Friday , 21 September 2018

Home » Slider News » బంగారు తెలంగాణలో అరణ్యరోదన

బంగారు తెలంగాణలో అరణ్యరోదన

September 17, 2017 11:04 am by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on బంగారు తెలంగాణలో అరణ్యరోదన A+ / A-

– గొత్తికోయలపై ఖాకీ కావరం
– మహిళల చీరలు లాగి…చెట్లకు కట్టేసి మరీ దౌర్జన్యం
– ఈడ్చేసిన మగపోలీసులు ..పోడుచేస్తున్నారనే సాకుతో జులుం
– పిల్లలు ఏడుస్తున్నా…కాళ్లుమొక్కినా కనికరించని వైనం
– జేసీబీతో 30 ఇండ్లు నేలమట్టం..సామాన్లు విసిరేసి మరీ పాశవికానందం
– పశువుల కంటే హీనంగా ట్రాక్టర్లలలో తరలింపు
– 40మందికి పైగా గాయాలు..దిక్కుతోచని స్థితిలో గొత్తికోయలు

Guthi tribalsగొత్తికోయలపై అటవీశాఖ పోలీసులు తమ కండకావరాన్ని ప్రదర్శించారు. దాష్టీకాన్ని అడ్డుకోబోయిన మహిళలను ఈడ్చి చెట్లల్లో పడేశారు. కాళ్లు మొక్కుతున్న మహిళల చీరలను లాగి పక్కకు తోసేశారు. తమ బతుకులు ఛిద్రం చేయొద్దంటూ వేడుకుంటున్నా కనికరించకుండా ఇండ్లల్లోని సామాన్లు విసిరేసి…రేషన్‌ బియ్యాన్ని వెదజల్లుతూ పాశవికానందాన్ని పొందారు. తమ సామాన్లను తీసుకోబోయిన గొత్తికోయలను ట్రాక్టర్ల పై నుంచి కింద పడేశారు. గొడ్లను బాదినట్టు బాదారు. పోలీసుల తీరును ప్రశ్నిస్తూ ప్రతిఘటించిన మహిళలను చెట్లకు కట్టేసి…గుక్కపట్టి ఏడుస్తున్న పిల్లలను నెట్టేసి మరీ తమ దౌర్జన్యాన్ని కొనసాగించారు. 30 ఇండ్లను కూల్చేశారు. పంటలను డ్రోజర్లతో నాశనం చేశారు. పశువుల కంటే హీనంగా ట్రాక్టర్లల్లో కుక్కి తీసుకెళ్లి మేడారం రోడ్డుపై వదిలేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఈ పాశవిక చర్య ప్రొఫెసర్‌ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి పంచాయతీ పరిధిలోని దట్టమైన అటవీప్రాంతంలోని జనగలంచలో శనివారం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 40 మంది గొత్తికోయలకు గాయాలయ్యాయి.

