Friday , 21 September 2018

Home » Slider News » మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ?

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ?

July 17, 2017 8:23 pm by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ? A+ / A-

తోడేలు – మేక పిల్ల

THIRD WORLDWAR1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన 248 యుద్ధాలలో 201 యుద్ధాలు అమెరికా ప్రారంభించినవే. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం పేరుతో అమెరికా చేసిన ఈ యుద్ధాలలో ఒక కోటి ఇరవై లక్షల మంది బలైపోయారు.

వియత్నాం యుద్ధంలో అమెరికా లక్షలమంది పౌరులను హత్య చేసింది. ఉత్తర వియత్నాంపై విమాన దాడులు చేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేసింది. చెప్పరాని అకృత్యాలకు పాల్పడింది. ఈ యుద్ధంలో 150 మంది అమెరికన్ సైనికులు తాము చేశామని అంగీకరించిన ఘోరాల గురించి అమెరికన్ ప్రెసిడెన్షియల్ కేండిడేట్ జాన్ కెర్రీ, అమెరికన్ సెనేట్ లో ఇలా చెప్పాడు: ‘వాళ్ళు స్వయంగా మానభంగాలు చేశామనీ, చెవులు, తలలు నరికేశామనీ, మర్మాంగాలకు తీగలు తగిలించి షాక్ లు ఇచ్చామనీ, అవయవాలు నరికి పడేశామనీ, బాంబులు తగిలించి మనుషులను పేల్చేశామనీ, పౌరులను ఇష్టం వచ్చినట్లు కాల్చి పడేశామనీ, చెంఘిజ్ ఖాన్ కాలంలో జరిగినట్లు గ్రామాలను పూర్తిగా నాశనం చేశామనీ, పశువులనూ, కుక్కలనూ సరదాకి కాల్చి పడేశామనీ, ఆహారపదార్థాలలో విషం కలిపామనీ, దక్షిణ వియత్నాం గ్రామీణ ప్రాంతమంతా నాశనం చేశామనీ అనేక కధలు చెప్పారు. ఇదంతా మామూలుగా జరిగే యుద్ధ వినాశనానికీ, క్రూరమైన బాంబుల దాడిలో జరిగే వినాశనానికీ అదనంగా జరిగినది.’

‘ఏజెంట్ ఆరంజ్’ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనాన్ని ఈ యుద్ధంలో అమెరికా ప్రయోగించింది. ఉత్తర వియత్నాంలోనూ, దక్షిణ వియత్నాంలోనూ గెరిల్లా సైన్యానికి రక్షణనిస్తున్న అడవులనన్నింటినీ నాశనం చెయ్యడానికీ, పంట పొలాలను నాశనం చేసి ప్రజలకు ఆహారం లేకుండా చెయ్యడానికీ ఈ రసాయనాన్ని ప్రయోగించింది. 1961-1972ల మధ్య 45 లక్షల ఎకరాల భూమి మీద ఒక కోటీ 90 లక్షల గేలన్ల రసాయనాన్ని విరజిమ్మింది. ఫలితంగా ప్రజలు తినే తిండీ, తాగే నీరూ కలుషితమయ్యాయి. చాలా తక్కువ మోతాడులో ఈ రసాయనం తీవ్రమైన అనారోగ్యం కలుగ జేస్తుందని పరిశోధనలు వెల్లడించాయి. ఏజెంట్ ఆరెంజ్ ప్రయోగం కారణంగా దాదాపు 5 లక్షలమంది వియత్నాం శిశువులు తీవ్రమైన శారీరక లోపాలతో, అనారోగ్యాలతో జన్మించారు, రెండు లక్షలమందికి పైగా కేన్సర్ తదితర అనారోగ్యాలకు గురయ్యారు.

