అవుతుంది. ప్రస్తుత ఎన్నికలు అన్ని పార్టీల అభ్యర్థులకు అగ్ని పరీక్షగానే ఉన్నాయి. డబ్బులు మంచి నీళ్ల ప్రవాహం అయ్యాయి. ఓటర్లను మద్యం మత్తు ఓలలాడిస్తోంది. సభలు, ఊరేగింపులు జెండాల రెపరెపలతో జన ప్రవాహం పరవళ్లు తొక్కు తోంది.

ఎన్నికల నియమ నిభందనలు ఎట్లా ఉన్నా అభ్యర్థుల వ్యయం చూస్తే కళ్లు బైర్లు కమ్మక తప్పదు. గత ఎన్నికల వరకు అంటే 2014 వరకు ఎన్నికల వ్యయం సాధారణంగా తక్కువలో తక్కువ మూడు నాలుగు కోట్లనుండి ఏ ఎనిమిది కోట్ల వరకు అంతకు మించి గట్టి అభ్యర్థుల పోటా పోటి ఉన్న చోట 10 కోట్ల వరకు ఖర్చు జరిగాయనిఓ సాధారణ అంచనా. ప్రస్తుతం ఆమాంతం ఎన్నికల ఖర్చు రెండింతలు అయిందని అభ్యర్థులే ఆందోళన చెందుతున్నారు.

ఈ వ్యయం పెరిగేందుకు కారణం  కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతరత్రా బాగా డబ్బులు పోగేసుకున్న వాళ్లు  రాజకీయాల లోకి దూరి పోవడమే నని చెప్పవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే డబ్బులున్న వాళ్లు రాజకీయ నాయకులకు చందాలు ఇచ్చి ఇచ్చి చివరికి వారే  డబ్బులు పడేసి స్వయంగా రాజకీయాలలో చేరి పోయారు. ఇలాంటి వారు అటు రాజకీయాలు ఇటు వ్యాపారాలు చేస్తూ యధేచ్ఛగా చట్టం కండ్డ్డ్డ్లు కప్పి జోడు గుర్రాల స్వారి చేస్తున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా వేళ్లూనుకున్న తర్వాత ఈ రంగంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంభందం ఉన్న వాళ్ళు  భందు మిత్రులతో వ్యాపార లావాదేవీలు కొనసాగించిన వాళ్లు ఎన్నికల సమరంలో విచ్చల విడిగా చేసే వ్యయంతో ప్రత్యర్థులు చిత్తవుతున్నారు.

ప్రస్తుతం ఓటుకు రెండు వోలనోటు ఇవ్వక తప్పటం లేదంటూ కొన్ని చోట్ల ఆభ్యర్థుల భాద పడిపోతున్నారు. ఇది డిమానటైజేషన్ ప్రబావం మరి. పెద్ద నోట్ల రద్దు  ఎఫెక్ట్ బాగా పడిందని ముచ్చట సందర్భంగా ఓ అభ్యర్థి అనుచరుడు చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థులు ఆర్థికంగా బలంగా ఉన్న చోట వోటర్లు 500 నోటు ఇస్తే  ఎగా దిగా చూస్తున్నారట.  దానికి మించిన వేయి రూపాయల నోటు ఇచ్చేందుకు లేదని ఇస్తే రెండు వేల నోటు ఇవ్వాల్సి వస్తోందని ఇట్లా ఆర్థిక భారం బాగా పడుతోందట. ఓటర్లకు డబ్బులు పంచడం ఎంతో  నైపుణ్యంతో కూడిన పని. అందరికి ఈ పని చేత కాదు. ఖచ్చితంగా ఓటర్లకు చేరే విదంగా పంచాలి. అందు కోసం నమ్మకం, విశ్వాసం కలిగిన వారిని ఎంపిక చేసుకుంటుంటారు.

పొదుపు సంఘాలు ఏర్పాటైన తర్వాత డబ్బులు పంచడం  చాలా తేలి కైంది. ఇంకొన్ని చోట్ల మహిళలు, పురుషలతో నడిచే  పరపతి సంఘాలు ఉన్నాయి. వందలు వేల సంఖ్యలో ఈ సంఘాలలో సభ్యత్వాలు ఉన్నాయి. కులాల వారీగా కూడ సంఘాలు ఉన్నాయి.  పరపతి సంఘాలకు పొదుపు సంఘాలకు అట్లాగే యువజన సంఘాలు ఉన్న చోట వారికి డబ్బులు చేరేలా ప్లాన్ చేస్తారు. కాని వారు ఎవరికి ఓటు వేస్తారో ఎవరికి తెలియదు.

పేద జనం నివసించే స్లమ్ ఏరియాల్లో డబ్బులు పంచందే ఓటర్లు పోలింగ్ బూతులకు రారు. ఆయా ప్రాంతాలకు చెందిన “బుడ్డ లీడర్ల” చెప్పు చేతుల్లో అక్కడి జనం ఉంటారు. ఈ బుడ్డ లీడర్ల మీదే అన్ని పనులకు పేద జనం ఆధార పడి ఉంటారు. కనుకు వారు చెప్పినట్లు వినక తప్పుదు. ఈ బుడ్డ లీడర్లనే అభ్యర్తులు వెదికి పట్టుకుని పంపకాలు కొనసాగిస్తారు.

ఇదంతా ఎలక్షన్ కమీషన్ కంట పడకుండా చెవిన పడ కుండా గుట్టుగానే కొన సాగే వ్యవహారం. తనిఖీల పేరిట ఎన్నికల కమీషన్ నిఘా వర్గాలకు లభిస్తున్న డబ్బు చూస్తే కోట్లలో మనకు కనిపించినా అభ్యర్థులు ఖర్చు చేస్తున్న దాంట్లో ఒక్క వంతు కూడ కాదని చెప్ప వచ్చు.

