Friday , 19 July 2019

Home » Slider News »  “మాకియవెల్లియనిజం”  ‘ట్రిక్సు’ కెసిఆర్ మార్కు పాలిటిక్సు

 “మాకియవెల్లియనిజం”  ‘ట్రిక్సు’ కెసిఆర్ మార్కు పాలిటిక్సు

December 19, 2018 10:38 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on  “మాకియవెల్లియనిజం”  ‘ట్రిక్సు’ కెసిఆర్ మార్కు పాలిటిక్సు A+ / A-

         తెలంగాణ రాజకీయాల్లో కెసిఆర్ సక్సెస్ మంత్ర

 

kcrతెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో తనదైన సక్సెస్ మంత్ర తో  అక్షరాల అపర చాణక్య బిరుదాంకితుడు అయ్యారు. రాజకీయాల్లో రాణించిన వారిని అపర చాణక్యతో పోలుస్తుంటారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ చాణక్య రాజకీయాలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఎదుటి వారి ఎత్తులు పసిగట్టి పై ఎత్తులు వేయటం ప్రత్యర్థులకు తెలియకుండానే వారిని చిత్తు చేసేందుకు వ్యూహాలు రచించడంలో కెసిఆర్ ను మించిన వారు లేరు.

తెలంగాణ ఉద్యమం నుండి మొదలు పెడితే ఆయన 2014  ఎన్నికల్లో గెలిచి తొలి ముఖ్యమంత్రిగా పదవి భాద్యతలు చేపట్టిన నాటి నుండి 2018 ఎన్నికల్లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో గెలిచి అధికారం నిలుపు కోగలగడం వరకు  రాజకీయంగా అనుసరించిన ఎత్తుగడలే ఆచరణలో అగ్ర స్థాయికి చేర్చాయి. రాజనీతికి బొమ్మా బొరుసులా  సద్గుణ లక్షణాలతో పాటు  దుర్గుణ లక్షణాలు రెండూ ఆ వైపున ఈ వైపున ఉంటాయి.

సింహంలా వేటాడడం…. నక్కలా జిత్తులు…….. వేయడం నాయకుడి ప్రధాన సద్గుణాలు అంటాడు ప్రఖ్యాత ఇటాలియన్ రాజనీతిజ్ఞుడు నికొలొ మాకియవెల్లి. కెసిఆర్ ఓ వైపు చాణక్య రాజ నీతిని మరో వైపు మాకియవెల్లి రాజకీయ వ్యూహాలను బాగా ఒంట బట్టించుకున్నాడు. అందుకే ఆయన విజేతగా మిగిలాడు. మాకియవెల్లి రాజకీయాలు అర్దం చేసుకోని వారు వాటిని ఆచరించని వారు పరాజితులుగా మిగిలి పోయారు.

కుతంత్ర  రాజకీయ సమర్థ నిర్వహణకు రాజనీతిలో అనుసరించే విధానాలను బట్టే విజేతలుగా నిలుస్తారని మాకియవెల్లి తన ప్రిన్స్ అనే  గ్రంధంలో సూత్రీకరించాడు. మాకియవెల్లి ని ఆధునిక రాజకీయశాస్త్ర పితామహునిగా పిలుస్తారు. ఆయన రాసిన “ద ప్రిన్స్” అనే రాజనీతి శాస్త్ర గ్రంధం  ప్రపంచ వ్యాప్తంగా బహుళ ఆదరణ పొందింది.

ఐరోపాలో 14 వ శతాబ్దం మధ్య జరిగిన గొప్ప మేధో వికాసం సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆజ్యం పోసింది. ఆనాటి మేధోసంపత్తిలో ఒకడిగా మాకియవెల్లి చరిత్రలో మిగిలి పోయారు.

రాజు యెక్క లౌక్యం, వ్యవహార దక్షత, రాజకీయ దక్షత గురించి విఫులంగా ఈ గ్రంధంలో వివరించారు మాకియవెల్లి.

రాచరిక వ్యవస్థనాటి కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని  గ్రంధస్తం చేయబడినప్పటికి ఇప్పటికి ఈ గ్రంధం ప్రపంచ వ్యాప్తంగా ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థల రూపకల్పన  అనంతరం కూడ ఎంతో ప్రాచుర్యం పొంద గలిగింది.

రాజు  అత్యంత శక్తివంతుడిగా రూపొందేందుకు అట్లాగే తన రాజ్యాన్ని అంతకు మించిన శత్రు దుర్భేద్యమైన రాజ్యంగా రూపొందించేందుకు అనుసరించాల్సిన విధానాలను ఆందులో వివరించారు.

