Sunday , 16 December 2018

Home » Slider News » న‌డుస్తున్న కాలం| దేవుడి రాజ‌కీయాలు | సి. కాశీం |

న‌డుస్తున్న కాలం| దేవుడి రాజ‌కీయాలు | సి. కాశీం |

June 14, 2017 7:04 pm by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on న‌డుస్తున్న కాలం| దేవుడి రాజ‌కీయాలు | సి. కాశీం | A+ / A-

17 మే, 2017న మా చిన్నమ్మ ఫోన్‌ చేసింది. క్షేమ సమాచారం అడిగాక వాళ్ల ఊరికి రమ్మని కోరింది. ప్రత్యేకత ఏమిటని అడిగాను. ఊళ్లో ఆంజనేయ స్వామి దేవాలయం ముందు ద్వజస్తంభం ఎత్తుతున్నారు, ఊళ్లో అందరు తమ బంధువులను పిలుచుకుంటున్నారు, మీరు కూడా రావాలని చెప్పింది. ఇదేమన్న నీ ఇంట్లో పండుగనా? అని అడిగాను. అట్లంటే ఎట్ల బిడ్డ ఊరందరికి పండుగ కదా! అని అన్నది. నేను మధ్యలోనే కలుగజేసుకొని ‘మాదిగోల్లను గుడిలోకి రానిస్తారా?’ అని అడిగాను. లేదు బిడ్డ, మొన్ననే మా మరిది గుడిలోకి పోతే గుడికి మైల పడిందని చెప్పి కొన్ని రోజులు తాళం వేసి ఉంచారు. ఇపుడు ద్వజస్తంభం ఎత్తి పండుగ చేస్తున్నారని చెప్పింది. మరి మీకు ప్రవేశం లేని, మిమ్మల్ని ముట్టుకోనివ్వని గుడి దగ్గర ద్వజస్తంభం ఎత్తితే మీకెందుకు పండుగవుతుంది? దానికి మేమెందుకు రావాలని అడిగితే ఆమె ఫోన్‌లో అమాయకమైన నిట్టూర్పు విడిచింది.

ప్రముఖ విప్లవ కవి కళ్యాణరావు ఊరు దగ్గర్లో ఉండే మరో గ్రామంలో బొడ్రాయి పండుగ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాల, మాదిగ పల్లెలకు ఇతర గ్రామానికి మధ్య ఒక ముళ్ల కంచె వేసి దళితులను నిషేధించారు. బ్రాహ్మణుడు చెప్పాడు కనుక కంచె వేసామని గ్రామ పెద్దలు చెప్పారు. చివరికి దళితులు గొడవ చేసి ప్రశ్నించేసరికి అన్యమనస్కంగా ఉండిపోయారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇలా జరిగింది. తెలంగాణలోనైతే చాలా గ్రామాలలో దళితులకు, దళితేతర కులాలకు వేర్వేరు బొడ్రాయిలు ఉంటాయి.

ఇదీ గ్రామీణ కుల భారతం!!?

పాత ఆంజనేయుని గుడిముందు లేదా మరో గుడి ముందు ద్వజస్తంభం లేకపోవడమో లేదా ఆనాడు కట్టెతో చేసిన ద్వజస్తంభాలు విరిగిపోవడమో జరగటం సహజం. రోడ్లు పెరుగుతున్నకొద్ది బొడ్రాయి భూమిలోకి ఇంకిపోవటము కూడా అంతే సహజం. కాని ఇవ్వాళ వాటి పునరుద్దరణ కార్యక్రమం మొదలు కావడానికి, గుడులే లేని చోట గుడుల నిర్మాణం (తండాలు, ఆదివాసీ గూడాలలో కూడా) కావటం వెనుక

ఉన్న రాజకీయార్థిక కారణాలను, దేవుడి రాజకీయాలను విశ్లేషించాల్సి ఉంది.