తాడ్వాయి పరిధిలో గల దట్టమైన అటవీప్రాంతంలోని జనగలంచ ప్రాం తానికి 16 ఏండ్ల కింద చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి గొత్తికోయలు వలసొచ్చారు. 30 గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తు న్నారు. పక్కనే ఉన్న దట్టమైన ఆటవీ ప్రాంతంలో పోడు చేసుకుంటున్నారు. పోడు సాగు వల్ల అటవీప్రాంతం దెబ్బతింటుందని సాకు చూపుతూ డీఎఫ్‌ఐ రవికిరణ్‌ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఒక్కసారిగా సుమారు 250 మంది ఫారెస్టు అధికారులు, 50 మంది పోలీసులు గొత్తికోయగూడెమైన జనగలంచపై విరుచుకుపడ్డారు. తమ వల్ల అడవికి ఎలాంటి ముప్పూ లేదని కాళ్లు మొక్కుతున్నా ఫారెస్టు అధికారులు కనికరించలేదు. ఇండ్లల్లోకి వెళ్లి సామాన్లు, రేషన్‌ బియ్యం బస్తాలను బయటకు విసిరేశారు. అడ్డుకోబోయిన మహిళలను కిందపడేసి కొట్టారు. జుట్టుపట్టుకుని ఈడ్చిపడేశారు. గొత్తికోయలంతా అడ్డుకోబోగా లాఠీచార్జి చేశారు. ఆ తర్వాత మళ్లీ ఇండ్లల్లో చొరబడి సామాన్లు బయటపడేశారు. ఈ క్రమంలో మళ్లీ గొత్తికోయ మహిళలు అడ్డుకున్నారు. దీంతో ఊగిపోయిన పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నా కనికరించలేదు. అక్కడనున్న గొత్తికోయ మహిళల చీరలను లాగేశారు. ‘మమ్ముల్నే అడ్డుకుంటారా?….’ అంటూ దుర్భాషలాడుతూ జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేశారు. ఆ తర్వాత 40 కుటుంబాలకు చెందిన గుడిసెలను చెల్లాచెదురు చేశారు. జేసీబీ సహాయంతో నేలమట్టం చేశారు. ఆ తర్వాత డ్రోజర్లతో పంటలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కుంజా సమ్మక్క, మడకం బీమా, మడకం పోషక్కలకు ఎక్కువ గాయాలయ్యాయి. మరో 40 మంది గొత్తికోయలు గాయపడ్డారు. 100 మందికిపైగా నిరాశ్రయులయ్యారు. అనంతరం గొత్తికోయలను ట్రాక్టర్లలో కుక్కి అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. మేడారం వెళ్లే రోడ్డుపైన కట్టుబట్టలతో గొత్తికోయలను వదిలేశారు. దీంతో ఏమి పాలుపోక ఆ గొత్తికోయలు అమాయకంగా దిక్కుతోచని స్థితిలో అక్కడే ఏడ్చుకుంటూ కూర్చున్నారు.
వరుస దాడులు..ఆందోళనలో గొత్తికోయలు
గొత్తికోయలను అడవుల నుంచి తరలించేందుకు ఫారెస్టు అధికారులు తరుచూ వేధింపులకు గురిచేస్తున్నారు. చత్తీస్‌ఘడ్‌లోని సల్వాజూడుం దాడులతో అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సరిహద్దు ప్రాంతమైన జయశంకర్‌ జిల్లాకు గోదావరి దాటి తరలివచ్చారు. ఇక్కడ కూడా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఫారెస్టు అధికారులు తరుచూ వేధింపులకు గురిచేస్తున్నారు. 15 రోజుల నుంచి దేవుని గుట్ట, మొండ్యిల తోగులలో నివసించే గొత్తికోయలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. సరిహద్దు దాటి వచ్చినా గొత్తికోయలకు జీవించే హక్కు లేకపోవడం మానవహక్కుల ఉల్లంఘనేనని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
గొత్తికోయలను పరామర్శించిన సీపీఐ(ఎం) నాయకులు
అటవీశాఖ అధికారుల దాడిలో నష్టపోయిన గొత్తికోయ బాధితులను సీపీఐ(ఎం) నాయకులు పరామర్శించారు. ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకో వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొదిల్ల చిట్టిబాబు, సీపీఐ (ఎం) మండల కార్యదర్శి గందేటి జైహింద్‌రెడ్డి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు కొట్టెం క్రిష్ణారావులు డిమాండ్‌ చేశారు. బాధితులను పరామర్శించిన వారిలో నాయకులు మైపతి దశరథం, చంద లక్ష్మయ్య, దాసరి క్రిష్ణ తదితరులు ఉన్నారు.
అమాయకులపై దాడులు దుర్మార్గం
బండారి రవికుమార్‌, గిరిజన సంఘం ఉపాధ్యక్షులు
కేసీఆర్‌ ప్రభుత్వం బరితెగించింది. అమాయకులైన ఆదివాసీలపై దాడులు దుర్మార్గం. ఆదివాసీ వ్యతిరేక ప్రభుత్వం ముద్రవేసుకుంటున్నది. సీఎం ఆదేశాలతోనే పోలీసులు ఇలాంటి దాడులు చేస్తున్నారు.ఉద్యమాలను ఉధతం చేస్తాం. ప్రభుత్వం, పోలీసులు తగిన మూల్యం చెల్లించక తప్పదు.
ఇది ప్రభుత్వ దాడి
ధర్మానాయక్‌, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి
తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజనులపై దాడులు పెరిగాయి. ప్రజా స్వామ్యం ఉన్నదా లేదా..అన్న అనుమానం కలుగుతుంది. ఈ దాడిని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ దాడిగా చూడాలి. ఖమ్మం, నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో కూడా గతంతో గిరిజనులపై దాడలు జరిగాయి. హరితహారం పేరుతో ప్రభుత్వం బూటకం చేస్తోంది. అటవీసంపదను దోచుకోవాలని చూస్తున్నారు. పెట్టుబడిదారులకు దారాధత్తం చేయాలని చూస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయడం లేదు. గిరిజనులపై దాడులకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం.
అటవీ అధికారులపై కేసులు నమోదుచేయాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సూడి కృష్ణారెడ్డి
మానవ హక్కులను ఉల్లంఘించి గొత్తికోయగూడెంపై దాడులకు పాల్పడిన అటవీశాఖ అధికారులపై వెంటనే కేసులు నమోదు చేయాలి. లేకపోతే గిరిజనులను సమీకరించి, పోరాటం ఉధృతం చేస్తాం.
అభయారణ్య ప్రాంతం కాబట్టి గొత్తికోయలను తరలించాం.
డిఎఫ్‌ఓ రవికిరణ్‌, జయశంకర్‌ భూపాలపల్లి
ఏటూర్‌నాగారం అభయారణ్యప్రాంతంలో 40 అటవీ అవాస ప్రాంతాల్లో గొత్తికోయలు జీవిస్తున్నట్లు గుర్తించాం. వీరు ప్రధాన రహదారికి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో గుడిసెలు వేసుకుంటున్నారు. జనగలంచ గూడెం కోసం 150 ఎకరాల అడవిని నరికివేశారు. అందుకే వీరిని అక్కడి నుంచి తరలించాం. గొత్తికోయల గూడాల్లో విల్లులు లభ్యమౌతున్నాయి. వేట ఇంకా కొనసాగిస్తున్నారు. అందుకే వారిని గూడాల్లో నుంచి తరలిస్తున్నాం. జనగలంచకు చెందిన గొత్తికోయలను మేడారం సమీపంలోని రహదారి వద్ద గల మైదాన ప్రాంతంలో గల గుడిసెల్లోకి తరలించాం. గొత్తికోయలపై ఫారెస్టు అధికారులెవ్వరూ భౌతికదాడులు చేయలేదు.
దాడులు అమానుషం : టీఎస్‌ఎఫ్‌
భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలం జలజయంచలో గుత్తికోయలపై పోలీసుల దాడులు అమానుషం, అటవికదాడి, దుర్మార్గమైన చర్య అనిట్రైబల్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌(టిఎస్‌ఎఫ్‌) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సంఘం రాష్ట్ర కార్యదర్శి శోభన్‌నాయక్‌ తెలిపారు.
దాడులు ఆపాలి : సీపీఐ (ఎం) డిమాండ్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జనగలంచ గిరిజన గ్రామంపై శనివారం తెల్లవారుజామున ఫారెస్ట్‌ అధికారులు,పోలీసులు దాడి చేసి, దాదాపు 30 మందిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటన విడుదల చేశారు. 2005 సంవత్సరానికి ముందు నుండే ఆదివాసీలు ఇక్కడ నివాసముం టున్నారని తెలిపారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజనుడికి ఏజెన్సీలోని 5 నుండి 10 ఎకరాల రిజర్వు ఫారెస్టులో వ్యవసాయం చేసుకునే హక్కు ఉందని తెలిపారు. ఇది మన పార్లమెంట్‌ చేసిన చట్టమని పేర్కొన్నారు. ఆ చట్టాన్ని తుంగలో తొక్కి పోలీసులు, అటవీ అధికారులు అక్కడ నివాసం ఉంటున్న గిరిజన కుటుంబాలను, ఆస్తులను ధ్వంసం చేశారని విమర్శించారు. ఇండ్లను, గుడారాలను కూల్చివేశారని పేర్కొన్నారు. అడ్డొచ్చిన మహిళలను విచక్షణారహితంగా కొట్టి చెట్లకు కట్టేసి వారి బియ్యాన్ని, వంట సామాగ్రిని దోచుకెళ్ళారని తెలిపారు. దాదాపు 40 మందికి పైగా గిరిజనులకు దెబ్బలు తగిలాయని వివరిం చారు. ఇలాంటి చర్యల ద్వారా యుద్ధ వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టిస్తూ గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నదని తెలిపారు. ఈ ప్రాంత గిరిజనులపై గడిచిన ఆరు మాసాల్లో ఆరుసార్లు దాడులు జరిగాయని గుర్తుచేశారు. ఈ చర్యలపై మానవ హక్కుల కమిషన్‌లో కేసు వేసినప్పటికీ యదేచ్ఛగా దాడులు జరుగుతున్నా యంటే రాష్ట్ర ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా చేయిస్తున్న దాడుల తప్ప మరోటి కాదని విమర్శించారు. ఈ నేప థ్యంలో గిరిజనులపై ఫారెస్టు అధికారుల దుశ్చర్యలను ఆపాలని, దాడులకు పాల్పడిన పోలీస్‌ అధికారులు, ఫారెస్ట్‌ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ్మినేని డిమాండ్‌ చేశారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన కోరారు.

Source….Nava Telangana

బంగారు తెలంగాణలో అరణ్యరోదన Reviewed by on . - గొత్తికోయలపై ఖాకీ కావరం - మహిళల చీరలు లాగి...చెట్లకు కట్టేసి మరీ దౌర్జన్యం - ఈడ్చేసిన మగపోలీసులు ..పోడుచేస్తున్నారనే సాకుతో జులుం - పిల్లలు ఏడుస్తున్నా...కాళ్ - గొత్తికోయలపై ఖాకీ కావరం - మహిళల చీరలు లాగి...చెట్లకు కట్టేసి మరీ దౌర్జన్యం - ఈడ్చేసిన మగపోలీసులు ..పోడుచేస్తున్నారనే సాకుతో జులుం - పిల్లలు ఏడుస్తున్నా...కాళ్ Rating: 0
scroll to top