Saturday , 24 August 2019

Home » Slider News » రాజకీయాలకో దండం…….ప్రజలవెంటే కోదండం

రాజకీయాలకో దండం…….ప్రజలవెంటే కోదండం

December 26, 2016 6:07 pm by: Category: Slider News, ఫోకస్ Leave a comment A+ / A-

ప్రజా సమస్యలే ఎజెండాగా టిజేఏసి పయనం

మండువ రవీందర్ రావుmanduva-ravinder-rao-senior-journalist-copy
ప్రజాతంత్ర దిన పత్రిక ఎడిటోరిల్
(26-12-2014)meravhi-w038_g4_hy_2921659g
తెలంగాణ సాధనతోపాటు అభివృద్దే ప్రధాన ద్యేయంగా ఆవిర్భవించిన తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటి (జెఏసి) తన లక్ష్యాన్ని చేరుకునే దిశలో అడుగులు వేస్తోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు తెలంగాణ రాష్ట్ర సాధనే ద్యేయంగా పనిచేసిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత ప్రజా సంక్షేమం విషయంలో చెబుతున్నదానికి చేస్తున్నదానికి పొంతన లేకుండా పోతోంది. సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నా, హామీల చిట్టా మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ విషయంలో ప్రజలు ఆందోళన బాట పట్టడానికన్నా ముందు చాలా కాలం ఓపిక పట్టారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, కొత్త ప్రభుత్వం పరిస్థితులను చక్కబెట్టుకునే అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా ఉండడంతో, రాష్ట్ర ప్రభుత్వానికి రెండున్నర ఏళ్ళ సమయం లభించింది. ఈ రెండున్నర ఏళ్ళ కాలంలోనైనా పరిస్థితులను అవగాహన చేసుకుని అత్యవసర పథకాలకు ముందు ప్రాధాన్యత నిస్తుందనుకున్న వారి ఆంచనాలు కూడా తలకిందులయ్యాయి. ఇక అంతకన్నా ఎక్కువ సమయం ఇవ్వలేమనుకున్న ప్రజలు ఆందోళన కార్యక్రమాలను ఉదృతంగా సాగించడం ప్రారంభించారు. విద్యార్దుల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ అవుతేనేమీ, రైతుల రుణ మాఫీ అయితేనేమీ ఇలా ఒక్కొక్కటి మెగులోకి వచ్చాయి. అధికార పార్టీని వేలెత్తి చూపించేందుకు ప్రతిపక్షాలకు ఇవి ఓ ఆయుధంగా మారాయి. అయితే ప్రజలు అనుకున్నట్లుగానే తెలంగాణ జాక్‌ కూడా కొత్త సర్కార్‌కు సరిపోను సమయాన్ని ఇవ్వాలని అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని జాక్‌ చైర్మెన్‌ కోదండరామ్‌ మొదట్లో చెప్పి ఆందోళనకారులను అనునయించే ప్రయత్నం చేశారుకూడా. అయితే ప్రజల ఓపికకు ఓ హద్దు ఉంటుంది. క్యాలెండర్లు మారుతున్నా సంక్షేమం విషయంలో ప్రభుత్వం తన ఉదాసీన వైఖరిని వీడకపోవడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ విభిన్న రీతిలో తమ నిరసన తెలుపుతూ వచ్చాయి. రాజకీయ పార్టీలు సహజంగానే రాద్దాంతం చేస్తాయన్న భావన ఉంటుంది. అయితే ప్రతిపక్షాల కన్నా తెలంగాణ జాక్‌ ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తుండడం ప్రభుత్వానికి కొరుకుడు పడటంలేదు. దీంతో ఉద్యమకాలంలో కలిసి పనిచేసిన జాక్‌ చైర్మెన్‌ కోదండరామ్‌పై అధికార పార్టీ తీవ్రాతి తీవ్రంగా విమర్శలు చేస్తోంది. కోదండరామ్‌ను ప్రతిపక్షాలు వెనుక ఉండి నడిపిస్తున్నాయంటూ అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ చేతిలో ఆయన పావుగా మారాడని, ఓ విధంగా కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను ముందు పెట్టుకుని శిఖండిలా వ్యవహరిస్తోందంటూ విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి జాక్‌ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలియంది కాదు. అన్ని రాజకీయ పక్షాలను ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో, ఆయా