ఇటాలియన్ భాషలో ఉన్న ఈ గ్రంధాన్ని మొదట ఆంగ్లంలో అనేక మంది  అనువదించారు. తెలుగులో కూడ ఈ గ్రంధం అనువాదం పొందింది. గూగుల్ సర్చ్ లో  వెదికితే ఈ గ్రంధం లింకులు లభిస్తాయి.

ఎత్తులకు పై ఎత్తులు వేయడం వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచించడం సింహబలానికి తోడుగా  నక్కజిత్తులు నాయకుని కవచాలు కావాలి అంటాడు మాకియవెల్లి. ఇవేవి అనుసరించకుండా గుడ్డిగా ముందు కెళ్లినంత కాలం పరాజితులుగానే మిగిలి పోవాల్సి ఉంటుందనేది మాకియవెల్లి తత్వ భోదన సారాంశం.

కెసిఆర్ అటు చాణక్య రాజనీతిని ఇటు మాకియవెల్లి సూత్రీకరించిన తత్వ భోదనలను బాగా అర్దం చేసు కోవడం వల్లే ఈ రోజు తెలంగాణ రాష్ర్టం సాకారం అయ్యింది.

ఆంధ్ర పార్టీల పాలనా విధానాలతో విసుగెత్తి ఆర్థిక అసమానతల్లో అసహనం చెంది తుది విడత తెలంగాణ కోసం విద్యార్థులు, విద్యావేత్తలు కెసిఆర్ కన్నా ముందే 1996 నుండి ఉద్యమాన్ని రగిలించారు. తుది విడత ఉద్యమం ఆరంభం అయినపుడు కెసిఆర్  ఆంధ్ర పార్టీ ప్రభుత్వ పాలనలో పదవుల్లో కొనసాగారు. పీపుల్స్ వార్ (మావోయిస్టు) పార్టీతో పాటుగా ఇతర వామపక్ష తీవ్ర వాద పార్టీలు సైతం తెలంగాణ ఉద్యమాన్ని సమర్దించి పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇచ్చి ప్రజల వెంట నడిచాయి. ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, డాక్టర్ కొత్తపల్లి జయశంకర్, బియ్యాల జనార్దన్ రావు, ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ తదితరులు అనేక మంది  అటు ఉస్మానియా ఇటు కాకతీయ విశ్వవిద్యాలయం మేధావులను ఒక్కటి చేసి ఐక్య వేదికగా ఏర్పడి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళే వరకు అంటే 2000 సంవత్సరం వరకు కెసిఆర్ పాత్ర తెలంగాణ ఉద్యమంలో శూన్యం.

అప్పటికి ఎన్టీ రామారావు శకం ముగిసి  చంద్రబాబు నాయుడు  అధ్వర్యంలో ఏర్పడిన తెలుగు దేశం ప్రభుత్వంలో మంత్రి పదవి ఆశించి అది దక్కకుండా డిప్యూటి స్పీకర్ పదవితో సరి పెట్టుకోలేక ఊగిస లాటలో ఉన్న కెసిఆర్ దృష్టి  తెలంగాణ ఉద్యమం వైపు మళ్లింది ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ కళ్ల ఎదుట సాక్షాత్కరించింది. తెలంగాణ కోసం విద్యార్థులు, విద్యా వేత్తలు, మేధావులు పడుతున్న తపన వారి పట్టుదల సంకల్ప బలం కెసిఆర్ కు స్పూర్తి నిచ్చాయి.  ఉద్యమాన్ని కేంద్రంగా చేసుకుని తెలంగాణ రాష్ర్టంలో ఆంధ్ర పార్టీ అయిన తెలుగు దేశం పార్టీకి అట్లాగే కాంగ్రేస్ పార్టీకి ఇతర వామపక్షాలకు వ్యతిరేకంగా ఓ రాజకీయ ప్రత్యామ్నాయ పార్టీని ఏర్పాటు చేయాలని కెసిఆర్ 2001 లో సంకల్పించడం ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది.

జలదృష్యంలోని (సెక్రటేరియట్ కు ) సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజి నివాసంలోని  తెలంగాణ ఐక్య వేదిక కార్యాలయం నుండే కెసిఆర్ రాజకీయ పార్టీ అంకురార్పన జరిగింది. అక్కడే పార్టి ఆవిర్భావ సభ కూడ జరిగింది. ఆనాటి పార్టీ వ్యవస్థాపకుల్లో వీరమల్ల ప్రకాశ్ వంటి వారు ఒక రిద్దరు తప్ప  ఇతరు లెవరూ నేడు కెసీఆర్ పార్టీలో లేరు. అది వేరే విషయం.