1990లలో సోవియట్ యూనియన్, సోషలిష్టు శిబిర దేశాలూ కూలిపోయిన తర్వాత యుద్ధాలు ప్రారంభించడానికి అమెరికాకు ‘కమ్యూనిష్టు బూచి’ పనికి రాలేదు. ఇప్పుడు యుద్ధాలు చెయ్యడానికి అమెరికాకు మరొక సాకు కావాలి. 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఆల్ ఖాయిదా దాడి తర్వాత, అమెరికా ‘ఉగ్రవాదం మీద యుద్ధం’ ప్రకటించింది. ఈ యుద్ధానికి సరిహద్దులూ లేవు, అంతూ లేదు.
జనరల్ వెస్లీ క్లార్క్, ఒక పెంటగాన్ అధికారిను ఉటంకిస్తూ ఇలా అన్నాడు – ‘మేం ఐదేళ్ళలో ఇరాక్ తో ప్రారంభించి ఏడు దేశాలను ఆక్రమించబోతున్నాం. ఇరాక్ తర్వాత సిరియా, లెబనాన్, లిబియా, సోమాలియా, సూడాన్ – ఇరాన్ తో ఆగుతాం’ (Democracy Now March 2, 2007).

ఇరాక్ మీద దాడి చేసి సదాం హుస్సేన్ పట్టుకుని ఉరితీసింది. లిబియా మీద దాడి చేసి గడాఫీని హత్య చేసింది. సిరియాలో, సోమాలియా, సూడాన్ లలో యుద్ధాలు రగిలించింది.

ఇరాక్ రహస్యంగా భారీ విధ్వంసక ఆయుధాలు తయారు చేస్తోందన్న ఆరోపణతో యుద్ధ ప్రకటన లేకుండా అమెరికా దాడి చేసింది. ఇరాక్ భారీ విధ్వంసక ఆయుధాలు తయారు చేస్తోందన్న ఆరోపణకు ఏ రకమైన సాక్ష్యాధారాలు అమెరికా ఇంతవరకూ చూపించలేదు.

ఈ ఇరాక్ యుద్ధంలో మొత్తం 30 లక్షలమందికి పైగా మరణించారు. ఇరాక్ మీద విధించిన ఆంక్షల ఫలితంగా 17 లక్షలమంది మరణించారు. యునిసెఫ్ అంచనాల ప్రకారం ఆంక్షల వలనా, యుద్ధ ఫలితాల వలనా, తినడానికి తిండి లేక, తాగడానికి స్వచ్ఛమైన నీరు లేక, రోగాలు వస్తే చికిత్సకు మందులు లేక, ఆకలితో, అనారోగ్యంతో 5 లక్షలమంది పిల్లలు మరణించారు. ఆంక్షల కాలంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలలో మరణాల సంఖ్య రెట్టింపైంది.

లక్షలమందిని హత్య చెయ్యడంతో అమెరికా ఆగలేదు. ఆ దేశం బ్రతకలేకుండా ఒక క్రమ పద్ధతిలో ఆర్థిక వ్యవస్థనంతా నాశనం చేసింది. దేశ పునర్మిర్మాణానికి జరిగే ప్రయత్నాలను తాను లాభాలు సంపాదించడానికి అనుకూలంగా మార్చుకుంది.

ఇప్పుడు ఉత్తర కొరియాలో నిరంకుశ ప్రభుత్వాన్ని కూలద్రోసి ప్రజాస్వామ్యాన్ని కాపాడలంటోంది అమెరికా.

1950-53 సంవత్సరాల మధ్య అమెరికా, ఉత్తర కొరియా మీద భయంకరమైన దాడి చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఆసియా మొత్తం మీదా, పసిఫిక్ దీవుల మీదా ప్రయోగించిన బాంబుల కంటే ఎక్కువ బాంబులు కొరియాలో ప్రయోగించింది. ఈ యుద్ధంలో అమెరికా 6,35,000 టన్నుల బాంబులు కురింపించింది. అందులో 32,557 టన్నుల నాపాలం బాంబులు (మంటల బాంబులు). మంటల బాంబులే కాక రసాయనిక, క్రిమి ఆయుధాలను కూడా ప్రయోగించింది.

