Friday , 19 July 2019

Home » Slider News » మంత్రి వర్గం కొలువు దీరేదెన్నడో…..అంతా గప్ చుప్

మంత్రి వర్గం కొలువు దీరేదెన్నడో…..అంతా గప్ చుప్

January 5, 2019 9:39 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on మంత్రి వర్గం కొలువు దీరేదెన్నడో…..అంతా గప్ చుప్ A+ / A-

KCR CM Telanganaమంత్రి వర్గ విస్తరణపై రాష్ర్టంలో దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు కొత్త మంత్రి వర్గం కొలువుదీరుతుందనే విషయంలో ఎవరి  ఊహాగానాలకు ఆస్కారం లేదు. అంతా సస్పెన్స్…….తొందరే మొచ్చిందని ఎదురు ప్రశ్నించే వారికి జవాబు ఉండ బోదు కాని ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం. గత సంవత్సరం డిసెంబర్ 7 వ తేదీన జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీకి అఖండ మెజార్టీతో తిరిగి పట్టం గడుతూ తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పుతో కెసిఆర్ ముఖ్యమంత్రిగా సింగిల్ డిజిట్ లేదా డబుల్ డిజిట్ తో తొలి మంత్రి వర్గం ఏర్పాటు అవుతుందని  అందరూ ఎదురు చూశారు. ఆయితే డిసెంబర్ 13 వ తేదీన కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఆయనకు తోడు హోం మంత్రిగా మహమూద్ అలి  ఇద్దరే ప్రమాణ స్వీకారం చేసారు. మరో వారం రోజుల్లో మరి కొందరితో మంత్రివర్గ విస్తరణ జరిగి తీరుతుందని  ఎదురు చూశారు కాని అదేం జరగ లేదు. ఇప్పుడు మంత్రి వర్గం లేదా అంటే ఉన్నట్లే లెక్క. ప్రభుత్వం  నడవడం లేదా అంటే నడుస్తున్నట్లే లెక్క. అన్ని చంద్రశేఖర లీలలుగా సరి పెట్టు కోవాల్సిందే.

మంత్రి వర్గం ఏర్పాటులో ఆలస్యానికి అసలు కారణాలు ఎవరికి తోచిన రీతిలో వారు చెప్పుకున్నారు. మీన మేశాలు లెక్కలు వేయడంలో కెసిఆర్ ను మించిన వారు లేరు. కెసిఆర్ కు జనం భీతి కన్నా  దైవ భీతి ఎక్కువ. దేవుళ్లు, మొక్కులు, యజ్ఞాలు యాగాలపై అపార నమ్మకం ఆయనది.  ఎప్పుడు ఏ పనికైనా  చుట్టూ వేద పండితుల ఆశీర్వచనాలు లేనిదే కెసిఆర్ అడుగు ముందుకు పడదు కనుక మంత్రి వర్గ విస్తరణకు ముహూర్త బలం కుదరక పోయి ఉండవచ్చని  అనుకున్నారు.

ఇప్పడేం కొంపలు మునిగాయని?!…….మంత్రి వర్గం విస్తరణ జరగక పోతే పాలన లేనట్లేనా …? అంటే  ప్రజా ప్రభుత్వంలో అన్ని ప్రజాస్వామ్య సూత్రాల మేరకు జరిగితే ప్రజలు సంతోషిస్తారు. ఎవరైనా ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవించి తీరాల్సిందే. దేశంలో  ఏ రాష్ర్టంలో నైనా ఎన్నికలు ముగిసిన అనంతరం మెజార్టి బలం కలిగిన పార్టీలు తక్షణం ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రులతో కొలువు దీరటం ఇప్పటి వరకు చూస్తు వచ్చాం. తెలంగాణ రాష్ర్టంలో అందుకు భిన్నంగా  అట్లా జరిగి పోకుండా  మంత్రి వర్గం లేకుండా ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు వారాలు గడిచినా  ఏఖోన్ముఖంగా పాలన సాగుతుండడం  రాష్ర్టంలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చ నీయాంశంగా మారింది.

రాష్ర్టంలో మంత్రి వర్గం విస్తరణ అసలు ఎప్పడు జరుగుతుందో ఎవరికి తెలియదు ప్రస్తుతం పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినందున ఎన్నికలు ముగిసే వరకు మంత్రి వర్గ విస్తరణకు అస్కారం లేదా అనే విషయం కూడ ప్రభుత్వ వర్గాల నుండి క్లారిటి లేదు.

పంచాయితి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలైనా మంత్రి వర్గం విస్తరణకు రాజ్యంగ పరంగా ఏ సమస్యలు ఉండబోవని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి ఇష్టా ఇష్టాల మేరకు మంత్రి వర్గ విస్తరణ ఆధార పడిన అంశం కావడం వల్ల ఇతర ఏ రాజ్యాంగ వ్యవస్థలు జోక్యం చేసుకునే అస్కారం లేదు.