స్వరాష్ర్టం కోసం ప్రజలు ఎంతటి ధృడ సంకల్పంతో పోరాడుతున్నారో వారి ఆకాంక్షను అర్దం చేసుకుని తెలంగాణ ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను రాజకీయాలకు జోడించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథాలో రాష్ర్టం సాధించిన నాయకుడు కెసిఆర్. ఆయనకు ముందు ధశల్లో తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డి వంటి ఉద్దండులు ఎందరో వచ్చి వెళ్లినా ఎవ్వరూ సక్సెస్ కాలేదు.

పార్టి ఆవిర్బావ సభలోనే ఆయన తన డిప్యూటి స్పీకర్ పదవికి, శాసన సభ సభ్యత్వానికి పార్టి సభ్యత్వానికి రాజీ నామా  ప్రకటించారు. అంతకు ముందు ఆయన తెలంగాణ విద్యుత్ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన లేఖ సంచలనం అయింది. కెసిఆర్ కు పదవులిస్తామని చంద్రబాబు రాయబారాలు పంపి ప్రలోభాలు పెట్టినా ఆయన అంగీకరించకుండా తెలంగాణ ప్రజల కోసం తాడో పేడో తేల్చుకుంటానని  తెలంగాణ కోసం నా ప్రాణాలు సైతం ధార పోసేందుకు వెనకాడనని కెసిఆర్ స్పష్టం చేశారు.  అదే సంవత్సరం జరిగిన పంచాయితి రాజ్ ఎన్నికల నుండే కెసిఆర్ రాజకీయ ప్రస్తావన మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా అనేక స్థానాల్లో  పార్టి గెలిచి ఆయన చెప్పినట్లుగానే ఓ పెద్ద  పోలిటికల్ ఫోర్స్ గా పార్టి ఆవిర్భ వించింది. “తెలంగాణ రాష్ర్ట సాదనే  నా సింగిల్ పాయింట్ ఎజెండా” అంటూ కెసీఆర్  ఆనాటి పార్టి ఆవిర్భావ సభలో స్పష్టం చేసినట్లు  2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ర్టం అవిర్భావం జరిగే వరకుఅదే లక్ష్య సాదన కోసం పనిచేశారు.

14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఎత్తులు, పై ఎత్తులు, రాజకీయ సమీకరణలు, ఎన్నికలు రాజీనామాలు, పొత్తులతో కెసిఆర్  తో పాటు ఆయన రూపకల్పన చేసిన  పార్టి అంచలంచెలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరింది.

తెలంగాణ ఉద్యమాన్ని గతంలో ఇందిరా గాంధి మింగేసినట్లు ఈ తుది విడత ఉద్యమంలో కూడ అందుకు తగిన కుట్రలు కుతంత్రాలు అన్ని జరిగాయి. అనేక విధాలుగా అర్ద బలం అంగ బలం వీటికి తోడు మీడియా బలం కలిగిన ఆంధ్ర ప్రాంత నేతలు అనేక విధాలుగా తెలంగాణ ఉద్యమాన్ని  విఫలం చేసేందుకు  అన్ని విధాలుగా యత్నించారు. ఏ ఒక్క అవకాశాన్ని వాళ్లు వదులు కోలేదు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమత్రిగా ఉన్నపుడు మిత్ర పక్షంగా ఉన్న తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభాలతో లోబరుచుకుని పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చూసారు. కాని కెసిఆర్ కేంద్రంలో రాష్ర్టంలో కాంగ్రేస్ ప్రభుత్వం నుండి బయటికి వచ్చి పదవులకు రాజీనామాలు చేసి  ఎన్నికలకు వెళ్ళడం ద్వారా తెలంగాణ ప్రజల్లో ఉద్యమాన్ని వేడెక్కించారు. బలంగా ఉద్యమాన్ని అణిచి వేసే చర్యలు జరిగి నపుడల్లా కెసిఆర్ తో పాటు ఆయన సహచర ఎమ్మెల్యేలు పదవులకు పలు మార్లు రాజీనామాలు  చేసి ఎన్నికలకు వెళ్లడం గెలిచి తెలంగాణ వాదాన్ని నిరూపించడం రాష్ర్ట సాధనలో ప్రధాన ఎత్తుగడగా మారాయి. ఓ వైపు ఎన్నికల ప్రక్రియతో పాటు మరో వైపు తెలంగాణ వ్యాప్తంగా సింహ గర్జనలతో 2009 లో ఆయన ఆమరణ దీక్ష చేసే వరకు అనేక విధాల ఎత్తుగడలు అన్ని కెసిఆర్ స్వంత ఆలోచనలే.