ప్రచారంలో మరో పెద్ద టాస్క్ మీడియాలో ప్రచారం. మీడియాలో  పెయిడ్ న్యూస్ వ్యవహారం పరిశీలిద్దాం. పెయిడ్ న్యూస్ వ్యవహారంపై జర్నలిస్టు సంఘాలు గతంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసి  జర్నలిస్టు సంఘం సీనియర్ నాయకుడు కె శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో ఎన్నికల కమీషన్ కు ఓ రిపోర్టు సబ్మిట్ చేశారు. కాని ఇంత వరకు ఏ చర్యలు లేవు. విధి విధానాలు ఖఠిన తరం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకోలేదు. చట్ట సభల్లో  అందుకు తగిన  చట్టాలు రూపొందించబడ లేదు.

ఇచ్చే వారుండగా పుచ్చుకోకుండా ఉంటామా అంటూ మీడియా సంస్థలు  అభ్యర్థుల నుండి వివిద పాకేజీల పేరిట వసూళ్లు చేస్తున్నాయి. ఇందులో జర్నలిస్టులకు కొంత పర్సెంటేజీలు అందుతుండడంతో పెయిడ్ న్యూస్ బిజినెస్ బాగానే సాగు తోంది. పెయిడ్ న్యూస్ అంటే ఆ అభ్యర్థి ఆ రోజు సాగించిన ప్రచారం పై వార్తలు ఫోటోలు వేసి ప్రచురించడం. అభ్యర్థులు

“పే చేయక పోతే” న్యూస్ కనిపించవు.  సమాచార శాఖ నేతృత్వంలో స్థానిక జర్నలిస్టులు సభ్యులుగా నిఘా కమిటీలు ఏర్పాటు చేసినా ఈ పెయిడ్ న్యూస్ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మెయిన్ స్ర్టీమ్ పత్రికలు ఒక్కో జిల్లాకు కోట్ల రూపాయల  చొప్పున టార్గెట్  విధించి జర్నలిస్టులు అడ్వర్టైజ్ మెంట్  సిబ్బందితో వ్యాపారం చేయిస్తున్నాయి.

ఇంతటి వ్యయ ప్రయాసాలతో కూడుకున్న ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఎవరు పట్టించుకుంటారు? కామన్ మ్యాన్ చట్ట సభల్లో అడుగుపెట్టడం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యంగా చెప్పుకునే మనదేశంలో  ఇక సాధ్యం కాదా ?

రక్త పాతం లేని యుద్దం ఓటింగ్….రక్తపు మరకలు లేని ఆయుధం ఓటు కాని రాజ్యాంగ స్ఫూర్తి ఏమైపోతున్నట్లు?

రాంజ్యాంగ రచన సందర్బంగా కొందరు పెద్దలు పన్నులు చెల్లించే వారికే ఓటు హక్కు కల్పించాలని ప్రతిపాదించారు. కొందరు రాయల్ ఫ్యామిలీస్ కు మాత్రమే ఓటు హక్కు పరిమితం చేయాలని ప్రతిపాదించారు. కాని బాబా సాహెబ్ అంబేద్కర్ మాత్రం ఆ ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ భారత దేశంలో జన్మించిన ప్రతి వయోజనుడికి ఓటు హక్కు కల్పిస్తూ రాజ్యాంగంలో పొందు పరిచాడు.

ప్రజాప్రాతినిధ్య చట్టం 326 ప్రకారం భారత రాజ్యాంగం సార్వత్రిక ఓటు హక్కును కల్పించింది. 18 ఏళ్ళ వయసుకు తక్కువ కాని ప్రతి ఒక్క భారతీయ పౌరుడు భారత లోక్‌సభకు , రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. పాలకులు ఎవరో నిర్ణయించ వచ్చు. గెలుపు కోసం అధికారం కోసం నానా గడ్డి కరుస్తూ అడ్డమైన విధానాలు అవలంబిస్తుండ బట్టే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోంది. పౌర స్పృహతో .  ప్రజాస్వామిక సంస్కారం ప్రదర్శించినపుడు కామన్ మ్యాన్ బతుకు కామన్ చేతుల్లో ఉంటుంది.  లేదంటే మన చేతుల్లో కాసులు పడేసి పాలించినన్ని రోజులు మనల్ని కాల్చుకు తినే వారి చేతుల్లోనే ఉంటుంది.

 

ప్రజాతంత్ర దిన పత్రిక లింకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కూన మహేందర్

సీనియర్ జర్నలిస్ట్

ప్రజాతంత్ర దినపత్రిక 2-11-2018

 

రాజకీయ కళ ఉంటేనే రాజ యోగం …..కాసులున్న వారే పాసవుతారు Reviewed by on . ఎలక్షన్ మేనేజ్ మెంట్ ఓ బిగ్ టాస్క్ గురూ.....   ఎన్నికల్లో ఎవరి మెడలో పూల దండ పడుతుంది......విజయం ఎవరిని వరిస్తుందంటే ఈ రోజుల్లో ఓటర్లను బాగా మేనేజ్ చేయగలిగ ఎలక్షన్ మేనేజ్ మెంట్ ఓ బిగ్ టాస్క్ గురూ.....   ఎన్నికల్లో ఎవరి మెడలో పూల దండ పడుతుంది......విజయం ఎవరిని వరిస్తుందంటే ఈ రోజుల్లో ఓటర్లను బాగా మేనేజ్ చేయగలిగ Rating: 0
scroll to top