Saturday , 24 August 2019

Home » NEW » న్యూమరాలజీ అబద్ధాల పుట్ట. మోసం.. దగా

న్యూమరాలజీ అబద్ధాల పుట్ట. మోసం.. దగా

January 12, 2017 1:56 pm by: Category: NEW, బాత్ చీత్ Leave a comment A+ / A-

 

Prof A ramchandraiahన్యూమరాలజీలో శాస్త్రీయత ఎంత?

ప్రశ్న : న్యూమరాలజీ అంటూ టీవీలో చూపిస్తున్నారు. అదెంతవరకు శాస్త్రీయం?

– డాక్టర్‌ ఎ. పల్లవి, హైదరాబాద్‌

జవాబు : అద్భుతమైన గణిత సంబంధ అంశాల్ని అత్యంత అశాస్త్రీయంగా, అసంబద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా ఉపయోగించుకుంటూ సూటుబూటు వేషాల కింద దాగున్న ప్రచ్ఛన్న గూండాగిరీనే న్యూమరాలజీ. దాన్ని ఓ విధానంగా ప్రదర్శిస్తున్న టీవీ చానెళ్లపై నిషేధం లేకపోవడం దేశానికి పట్టిన పెద్ద దయనీయమైన ఛాందస చీడ. ఇలాంటి తంతులు పశ్చిమ దేశాల్లోనూ, ఐరోపా దేశాల్లోనూ చేస్తే వెంటనే మోసకారులుగా గుర్తించి జైల్లో పెట్టేవారు. పేర్లలో ఉండే అక్షరాలను (అది తెలుగు పదమే అయినా) ఆంగ్ల అక్షరాలలోనే లెక్కిస్తారు. ఉదాహరణకు మీ పేరు పల్లవిని ఆంగ్లంలో PALLAVI గా రాస్తారు. అందులో 7 అక్షరాలున్నాయి. నోటికి తోచినట్లు వ్యాఖ్యానించే విధానం కాబట్టి 7 మంచి సంఖ్య కాదంటారు. ప్రపంచంలో ఎవరో దెబ్బతిన్న 7 అక్షరాలున్న వ్యక్తుల, దేశాల, సంస్థల పేర్లను ఏకరువు పెడతారు. వారు కోట్లు నష్టపోయారని, అవమానాలు పడ్డారని ఉదహరిస్తారు. ప్రధానంగా సెలబ్రిటీలను, వీఐపీలను ఉదహరిస్తారు. అది విని ప్రజలు కంగారుపడిపోయే ప్రమాదముంది. మీ జన్మ నక్షత్రాన్నిబట్టి మీ పేరును అటూ ఇటూ మార్చి 7 అక్షరాల నుంచి 8 గానో, 6 గానో మారిస్తే మంచి జరుగుతుందని, ఆఫీసుకొచ్చి సంప్రదించమని సలహా ఇస్తారు. మీరు అమ్మాయి కాబట్టి PALLAVI అంటే బాగోదు అంటారు. లేదా PALLAVEE అంటే (పల్లవీ అని దీర్ఘం తీస్తే) మీ భవిష్యత్తు కూడా సుదీర్ఘంగా వెళ్తుందని చెబుతారు. చివరకి మీరు డాక్టరు అయినా భయపడి చట్టబద్ధంగా పేరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. పెళ్లి సమయంలో అమ్మాయి పేరు అబ్బాయి పేరుకు కుదరడంలేదని… మొత్తం పేరునే మళ్లీ మార్చి పెళ్లి చేస్తున్న మరో దౌర్భాగ్యం ఎటూ ఉండనే ఉంది.

ఇటీవల మృతిచెందిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు JAYALALITHA ఉండగా, అందులో 11 అక్షరాలున్నాయని 11 బేసి సంఖ్య కాబట్టి అది మంచిది కాదని ఎవరో అంటే… ఆమె పేరు చివర అదనంగా మరో A అక్షరాన్ని చేర్చి JAYALALITHAA గా మార్చారు. భారతదేశంలో ఆర్యుల ఆక్రమణను, ఛాందస సంస్కృతిని ఎదిరించి పోరాడిన ద్రవిడ సంస్కృతికి ప్రతినిధిగా ఉండాల్సిన నాయకురాలు, చదువు, చక్కని భాషా పటిమ, కళా వైదుష్యం ఉన్న నాగరికురాలు ఆమె. కానీ JAYALALITHAA అని 12అక్షరాలతో పేరు మార్చుకున్నాను కాబట్టి నాకేమీ కష్టాలు రావనుకొని ఆరోగ్యాన్ని బేఖాతరు చేయడం వల్ల కూడా అకాల మరణం పాలయివుండొచ్చు. ఆ మధ్య టీవీ చానళ్లలో డాక్టరేట్‌ తోక కూడా తగిలించుకొని న్యూమరాలజీ గురించి సొంగ కార్చుకుంటూ ప్రవచించే పెద్దమనిషి ఎవరి పేరులోనైనా UIA అక్షరాలుంటే ప్రమాదమని హెచ్చరించాడు. RUSSIA లో UIA అక్షరాలు ఉండడం వల్లే USSR తునాతునకలయిందన్నాడు . కానీ శుభ్రంగా ఉన్న UNITED STATES OF AMERICA లోని UIA గురించి ప్రయత్నపూర్వకంగానే ప్రస్తావించలేదు.

