Saturday , 24 August 2019

Home » Slider News » బాహుబలులు –నేతల బహురూపులు:అసెంబ్లీమే సవాల్

బాహుబలులు –నేతల బహురూపులు:అసెంబ్లీమే సవాల్

March 22, 2017 11:50 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Leave a comment A+ / A-

వస్తాడు…నిన్నెదిరించే బాహుబలి!JANA AND KCR CHALLENGE

తెలుగు చలన చిత్ర దర్శకుడు రాజమౌళి సినిమాలంటే చాలా మంది బహు ఇష్టపడుతారు. ఆయన మనుషుల మీదే కాదు చివరికి ఈగలు, దోమలపై కూడ సినిమాలు తీసి జనాలను సమ్మోహులను చేయ గల సత్తా కలిగిన వారు. ఇందుకు ఆయన తీసిన ఈగ, బాహుబలి సినిమాలే నిదర్శనం. ఇక దోమ మీద కూడ సినిమా తీస్తారేమో చెప్పలేం. ఇక పోతే బాహుబలి అన్నింట్లోనూ టాప్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం  టాలివుడ్ నుండి హాలివుడ్ వరకు అన్ని రికార్డులు బద్దులు కొట్టింది.

అన్నిటికన్నా రాజమౌళి ప్రేక్షకుల ముందు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే ఓ పెద్ద చిక్కుముడిని ఉంచి చర్చను సజీవం చేసాడు. ఈ చిక్కుముడికి జవాబుగా రెండో బాగం బాహుబలి లో ఉండ వచ్చు లేదా మరో సెస్పెన్ చేర్చి మూడో బాగం కూడ తేనూ వచ్చు అది ఆయన ఇష్టం. చూసే వాళ్లు ఉండాలే కాని వేశాలెన్ని అయినా వేయవచ్చు.

ఏప్రిల్‌ 28న విడుదలకానున్న ఈ చిత్రం కోసం ఎప్పటి నుంచో ప్రేక్షకుల ఎదురు చూపు మొదలైంది. ఎందుకంటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో రెండో బాగంలో నైనా రాజమౌళి చెప్పి ఉంటాడనే ఆత్రుత అందరిని ఎదురు చూసేలా చేసింది. ఇప్పడు ఇదే సినిమా కథాంశంలో ఓ పాత్ర తెలంగాణ అసెంబ్లి వేదికగా మారి చర్చోప చర్చలకు దారి తీసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు  కుందూరు జానారెడ్డి నీళ్లలో మునిగి వదిలారో లేక గురి చూసి వదిలారో కాని మిమ్మల్ని ఓడించే బాహుబలి వస్తాడని అధికార పక్షాన్ని అందులోనూ అధినేత కెసిఆర్ ను ఉద్దేశించి విడిచిన బాణం దుమారం రేపింది.