అమెరికన్ మేజర్ జనరల్ ఎమ్మెట్ ఓ’డోనెల్ జునియర్, సెనేట్ లో ఇలా ప్రకటించాడు: ‘కొరియన్ ద్వీపకల్పం మొత్తం బూడిదయిందని నేను చెబుతున్నాను. ప్రతీదాన్నీ నాశనం చేశాం. నిలబడ్డ కట్టడం ఏమీ లేదు….(మరి బాంబులు వెయ్యడానికి) కొరియాలో ఇంక లక్ష్యాలు ఏమీ లేవు.’ అమెరికన్ విమానాలు విచక్షణా రహితంగా పౌరులను వేటాడి హత్యచేశాయి. హంగేరియన్ జర్నలిష్టు టైబోర్ మెరే ‘అమెరికన్ దాడిలో జరిగిన భయంకరమైన వినాశనం, సైన్యం చేసిన ఘోరాలూ నేను చూశాను. ఉత్తర కొరియాలో ఆకు మెదిలినా అమెరికా విమానాలకు ఒక సైనిక లక్ష్యమయ్యింది. పొలాల్లో పని చేసే రైతులను అమెరికన్ పైలట్లు మర తుపాకులతో కాల్చి చంపారు. అమెరికన్ సైనికులు పౌరులను అలా హత్య చేస్తూ ఆనందించేవారని నాకొక అభిప్రాయం ఏర్పడింది.’ మరొక జనరల్ కర్టిస్ లెమే ‘మూడు సంవత్సరాల కాలంలో మేం జనాభాలో 20 శాతాన్ని చంపేశాం…ఉత్తర కొరియాలో ప్రతీ పట్టణాన్నీ తగులబెట్టాం’ అని సగర్వంగా ప్రకటించాడు. యుద్ధం చివరి రోజుల్లో ఉత్తర కొరియాలో ఆనకట్టలను కూడా ధ్వంసం చెయ్యడం జరిగింది. ఉత్తర కొరియా ఒక మరుభూమిగా మారిందని అమెరికన్ యుద్ధ ఖైదీ మేజర్ జనరల్ విలియమ్స్ యఫ్. డీన్ చెప్పాడు.

22 పట్టణాలలో 18 పట్టణాలను సంపూర్ణంగా తుడిచి పెట్టెయ్యడం జరిగింది. కూలిపోకుండా నిలిచిన భవనం ఒకటి కూడా లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతమంతా విపరీతమైన బాంబుల దాడికి గురయింది. బాంబులు వెయ్యడానికి లక్ష్యాలు లేక చివరకు కాలి వంతెనల మీద కూడా బాంబులు కురిపించింది అమెరికా. ఉత్తర కొరియాకు విమాన బలగాలు లేని కారణంగా విమాన దాడి నుంచి రక్షించుకోవడానికి ప్రజలు సొరంగాలు తవ్వుకుని భూగర్భంలో ఉండాల్సి వచ్చింది. ఫాక్టరీలు, ఆసుపత్రులు, స్కూళ్ళూ, ప్రభుత్వ కార్యాలయాలూ అన్నీ భూగర్భంలోనే పని చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఉత్తర కొరియా జనాభాలో దాదాపు మూడవ వంతు – అంటే 90 లక్షలలో 30 లక్షలు మరణించారని అంచనా. అంటే ప్రతీ ముగ్గురు ఉత్తర కొరియన్లలో ఒకరు మరణించారు. ఏ యుద్ధంలోనూ ఇంత వినాశనం జరుగలేదు. 1950 లో దక్షిణ కొరియా సైన్యం రహస్యంగా ఒక లక్షమందికి పైగా వామపక్షవాదుల్ని, సానుభూతి పరుల్ని, ఏ విచారణా, ఆరోపణా లేకుండా కొన్ని వారాలలోనే హత్య చేసింది. యుద్ధం తొలిదశలో అమెరికన్ ఆఫీసర్లు నిర్భయంగా ఈ హత్యాకాండ గురించి ప్రచారం చేశారు.
ఈ యుద్ధంలో అమెరికా అణ్వస్త్రాలు ప్రయోగించాలని కూడా ఆలోచించింది.