శ్రీకృష్ణ కమిటి వేయించి బుజ్జ గించాలని చూశారు. సుదీర్ఘ కాలం జరిగిన పోరాటంలో కెసిఆర్ రాజకీయ ఎత్తు గడలకు తెలంగాణ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఒక్క తాటిపై ఒక్క మాటపై నిలబడినందు వల్లే కెసిఆర్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో సక్సెస్ అయిన నాయకుడిగా చిరస్థాయిగా నిలిచి పోయారు.

కెసిఆర్ ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన వ్యూహ ప్రతి వ్యూహా లేమిటో ప్రత్యర్థులకు కూడ అంతు పట్టదు. రాజకీయాలలో, వ్యక్తిగత ప్రవర్తనలో మోసం, మాయ, జిత్తులు, కపట నీతుల‌ ఎత్తుగడలనే “మాకియవెల్లియనిజం” అంటారు. ఇలాంటి వన్ని చేయగలిగాడు కాబట్టే కెసిఆర్ అటు తెలంగాణ ఉద్యమంలోను ఇటు రాజకీయాల్లోను తన దంటు ఒక ముద్ర వేసు కోగలిగాడు. కెసిఆర్ రాజకీయాల్లో కేవలం సద్గుణ నేతగా ఉండి ఉంటే తెలంగాణ రాష్ర్టం వచ్చేదే కాదు.

ఉద్యమం పరాజయం పాలు కాకుండా కెసీఆర్ ఎత్తులు పై ఎత్తులు అనేకం ఆయన రాజకీయ ఆలోచనలతోనే  సాధ్యం అయ్యాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టి అధ్వర్యంలో నాలుగు పార్టీలు కూటమి కట్టినా కెసిఆర్ సునాయాసంగా ఎదుర్కున్నారు.

ఇక ముందు తెలంగాణ రాష్ర్టంలో జరిగే రాజకీయ పరిణామాలు అన్ని కూడ కెసిఆర్ ‘మాకియవెల్లియనిజం’ వ్యూహాలలో ఎత్తుగడలలో భాగంగానే జరుతాయి. ఆశ్చర్య కరమైన రీతిలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి.

తెలంగాణ ప్రజలు కెసిఆర్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఆయన మాటల మంత్రాలకు ప్రజలు సమ్మోహితులు అయ్యారు. తెలంగాణ ప్రజల ను ఎప్పుడు ఏ సమయంలో ఎట్లా ఒప్పించాలో ఆంధ్ర రాజకీయాలను ఎట్లా తిప్పు కొట్టాలో కెసిఆర్ ఎరిగిన రీతిలో ఎవరూ ఎరుగరు. ఇప్పుడు ఓట్ల రాజకీయాల్లో కెసిఆర్ బాగా ఆరి తేరారు. ఇంటికో లబ్దిదారున్ని తయారు చేసుకున్న కెసిఆర్ వారిని పోలింగ్ బూతుల వరకు రప్పించే వ్యూహంలో సక్సెస్ అయ్యారు.

అందుకే ఎపి సిఎం చంద్రబాబు నాయుడు  తప్పుడు అంచనాలతో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దిగి పరువు పోగొట్టుకున్నారు. కాంగ్రేస్ పార్టీ ‘మాకియవెల్లియనిజం’ రాజకీయాలు అంతుభట్టక పరాజయం పాలైంది.

పాలకులు అనుసరించే రాజకీయ సద్గుణాలు, దుర్గుణాలు అన్నింటిని ప్రజలు అర్దం చేసుకుని వారిది ఏ రకం రాజ నీతో ప్రజలు ప్రశ్నించే స్థాయికి ఎదిగే వరకు “చాణిక్య రాజకీయాలు – మాకియవెల్లియనిజం” పాలిటిక్స్ సజీవంగా ఉంటాయి.

కూన మహేందర్

సీనియర్ జర్నలిస్ట్

ప్రజాతంత్ర దిన పత్రిక 19-12-2018

 

 “మాకియవెల్లియనిజం”  ‘ట్రిక్సు’ కెసిఆర్ మార్కు పాలిటిక్సు Reviewed by on .          తెలంగాణ రాజకీయాల్లో కెసిఆర్ సక్సెస్ మంత్ర   తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో తనదైన సక్సెస్ మంత్ర తో  అక్షరాల అపర చాణక్య          తెలంగాణ రాజకీయాల్లో కెసిఆర్ సక్సెస్ మంత్ర   తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో తనదైన సక్సెస్ మంత్ర తో  అక్షరాల అపర చాణక్య Rating: 0
scroll to top