పార్టీలతో తెలంగాణ డిమాండ్‌ను గట్టిగా వినిపించడంలో జాక్‌ కీలక పాత్రనే పోషించింది. వాస్తవంగా జాక్‌ నిర్మాణ సూత్రదారి ఎవరన్న విషయాన్ని పక్కకుపెడితే తెలంగాణ రాష్ట్ర సాధనలో తెరాస అధినేత కెసిఆర్‌ ఎంతటి పాత్రను పోషించాడో, అంతే పాత్రను ఆనాడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పోషించాడనడంలో సందేహంలేదు. ఈ విషయంలో ఆయనకెంత గౌరవం దక్కుతుందో కోదండరామ్‌కు కూడా అంతే గౌరవం దక్కుతుంది. తెరాస ఉద్యమ పార్టీగా ముందు చెప్పుకున్నా చివరకు అది రాజకీయ పార్టీగా మారుతుందన్నది అందరికి తెలిసిందె. జరిగింది కూడా అదే. తెలంగాణ జాక్‌ ఆవిర్బావంలోనే రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర సాధనే ప్రధాన ఎజెండాగా పోరాటం చేసింది. తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత కూడా తమ జాక్‌ కొనసాగుతుందని ఫ్రోసర్‌ కోదండరామ్‌ చెప్పినట్లుగా నాటి నుండి నేటి వరకు ఆయన రాజకీయాకు అతీతంగానే జెఏసి కొనసాగిస్తున్నారు. శనివారం జరిగిన ఆవిర్భావ వేడుక సందర్భంగా కూడా ఆయన మరోసారి అదేవిషయాన్ని తెలిపారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక ప్రత్యామ్నాయ పార్టీ ఆవిర్భావం అవసరమైన పక్షంలో, ప్రజాభిప్రాయం మేరకు ప్రజాసంఘాల అద్యర్యంలో ఒక పార్టీకి రూపకల్పన జరిపే అవకాశం లేకపోలేదనడం భవిష్యత్‌లో మరో రాజకీయపార్టీ ఆవిర్భావానికి సంకేతమేననుకుంటున్నారు. బంగారు తెలంగాణ దిశగా మార్చుకునే క్రమంలో జెఏసి తన వంతు పాత్రను ఇప్పటికే పోషిస్తోంది. తెలంగాణ ఉద్యమానికి మేధావి వర్గం ప్రధాన అండగా నిలిచింది. ఆలాంటి అండ ఆంధ్రలో లేకపోవడం వల్ేక ఆంధ్రావాళ్ళు ఎంత లాభీ చేసినా చివరకు తెలంగాణ లక్ష్యం నెరవేరింది. అలాంటి మేధావి వర్గం ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ, అధికార పదవులు పొందుతున్నారన్న ఆరోపణలు ఉన్న నేపద్యంలో తాను మాత్రం ప్రజల పక్షాన్నే నిలిచి పోరాటం చేస్తానని చెబుతున్నాడు కోదండరామ్‌. రైతులు, నిరుద్యోగులు, విద్యార్దులు, కాంట్రాక్టు ఉద్యోగస్తులకు సంభందించిన అనేక సమస్యలపై ఆయన ఇప్పటికే పోరాటం కొనసాగిస్తున్నారు. ఒకవైపు కార్పోరేట్‌ విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్యను అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాయాలను ఆహ్వానించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఫార్మాకంపెనీలకు వ్యవసాయ భూములను ఇస్తామనడం లాంటి పలు సమస్యలపై అన్ని వర్గాలను, ప్రజాసంఘాలను కలుపుకుని ఉద్యమించేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. ప్రజాపౌరవేదికు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుందని నమ్మే కోదండరామ్‌ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా అన్ని జిల్లాల్లో కమిటీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 2019నాటికి ప్రజాసంఘాల అద్వర్యంలో ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకిది సంకేతమేనా అన్న ఆలోచన దీనివల్ల ఏర్పడుతోంది.

రాజకీయాలకో దండం…….ప్రజలవెంటే కోదండం Reviewed by on . ప్రజా సమస్యలే ఎజెండాగా టిజేఏసి పయనం మండువ రవీందర్ రావు ప్రజాతంత్ర దిన పత్రిక ఎడిటోరిల్ (26-12-2014) తెలంగాణ సాధనతోపాటు అభివృద్దే ప్రధాన ద్యేయంగా ఆవిర్భవించిన తె ప్రజా సమస్యలే ఎజెండాగా టిజేఏసి పయనం మండువ రవీందర్ రావు ప్రజాతంత్ర దిన పత్రిక ఎడిటోరిల్ (26-12-2014) తెలంగాణ సాధనతోపాటు అభివృద్దే ప్రధాన ద్యేయంగా ఆవిర్భవించిన తె Rating: 0
scroll to top