1950 నవంబరు 30న ఒక పత్రికా సమావేశంలో అమెరికన్ ప్రెసిడెంటు ట్రూమన్ అణ్వాయుధాల ప్రయోగించాలని అమెరికా ఆలోచిస్తోందని హెచ్చరించాడు. కాని యుద్ధంలో కొరియాకు అండగా నిలిచిన కమ్యూనిష్టు చైనా కాని, కమ్యూనిష్టు రష్యా కాని ఈ హెచ్చరికను లక్ష్య పెట్టలేదు. రష్యా అప్పటికే అణ్వాయుధాలున్న దేశంగా ఉంది. కొరియా యుద్ధంలో అమెరికా పీకలదాకా కూరుకుపోతే పశ్చిమ యూరోపులో రష్యా దాడి చేస్తే తమకు రక్షణ లేదని బ్రిటన్, ఫ్రాన్స్ లు భయపడ్డాయి. అణుయుద్ధంలో తమకు జరిగే ప్రతీకారం గురించి భయపడి పెట్టుబడిదారీ ప్రపంచం వెనుకంజ వేసింది.

ఈ యుద్ధంలో కమ్యూనిష్టు రష్యా, కమ్యూనిష్టు చైనాలు ఉత్తర కొరియాకు అండగా నిలిచి పోరాడాయి. చైనా సైన్యం కొరియన్లతో కలిసి వీరోచితంగా పోరాడింది. రష్యా బహిరంగంగా అంగీకరించకపోయినా, రష్యన్ సైన్యం కూడా రహస్యంగా కొరియా యుద్ధంలో పాల్గొంది. కొరియాలో శాంతి కోసం ప్రపంచమంతటా వామపక్షవాదులు పెద్ద ఎత్తున శాంతి ఉద్యమం నడిపారు. చిట్టచివరకు 1953లో యుద్ధ విరమణ ఒడంబడిక మీద సంతకాలు పెట్టడం జరిగింది. యుద్ధం ముగిసింది కాని శాంతి లేదు.

యుద్ధ విరమణ సంధిని ఉల్లంఘించి అమెరికా, దక్షిణ కొరియాలో అణ్వాయుధాలను దించింది. 33 సంవత్సరాల పాటు ఈ అణ్వాయుధాలు దక్షిణ కొరియాలో ఉన్నాయి. ఈ అణ్వాయుధాల లక్ష్యం ఉత్తర కొరియా, చైనా, సోవియట్ యూనియన్.

దక్షిణ కొరియా, తన అణ్వాయుధ నిర్మాణ కార్యక్రమం 1970 దశకంలో ప్రారంభించింది. తర్వాత 1975లో అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక సంధి మీద సంతకం చేసి దక్షిణ కొరియా తన అణ్వాయుధ కార్యక్రమం వదలుకుందని ప్రచారం జరిగింది కాని అమెరికా ఈ సంధి తర్వాత కూడా దక్షిణ కొరియా సైన్యానికి అణ్వాయుధాల ప్రయోగంలో శిక్షణ ఇచ్చింది. 1991 డిసెంబరులో దక్షిణ కొరియానుంచి తన అణు ఆయుధాలు ఉపసంహరించినట్లు అమెరికా ప్రకటించింది. కాని ఉత్తర కొరియాకు ప్రమాదం తొలగలేదు. జలాంతర్గాములనుంచి ఉత్తర కొరియా మీద అణు దాడి చెయ్యడానికి అమెరికా పధకాలు వేసింది. అర్థ శతాబ్దంగా అమెరికా ఉత్తర కొరియాను అణ్వాయుధాలతో బెదిరిస్తోంది. ఏప్రిల్ 2013లో వెలువడిన సమాచారం ప్రకారం, అమెరికా దగ్గర 5,113 అణ్వాయుధాలున్నాయి. ఈ అణ్వాయుధాలను ప్రపంచంలో ఏ మూలకైనా మోసుకుపోగల వేలకొలది ఖండాంతర క్షిపణులున్నాయి. వేల కొలదీ యుద్ధ విమానాలూ, విమాన వాహక నౌకలు, అణ్వాయుధాలను ప్రయోగించగల జలాంతర్గాములూ ఉన్నాయి.
కొరియా యుద్ధం తర్వాత అంతర్జాతీయ చిత్రం మారింది. కమ్యూనిష్టు రష్యా నేడు లేదు. సోషలిష్టు శిబిరం లేదు. ప్రపంచంలో ఒకనాడు వామ పక్షవాదులు, ప్రజాతంత్ర వాదులూ శక్తివంతంగా నిర్వహించిన శాంతి ఉద్యమం నేడు లేదు. నేడు ఎర్ర చైనాలో ఎరుపు లేదు. 1964లో అణ్వాయుధాలు తయారు చేసుకునే హక్కు తమకు ఉందంటూ వాదించిన చైనా, నేడు ఉత్తర కొరియా ఆత్మ రక్షణ కోసం అణ్వాయుధాలు తయారు చెయ్యడానికి ప్రయత్నిస్తుంటే నిరసిస్తోంది, ఉత్తర కొరియాను మందలిస్తోంది. ప్రపంచమంతా ఒక వైపు – ఒంటరి ఉత్తర కొరియా ఒక వైపు గా ఉంది.