ప్రపంచంలో దేవుడు/దేవత అనే మాట విడిగా లేదు. దానికి ఆర్థిక పునాది ఉంది. ఆధ్యాత్మిక బానిసత్వం ఉంది. రాజకీయ కుట్ర ఉంది. ఆ మాట కొస్తే మతమే రాజ్యాన్ని కాపాడే గొప్ప సాధనంగా వేల సంవత్సరాలుగా ఉంటూ వస్తున్నది. కనుక ఇవ్వాళ అధికారంలో ఉన్న వర్గాల ప్రయోజనాలను కాపాడే బాధ్యతను ద్వజస్తంభాలు, బొడ్రాయిలు తీసుకున్నాయి. ఆ రూపంలో దేవుడి రాజకీయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి బహుళజాతి కంపెనీలు ఎంత కృషి చేసాయో, అంత కంటే ఎక్కువగా ఆర్‌ఎస్‌ఎస్‌ దాని అనుబంధ అతివాద మత సంస్థలు చేసాయి. ఆర్థిక, రాజకీయాధికారాన్ని విస్తరించుకోవాలన్నా, ఎక్కువ కాలం నిలబెట్టుకోవాలన్నా దోపిడీ శక్తులకు మతం, దేవుడు విస్మరించలేని సాధనం. అందుకే బీజేపీ అధికారాన్ని ఎక్కువ కాలం నిలబెట్టాలంటే దేవుడి రూపంలో ప్రజలను విభజించడం, ఐక్యం చేయడం అనే రెండంచల పద్ధతిని ఆర్‌ఎస్‌ఎస్‌ గ్రామాలలో అమలు చేస్తున్నది.

ఆర్‌ఎస్‌ఎస్‌ మనుధర్మానికి నిర్మాణాత్మక రూపం. మనుధర్మం దళితులను వేల సంవత్సరాలుగా అంటరానివారిగా ఊరికి దూరంగా ఉంచింది. భూమికి, నీళ్లకు, బడికి, గుడికి, అధికారానికి దూరం చేసింది. ఒకరకంగా వాటిని వారికందకుండా నిషేధించింది. ఈ నిషేధం పైన పోరాటం కూడా ఆనాటి నుంచే ఉండింది. అయితే ఫూలే, అంబేద్కర్‌ వచ్చాక అంటరానితనానికి వ్యతిరేకంగా మనుధర్మం మీద పోరాటం గుణాత్మక రూపం తీసుకున్నది. శాస్త్రీయమైన పద్ధతిలో పోరాటం జరిగింది. వాదన, ప్రతివాదన, పోరాటం అనే రూపంలో ఇవి వ్యక్తమయ్యాయి. ఈ కాలంలోనే కుల నిర్మూలన దృక్పథం అభివృద్ధి అయింది. 1970లలో మహారాష్ట్రలో వచ్చిన ‘దళిత్‌ పాంథర్స్‌’ ఉద్యమం దేశంలోని దళిత మేధావులను ఆలోచింపచేసింది. ఈ నేపథ్యంలోనే 90వ దశకం తర్వాత దళిత ఉద్యమం ఊపందుకున్నది. చాలా ప్రశ్నలను సమాజం ముందు ఉంచింది. ఉద్యమ శక్తులన్ని దళిత ఉద్యమం వేసిన ప్రశ్నలను ఆహ్వానించాయి. దళిత ఉద్యమానికి అంబేద్కర్‌ సామాజిక సిద్ధాంతం భూమికగా పనిచేసింది. ఈ పాతిక సంవత్సరాలుగా అంబేద్కర్‌ ఈ దేశాన్ని ఆవహించాడు. విస్మరించలేని శక్తిగా మారాడు. విప్లవ, వామపక్ష, మత శక్తులందరూ అంబేద్కర్‌పైన తమ విశ్లేషణలను, అంచనాలను ఇవ్వాల్సిన అనివార్యతను అంబేద్కర్‌ సిద్ధాంతం కల్పించింది. దళిత శక్తులకు అంబేద్కర్‌ ఐకాన్‌గా మారాడు. వాళ్ల పోరాటంలో భాగమయ్యాడు. దళిత ప్రజలంతా ఆయనతో ఐడెంటిఫై అయ్యారు.