అసలు పేర్లకు, వారి భవిష్యత్‌కు, సుఖసంతోషాలకు, సౌభాగ్యాలకు, ఆరోగ్య విషయాలకు సంబంధం ఎలా ఉంటుంది? భాష కేవలం Abstract సంకేత సముచ్ఛయం. ఒకే పేర్లును వివిధ భాషల్లో రాస్తే వివిధ సంఖ్యలు వస్తాయి.SOUNDARIYAను తెలుగులో రాస్తే సౌందర్య అంటూ మూడే అక్షరాలు ముచ్చటగా వచ్చాయి. జయ లలిత పేరు ను తెలుగులో జయ లలిత అని రాసినా అదనంగా A చివర పెట్టి ‘జయలలితా’ అని రాసినా ఐదే అక్షరాలుంటాయి. పైగా సంఖ్యలకు కూడా తాత్వికంగా, శాస్త్రీయం గా వాస్తవికత లేదు. అవి కూడా Abstract సంకేతాలు. మనకు చేతులకు కాళ్లకు ఉన్న వేళ్ల సంఖ్య ఆధారంగా 10 ఆధారిత (దశాంశమానం) సంఖ్యామానం వచ్చింది. అందులో 100 అంటే పది మందికున్న మొత్తం చేతులు. కానీ కంప్యూటర్‌ పరిభాషలో వాడే ద్విసాంఖిక పద్ధతిలో 100 అంటే అర్థం మన దశాంశ మానంలో 4కు సమానం. అలాగా మనం తీసుకున్న అంకెల సంఖ్యల ఆధారిత విధానాన్ని బట్టి విలువల సంకేతాలు మారతాయి. ఒక దేశంలో ద్విసాంఖిత పద్ధతినే వాడినట్లయితే వారి భాషలో మంచానికి 100 కాళ్లు న్నాయంటారు. మనం 4 కాళ్లు ఉన్నాయంటాం. జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవాళ్లు, చిలక జోస్యాన్ని నమ్మేవాళ్లు, రాశి ఫలాల్ని నమ్మేవాళ్లు ఉంటేనే ప్రభుత్వాల నిష్క్రియాపర్వతాన్ని ప్రశ్నించే వాళ్లుండరు. అందుకే అలాంటి టీవీల మీద, పత్రికల మీద, వాదాల మీద, వ్యక్తుల మీద నియంత్రణ లేకపోగా పరోక్షంగా ప్రోత్సాహం ఉంది. లౌకికతత్వానికి, శాస్త్రీయ దృక్పథానికి తావివ్వని వ్యవస్థ లోతుగా ఉండడం వల్లే ఈ మధ్య మూఢనమ్మకాలు, అతీంద్రియ శక్తుల మీద విశ్వాసాలు, మతమౌఢ్యం, ఛాందసత్వం, అశాస్త్రీయ వైద్యవిధానాల విశృంఖలత్వం పెరిగిపోతున్నాయి. న్యూమరాలజీకి ఏ విధమైన శాస్త్రీయత లేదు. అది అబద్ధాల పుట్ట. మోసం.. దగా.

ప్రొ|| ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

న్యూమరాలజీ అబద్ధాల పుట్ట. మోసం.. దగా Reviewed by on .   న్యూమరాలజీలో శాస్త్రీయత ఎంత? ప్రశ్న : న్యూమరాలజీ అంటూ టీవీలో చూపిస్తున్నారు. అదెంతవరకు శాస్త్రీయం? - డాక్టర్‌ ఎ. పల్లవి, హైదరాబాద్‌ జవాబు : అద్భుతమైన గణి   న్యూమరాలజీలో శాస్త్రీయత ఎంత? ప్రశ్న : న్యూమరాలజీ అంటూ టీవీలో చూపిస్తున్నారు. అదెంతవరకు శాస్త్రీయం? - డాక్టర్‌ ఎ. పల్లవి, హైదరాబాద్‌ జవాబు : అద్భుతమైన గణి Rating: 0

Leave a Comment

scroll to top