తెలంగాణ కోసం కాంగ్రేస్, తెరాస  కల్సి పోరాడాయి. ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అన్నకాంగ్రేస్ కాలం కల్సి రాక  పోగా తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత కెసిఆర్  బహు విదాలుగా చాకచక్యం ప్రదర్శించి అధికారంలోకి వచ్చాడు. కాంగ్రేస్ కు తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీల మద్య దాయాదుల పోరు సాగుతోంది.బాహుబలి సినిమా కథ కూడ దాయాదుల మద్య పోరు నేపద్యంగా చిత్రీకరించారు. తెంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బాహుబలి పేరిప్పుడు విస్తృత ప్రచారంలో ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి కెసిఆర్ ను కొందరు కట్టప్పతో పోలిస్తే, మరికొందరు బాహుబలితో పోలుస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ రథసారధి కెసిఆర్‌ను పడగొట్టేందుకు బాహుబలి వస్తాడని జానారెడ్డి చేసిన వ్యాఖ్య  సెటైర్ల ప్రకంపనలు పుట్టించింది.  ఈ వ్యాఖ్య కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విమర్శకు నాంది కాగా, ఇతర పక్షాలు బాహుబలికి విపరీతార్థాలను చెప్పుకొచ్చాయి. జానారెడ్డి అర్దంలో పరోక్షంగా టిఆర్‌ఎస్‌ లేదా కెసిఆర్‌ బలమైన నాయకుడని, అతన్ని ఓడించేందుకు ఎక్కడినుండో తమకు అండగా బాహుబలి లాంటి వాడు వస్తాడని అర్థం వచ్చేవిగా ఉన్నాయని, ఇది కాంగ్రెస్‌ పార్టీలో కెసిఆర్‌కు ధీటైన వ్యక్తులు లేరన్న అర్థాన్ని స్పురించేదిగా ఉందని టిఆర్ఎస్ నేతలు జానారెడ్డిపై తమ సహజ ధోరణితో దాడికి దిగారు. ఎదుటి పక్షం దీన్ని అవకాశంగా ఎక్కడ తీసుకుంటుందోనని కాంగ్రేస్ పార్టీకి చెందిన నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, డికె అరుణ,గీతారెడ్డి లాంటి వారు ఆయన మాటలను సమర్ధిస్తూనే వాస్తవంగా జానారెడ్డే తమ బాహుబలి అని కితాబిచ్చారు. మరో సీనియర్‌ నేత వి. హనుమంతరావు, ఎంఎల్‌ఏ సంపత్‌కుమార్‌లు తామే బాహుబలులమంటూ స్వంత డబ్బా కొట్టుకున్నారు. శాసన సభ్యురాలు డికె అరుణ ఎన్నటికైనా ఎలాగూ బాహుబలి రావడం ఖాయమేనంటోంది. కాంగ్రేస్ పార్టీ నాయకత్వానికి ఈ చర్చ ఓ న్యూసెన్సుగా మారిందని ఆ పార్టి నాయకులు కొందరు ఈ విషయాన్ని అధిష్టానానికి ఫిర్యాదు చేయడం సాంప్రదాయంలో భాగంగా జరిగి పోయింది. వారి అధిష్టానం రాష్ర్ట నాయకత్వాన్ని వివరణ కూడ కోరింది. అయితే ఈ బాహుబలి చర్చ ఒక్క కాంగ్రెస్‌తోనే ఆగిపోలేదు. మరిన్ని అనుమానాలకు తావిచ్చే  విదంగా రాజకీయాంశంగా మార్చుకోవడానికి టిఆర్ఎస్ ను ఆ పార్టి అధినేత కెసిఆర్ ను ఆయన అల్లుడు హరీష్ రావును ఆటపట్టించే విదంగా సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టి వర్కింగ్ కమిటి అధ్యక్షులు  రేవంత్‌రెడ్డి  ఆ బాహుబలి ఎవరో ఏమిటో కాదు సుమా కెసిఆర్ అల్లుడు హరీష్‌రావే కావచ్చంటూ కుండ బద్దులు కొట్టినట్లు చర్చను మరో దిశకు తిప్పే ప్రయత్నం చేశారు. బాహుబలి అనేది ఓ వ్యక్తి కాదు, ఓ శక్తి అన్నట్లుగా, రాష్ట్రంలో సామాజిక ఎజండానే బాహుబలి  అవతారం దాలుస్తుందని సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం దాన్ని మరోవిధంగా అన్వయించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపద్యంలో ప్రత్యమ్నాయ ఎజండాతో వస్తే, దాన్ని ఆమోదించేందుకు ప్రజలంతా ఆ బాహుబలి చుట్టు తిరుగుతారన్నారాయన. అలాగే భూర్జువా పార్టీలకు ప్రజలే బాహుబలిగా మారుతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి  మరో విధంగా చూపించారు. ఈ చర్చపై టిఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు కూడా అందుకు ధీటుగానే స్పందించారు. ఎవరో వస్తారని కాంగ్రెస్‌ పార్టీ బాహబలి, కట్టప్ప అన్వేషణలోఉందని, తమకైతే కెసిఆర్‌ రూపంలో బాహుబలి ఉన్నాడంటూ నిజామాబాద్‌ ఎంపి కెసిఆర్ కూతురు కవిత దెప్పిపొడిచారు. ఎజండా, నాయకత్వం సరిగాలేని కాంగ్రెస్‌కు బాహుబలి ఎక్కడి నుండి వస్తాడంటూనే, వచ్చినా తమ బాహుబలి(కెసిఆర్‌) ముందు ఎవరూ నిలువలేరంటూ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి వ్యాక్యానించారు. కాంగ్రెస్‌లో బాహుబలులు కాదు, బఫూన్లు వస్తారని, చేత కాకనే బాహుబలి కోసం ఎదురు చూస్తున్నారని, ఎంతమంది బాహుబలులు, కాటమరాయుళ్ళు(పవన్ కళ్యాన్ కొత్త సినిమా పేరు)  వచ్చినా అయ్యేదీమీ లేదని కెసిఆర్ కుమారుడు మంత్రి కెటిఆర్ ఘాటుగానే స్పందించారు..

ఇక 2018 లో తాను రిటైర్ అయి పోతున్నానంటూనే జానారెడ్డి బాహుబలి వస్తాడంటూ  సస్పెన్స్ లో పెట్టడం ఇది రాజమౌళి సినిమా కథలాగే 2019 ఎన్నికల వరకు  కొనసాగడం మాత్రం ఖాయం.

మండువ రవీందర్ రావు

సీనియర్ జర్నలిస్టు

బాహుబలులు –నేతల బహురూపులు:అసెంబ్లీమే సవాల్ Reviewed by on . వస్తాడు...నిన్నెదిరించే బాహుబలి! తెలుగు చలన చిత్ర దర్శకుడు రాజమౌళి సినిమాలంటే చాలా మంది బహు ఇష్టపడుతారు. ఆయన మనుషుల మీదే కాదు చివరికి ఈగలు, దోమలపై కూడ సినిమాలు వస్తాడు...నిన్నెదిరించే బాహుబలి! తెలుగు చలన చిత్ర దర్శకుడు రాజమౌళి సినిమాలంటే చాలా మంది బహు ఇష్టపడుతారు. ఆయన మనుషుల మీదే కాదు చివరికి ఈగలు, దోమలపై కూడ సినిమాలు Rating: 0
scroll to top