ఈ రాజకీయ వాతావరణం ఉన్న సందర్భంలోనే బీజేపీ సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మత రాజకీయాలు ఓపెన్‌గానే అమలవుతున్నాయి. దళిత, ముస్లీం, హేతువాద, విప్లవ, వామపక్ష ప్రజల మీద, శక్తుల మీద దాడులు మొదలయ్యాయి. హత్యలు జరిగాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ఆర్‌ఎస్‌ఎస్‌, ఏబీవీపీ కేంద్రాలుగా మార్చే ప్రయత్నం మొదలైంది. విద్యాలయాలు ఘర్షణ పూరితంగా మారాయి. మొదటి నుంచి ఈ శక్తులన్ని ఓటుబ్యాంకు రాజకీయాలలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మోడీ బీసీ కార్డును వాడుతున్నాడు. దేశవ్యాపితంగా బీసీ ఓట్లను హిందుత్వ రాజకీయాలతో కలిపే కుట్రను మొదలుపెట్టారు. బీసీలలో ఉండే హిందుత్వ భావజాలం వలన సులభంగానే వాళ్లు బీజేపీకి దగ్గరవుతున్నారు. ఈ ఫలితం

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో చూసాం. ఇపుడు బీజేపీ దృష్టి దక్షిణ భారతదేశం మీద ఉంది. ఇక్కడ అధికారాన్ని పొందడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నది. అది సాకారం కావాలంటే ఈ ప్రాంతంలోని బీసీ ప్రజలను హిందుత్వ రాజకీయాలతో లింక్‌ చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు భావిస్తున్నాయి.

అందుకే ద్వజస్తంభాల, బొడ్రాయి దేవుళ్ల రాజకీయాలు.
ఈ దేశంలోని గ్రామాలలో కులం ఇంకా పటిష్టంగానే ఉంది. అంటరానితనం నాలుగు పాదాల మీద అమలవుతున్నది. అగ్ర కులాలు, అగ్రకుల బ్రాహ్మణీయ భావజాలంలో ఉన్న బీసీ కులాలు దళితుల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. గ్రామాలలో విప్లవోద్యమ ప్రభావం తగ్గటం వలన బీసీలు, దళితుల మధ్య ఐక్యత లేకపోగా ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. ఈ స్థితి ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులకు అనుకూలించింది. దేవుళ్ల పేరు మీద బీసీలను ఐక్యం చేసి దళితుల మీదికి ఉసిగొల్పవచ్చునని మతశక్తులు భావించాయి. దానికి ద్వజస్తంభాలు, బొడ్రాయిలు సరైన సాధనాలుగా హిందుత్వశక్తులు ఎంచుకొన్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతంలో వినాయక చవితి, దుర్గామాత, కాళికామాత ఆవరించాయి. మిగిలిన గ్రామాలను ద్వజస్తంభాలు, బొడ్రాయిలు ఆక్రమిస్తున్నాయి. ఉత్పత్తిలో భాగం కాకుండా జీవనం గడిపే బ్రాహ్మణిజం దీనిని పెంచి పోషిస్తున్నది.

ఈ దేవుడి రాజకీయాలను పోరాడే శక్తులు ప్రతిఘటించకపోతే మతశక్తుల ప్రభావంలో ప్రజలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. గ్రామాన్ని, దాని ఉత్పత్తి కుల సంబంధాలను అర్థం చేసుకుంటే తప్పా మత శక్తుల రాజకీయాలను ఓడించలేం.

నడుస్తున్న తెలంగాణ ముఖపుస్తకం నుండి సేకరణ

మే 31, 2017

న‌డుస్తున్న కాలం| దేవుడి రాజ‌కీయాలు | సి. కాశీం | Reviewed by on . 17 మే, 2017న మా చిన్నమ్మ ఫోన్‌ చేసింది. క్షేమ సమాచారం అడిగాక వాళ్ల ఊరికి రమ్మని కోరింది. ప్రత్యేకత ఏమిటని అడిగాను. ఊళ్లో ఆంజనేయ స్వామి దేవాలయం ముందు ద్వజస్తంభం 17 మే, 2017న మా చిన్నమ్మ ఫోన్‌ చేసింది. క్షేమ సమాచారం అడిగాక వాళ్ల ఊరికి రమ్మని కోరింది. ప్రత్యేకత ఏమిటని అడిగాను. ఊళ్లో ఆంజనేయ స్వామి దేవాలయం ముందు ద్వజస్తంభం Rating: 0

Related Posts

scroll to top