ప్రాంతీయ పార్టీలలో ఏ అంశంలోనైనా ఆ పార్టి ముఖ్య నాయకుడి నిర్ణయం మేరకే  తీర్పులు జరుగు తుంటాయి. హైకమాండ్ భయం ఉండదు. అంతర్గత ప్రజాస్వామ్యం అనేది అంతకూ ఉండదు కనుక పార్టి వర్గాల నుండి ఎదురు ప్రశ్నించే వారెవరూ ఉండబోరు. కాని ప్రజలు మాత్రం పాలకులు అనుసరించే ప్రజాస్వామ్య  విధానాలు వారు పాటించే  విలువలను మాత్రం సునిశితంగా పరిశీలిస్తారనే విషయం పాలకులు మరిచి పోవద్దు.

సెప్టెంబర్ 2 వ తేదీన కొంగరకలాన్ ప్రగతి నివేదన సభ అనంతరం నుండి సెప్టెంబర్ 6 వ తేదీన అసెంబ్లి రద్దు మొదలు డిసెంబర్ 7 వ తేదీన పోలింగ్ ముగిసే వరకు 100 రోజులకు పైగా ప్రజాపాలన లేదు. ఎన్నికలు ముగిసే వరకు ఆపద్దర్మ ప్రభుత్వ పాలన  సాగింది. ఎన్నికల అనంతరం మంత్రి వర్గం లేకుండా పాలన సాగుతోంది. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ప్రజా ప్రభుత్వం లేని ప్రెసిడెంట్ పాలనలో ఉన్నామా అనేది తెలియని త్రిశంకుస్వర్గ పాలన రాష్ర్టంలో నెలకొంది.

పరిష్కృతం కాని సమస్యలు రాష్ర్టంలో అనేకం ఉన్నాయి. బకాయిలు చెల్లించడం లేదని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపి వేసారు. విద్యార్థుల స్కాలర్ షిప్ ల తో పాటు   ఫీజు రిఎంబర్స్ మెంట్ నిలిచి పోయాయి.  ఆసరా పథకం చెల్లింపులు ఆగి పోయాయి. గుత్తే దారుల బిల్లుల చెల్లింపులు ఆగి పోయి పనులు ఎక్కడి కక్కడే స్తంభించి పోయాయి. ప్రజలకు ఉపయోగపడే అనేక విధాన పరమైన నిర్ణయాలు జరగక రాష్ర్ట సచివాలయంలో పాలన పడకేసింది. అధికారులు ఏ పైళ్ళు  ముట్టడం లేదు. ఏపనులైనా మంత్రి వర్గం ఏర్పాటు తర్వాతే నని చెబుతున్నారు. మంత్రి వర్గం ఆమోదం పొందితేనే రాష్ర్టంలో కొత్త పథకాలు అమల్లోకి  రానున్నాయి. ఇందుకు భిన్నంగా ఏ నిర్ణయాలు జరిగినా ప్రజా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా పాలకులు వ్యవహరిస్తున్నారనే అర్దం చేసు కోవాల్సి ఉంటుంది.

గత పాలనలో నెర వేర్చాల్సిన హామీలు చాలా ఉన్నాయి. చెల్లించాల్సిన ఆర్థిక బిల్లు అనేకం ఉన్నాయి. సర్కార్ ఖజానా పరిస్థితి ఏమిటో జమా ఖర్చుల లెక్కలేమిటో సమీక్ష జరగాలి. ఎన్నికల సమయంలో కొత్తగా ఇచ్చిన రైతు రుణ మాఫి, నిరుద్యోగ భృతి తదితర పథకాలకు నిధులు సమకూర్చాలి. ఉద్యోగుల పదవి విరమణ విషయంలో 61 ఏళ్ల వయో పరిమితి   అమలు కావాల్సి  ఉంది.

ఇవన్ని  రాష్ర్ట ప్రజలకు సంభందించిన సమస్యలే కాని మంత్రి వర్గం ఎప్పుడు ఏర్పాటు అవుతుందో ఎప్పుడు సమస్యలు పరిష్కారం కానున్నాయో ఎవరికి తెలియదు. సంక్రాంతి తర్వాత లేదా  పంచాయితి ఎన్నికలు ముగిసిన అనంతరం విస్తరణ జరుగుతుందని అరడజను మందితో మిని కాబినెట్ ఏర్పాటు ఏవుతుందని పార్లమెంట్ ఎన్నికల వరకు ఇదే కాబినెట్ ఉంటుందని ఆ తర్వాతే పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పాటు అవుతుందని  విశ్లేషణలు వస్తువ్నాయి. కెసిఆర్ మరో పెద్ద యాగం చేయబోతున్నారని ఆయాగం అనంతరమే మంత్రి వర్గ యోగం ఉండబోతుందని అంటున్నారు.

