Friday , 21 September 2018

Home » Slider News » నెత్తురోడుతున్న నేరెళ్ల

నెత్తురోడుతున్న నేరెళ్ల

August 6, 2017 9:36 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on నెత్తురోడుతున్న నేరెళ్ల A+ / A-
SCST panel meets victims of Srisilla Village in Telangana state

ఎస్సి ఎస్టి కమీషన్ ముందు గోడు వెల్లబోసుకుంటున్న భాదితులు

తమకి జరిగిన అన్యాయం కంటే ముఖ్యమంత్రి స్పందించిన తీరు నేరెళ్ళ ఇసుక లారీ బాధితుల్ని, వాళ్ళ కొరకు పనిచేసే హక్కుల సంఘాలని, ప్రజాస్వామికవాదులని మరింత బాధపెట్టింది. ఇంకా ఈ లారీలు ఎంత మందిని పొట్టన బెట్టుకోవాలి? అసలు ఒక చిన్న ఊర్లో అతి స్పీడ్‌తో ఇసుక లారీలు నడపొచ్చా? హైదరాబాద్ లాంటి బస్తీలలోనే ఎన్నో స్పీడ్ బ్రేకర్‌లు వేస్తాం, లారీలని వేరే రోడ్డు మీదుగా కేవలం రాత్రి వేళలో మాత్రమే నడుపుతాం. అలాంటిది పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా?

నేరెళ్ల, సిరిసిల్లా ప్రాంతం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇప్పుడు వార్తల్లో నానుతున్నది. అక్కడి దళిత బహుజన జీవితాలు, అమాయక ప్రాణాలు అన్ని కూడా ఇసుక క్వారీల, లారీల క్రింద నలిగిపోతున్నాయి. ‘నెత్తురు పారనిదెన్నడో నా తెలంగాణ పల్లెలో..’ అది విప్లవోద్యమాల కాలంలో పాడుకున్న పాత పాట, ఇపుడు అనేక త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ కొత్తగా మళ్లీ ఇదే పాట పాడుకుంటుంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ వనరుల దోపిడీకి కేంద్రం. తెలంగాణ పల్లెల్లో మళ్లీ పొలీసుల లాఠీలు, సివిల్ డ్రెస్‌లో వచ్చి అబద్దాలు చెప్పి అర్ధరాత్రి మనుషులని ఏరి కోరి తీసుకుపోవడాలు, ప్రశ్నించిన వాడి మీద బైండోవర్‌లు, రౌడీ షీట్ ఓపెన్ చేసి బెదిరింపులు మొదలయ్యాయి.

జూలై 2న ఎరుకల కులానికి చెందిన 55 ఏండ్ల బదనపురం భూమయ్య, రామచంద్రాపురం, హనుమాన్ గుడి దగ్గర, బస్‌స్టాప్ ప్రాంతంలో, సాయంత్రం ఐదున్నర సమయంలో ఒక ఇసుక టిప్పర్ ఢీ కొనడంతో మరణించాడు. భూమయ్యని ఇసుక లారీ మింగేయడం ఇదే మొదటిది కాదు. బహుశా అక్కడ ఇసుక అయిపోయే వరకు చివరిది కూడా కాకపోవచ్చు. గతంలో ఇదే తరహా సంఘటన జరిగినప్పుడు ప్రజల డిమాండ్లు 1. స్పీడ్ బ్రేకర్లు ఉండాలి. 2. స్పీడ్‌ని నియంత్రించాలి. 3. డ్రైవర్లు తాగి నడపకుండా టెస్ట్‌లు చేయాలి. 4. ఆ ప్రాంతం నుంచి లారీలు రాకుండా నిలిపివేయాలి. ఆ ఆందోళనకి అక్కడి రెవెన్యూ అధికారులు, తహసీల్దారులు, పోలీసువారు డిమాండ్లకు తలొగ్గినట్టు నటించారు. కానీ వాళ్ళచేతిలో కూడా ఏమి లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో నేడు సాధారణ ఉద్యోగులు లేరు.