రష్యా, చైనాలు ఉత్తర కొరియాకు అండగా నిలిచే అవకాశాలు చాలా తక్కువ. ఉత్తర కొరియా నాశనమై, కొరియా అంతటా అమెరికన్ అనుకూల ప్రభుత్వం ఏర్పడి తమ సరిహద్దుల్లోకి అమెరికన్ సైనిక బలగాలు దిగే ప్రమాదం ఎదురైనప్పుడే, తమ స్వప్రయోజనాలను కాపాడుకోవడానికి అవి కదలవచ్చు.

కొరియా యుద్ధం తర్వాత ఈ 60 ఏళ్ళలోనూ ఉత్తర కొరియా ఏ దేశం పైనా దాడి చెయ్యలేదు. దినదిన గండం నూరేళ్ళు ఆయుష్షుగా జీవిస్తోంది. మారిన ప్రపంచంలో తనకు ఎవ్వరూ తోడు రారనీ, తన కాళ్ళ మీద తాను నిలబడాలనీ గ్రహించింది ఉత్తర కొరియా. కనీవినీ ఎరుగని వినాశనానికి గురైన దేశం ఆత్మ రక్షణకోసం తన ఆయుధ బలగాలను సమకూర్చుకుంటోంది. క్షిపణుల ప్రయోగాలు చేస్తోంది, అణ్వాయుధాలు తయారు చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అలా ఆత్మరక్షణ కోసం ఉత్తర కొరియా సంసిద్ధం కావడం ప్రపంచ శాంతికీ, అమెరికాకు ప్రమాదకరంగా తయారైందని అమెరికా అంటోంది. ఉత్తర కొరియా ప్రభుత్వాన్ని మార్చాలంటోంది. కిమ్ ఇంగ్ హున్ ను హత్య చెయ్యడానికి కుట్రలు పన్నుతోంది.
అమెరికాతో యుద్ధంలో ఒంటరి ఉత్తర కొరియా నిలవలేకపోవచ్చు. కాని ఈ యుద్ధం ఇరాక్ యుద్ధం లాగా ఉండదు. ఉత్తర కొరియా తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ ప్రయోగిస్తూ, వీరోచితంగా పోరాడుతూ మరణిస్తుంది కాని శాంతియుతంగా లొంగిపోదు. ఈ యుద్ధ జ్వాలలు కొరియాకే పరిమితం కాకపోవచ్చు. ప్రపంచమంతా వ్యాపించి మూడో ప్రపంచ యుద్ధంగా మారి కోట్లమంది మరణాలకూ, భయంకర వినాశనానికీ దారి తియ్యవచ్చు.

ఈ వినాశనానికి బాధ్యత ఉత్తర కొరియాదే అంటోంది మొత్తం ప్రపంచం.

నాకూ అలాగే అనిపిస్తోంది.

తోడేలుకు మేక పిల్ల ఎదురు తిరగడం ఘోరమైన అపరాధమే కదా. ఆ తెంపరితనానికి మేకపిల్ల తగిన శిక్ష అనుభవించవలసిందే కదా.

అప్పుడే కదా శాంతి నిలిచేది.

FACEBOOK……..Forwarded

మూడో ప్రపంచ యుద్ధం తప్పదా ? Reviewed by on . తోడేలు – మేక పిల్ల 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన 248 యుద్ధాలలో 201 యుద్ధాలు అమెరికా ప్రారంభించినవే. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం పేరు తోడేలు – మేక పిల్ల 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత జరిగిన 248 యుద్ధాలలో 201 యుద్ధాలు అమెరికా ప్రారంభించినవే. స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం పేరు Rating: 0
scroll to top