ఖజానాలో కాసులు లేక ముఖ్యమంత్రి  పాలనా పరమైన విషయాలకన్నా రాజకీయ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చి తద్వారా ప్రజల దృష్టి మళ్లేలా చేస్తున్నాడనే విమర్శలు కూడ మరో వైపు లేక పోలేదు. ఈ విమర్శలపై నిజమెంతో అబద్ద మెంతో కాని కెసిఆర్ వైఖరి కూడ అదే విదంగా ఉంది. రాష్ర్టంలో పాలనా పరమైన విషయాలకన్నా రాజకీయ అంశాలపైనే ఆయన ఎక్కువ ఆసక్తి కనబరిచారు. తన ముద్దుల తనయుడు తారక రామారావు ( కెటిఆర్) ను ఆఘమేఘాల మీద పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు తన చిర కాల ప్రత్యర్థి  ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రిటర్న్ గిఫ్ట్  ఇస్తానన్న కెసిఆర్ ఆయనకో ఝలక్ ఇచ్చేందుకు విశాఖ వెళ్లారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ రాజకీయాలపై యాత్ర  సాగించి ఆశించిన రీతిలో ఫలితం దక్కక తిరిగి  వచ్చారు. ఎన్నికల్లో 119 సీట్లకు 88 సీట్లు గెలిచి మంచిజోష్ లో ఉన్న కెసిఆర్ ఇప్పడు ఎవరి సలహాలు సూచనలు వినే స్థితిలో లేరు. అందరి కంటే ఘనుడు కనుక ఆయన చెప్పందే అందరూ  వినాలి. దేశ పర్యటన ముగించి వచ్చిన కెసిఆర్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పైనా అట్లాగే మంత్రి వర్గం విస్తరణ పైనా అడిగిన ప్రశ్నలకు ఇప్పుడేం వచ్చింది  కష్టం అంటూ  ఎప్పటి లాగే మాటల మంత్రాలతో తన వాగ్ధాటి పటిమతో మీడియా నోరు మూయించారు. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడ మనేది అంతగా ప్రాధాన్యత కల విషయం కానే కాదని అన్నారు. సారూప్యత కలిగిన ప్రభుత్వ శాఖలన్ని ఒక్క శాఖ కిందికి తెచ్చే ఆలోచనలో భాగంగా వివిధ శాఖల కూర్పు జరుగుతోందని కెసిఆర్ చెప్పు కొచ్చారు.  ఆ ప్రక్రియ కారణంగానే మంత్రి వర్గం విస్తరణ ఆలస్యం అవుతోందని కెసిఆర్ పరోక్షంగా తాను ఎందుకు మంత్రి వర్గం విస్తరించ లేక పోయారో అందరికి అర్దం అయ్యేట్లు సహేతుకంగా సర్ది చెప్పుకున్నారు.

ముందు మంత్రి వర్గాన్ని ఖరారు చేసి ఆ తర్వాత కూడ సారూప్యత కలిగిన  వివిధ శాఖల కూర్పు  చేపట్టవచ్చని ముఖ్యమంత్రి కెసిఆర్ కు చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఎన్నికల అనంతరం రాష్ర్టంలో ప్రతి పక్షం అంటు లేకుండా పోయింది. చావు తప్పి కన్ను లొట్ట పోయిన విపక్షాల నేతలు కొంత కాలం మౌన వ్రతంలో కొనసాగుతామంటూ నోళ్ళకు ముద్ర లేసుకున్నారు. మీడియా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. పాలకుల విధానాలను ఉతికి ఆరేయాల్సిన  మీడియా చంద్రశేఖర పాహిమాం అంటూ చేతులు జోడించింది.

కూన మహేందర్

సీనియర్ జర్నలిస్ట్

ప్రజాతంత్ర దినపత్రిక  05-01-2019

మంత్రి వర్గం కొలువు దీరేదెన్నడో…..అంతా గప్ చుప్ Reviewed by on . మంత్రి వర్గ విస్తరణపై రాష్ర్టంలో దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు కొత్త మంత్రి వర్గం కొలువుదీరుతుందనే విషయంలో ఎవరి  ఊహాగానాలకు ఆస్కారం లేదు. అంతా సస్పెన్స్ మంత్రి వర్గ విస్తరణపై రాష్ర్టంలో దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు కొత్త మంత్రి వర్గం కొలువుదీరుతుందనే విషయంలో ఎవరి  ఊహాగానాలకు ఆస్కారం లేదు. అంతా సస్పెన్స్ Rating: 0
scroll to top