ఒక చావు మరిచిపోక ముందే మరొక చావు, వరుస ప్రమాదాలు, దాదాపు 45 మంది కొద్ది నెలలోనే గాయపడినట్టు అక్కడి ప్రజలు మా నిజనిర్ధారణ బృందానికి ఇచ్చిన సమాచారం. భూమయ్య చనిపోయిన రాత్రి అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి అందులో భాగంగానే కొన్ని లారీలకు నిప్పు పెట్టినరు. మరుసటిరోజు అర్ధరాత్రి అనుమానితుల పేరుతో కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. అందరూ చెప్పింది ఒక్కటే, సివిల్ డ్రెస్‌లో వచ్చి, వారితో పని ఉందని, రమ్మని చెప్పి కారులో తీసుకుని పోయినారు. ఇక ఇసుక లారీల వెనుక ఉన్న కథ. మిడ్ మానేరు ప్రాజెక్ట్ క్రింద 14 ఊర్లు మునిగి పోతున్నాయి. కొన్నింటికి నష్ట పరిహారం, ఆర్ ఆర్ ప్యాకేజీ కింద డబ్బు ఇచ్చినరు. ఒక్క మనువాడ వూర్లో 18 సంవత్సరాలు నిండిన వారికి 8 లక్షలు ఇచ్చి మిగిలిన గ్రామాలలో 2 లక్షలు ఇస్తున్నారని గొడవ జరుగుతుంది. ఈ ప్రాంతంలో రెండు ఇసుక రీచ్‌లు ఉన్నాయి. 1000 లారీలు అధికారికంగా మరొక 500 లారీలు అనధికారికంగా తిరుగుతాయని అంచనా. ఇక్కడ ఉన్న కోదురుపాక ఇసుక రీచ్ మాత్రమే అధికారికంగా మనకి కనపడేది. ఇక్కడినుంచి వచ్చే ఇసుక లారీల లెక్క ఎవరికీ తెలియదు, వే బిల్లు (అనుమతితో నడిచే బండ్లకి ఇచ్చేవి)లు ఉండొచ్చు కానీ చింతల్ ఠాణా/చీర్లవంచ ఇసుక రీచ్ మాత్రం ఎటువంటి వే బిల్స్ లేకుండా యథేచ్ఛగా నడుస్తాయి. ఇసుకకు సంబంధించిన ఏ సమాచారం మామూలు జనాలకి చేరదు. ఈ వ్యాపారం వెనుక వినిపిస్తున్న పెద్ద పెద్ద పేర్లను బట్టి ఈ పరిణామాల నేపథ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇది ముంపు ప్రాంతం అని ఇక్కడ దొరికే ఇసుక ప్రభుత్వానిదేనని, దాన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకి, ప్రాజెక్టులకి వాడుతామని ప్రజలకు చెపుతున్నారు. ఇసుక తవ్వకాలు గత కొన్ని సంవత్సరాలుగా యథేచ్ఛగా జరుగుతున్నాయి. అడిగినవాణ్ణి జైలుకి పంపడమో, చంపడమో ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. దాదాపుగా 1000 లారీలు తిరిగే చోట 1500 లారీలు చిన్న చిన్న గ్రామాల నుంచి, నేరెళ్ల నుంచి హైదరాబాద్‌కి పోతాయి. అక్కడ ఈ లారీల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు అంబేడ్కర్ విగ్రహాన్ని రోడ్డుమీద పెడితే దానిపై కూడా గొడవ జరిగి విగ్రహానికి అనుమతి ఇవ్వలేదని చెపుతున్నారు.

ఎందుకు నేరెళ్ల జాతీయ వార్త అయింది? పోలీసులు మొత్తం 12 మందిపై కేసులు పెట్టారు. తంగెళ్లపల్లిలో ఉన్న పాత బీఈడీ కళాశాల, ఇపుడు పోలీసు స్టేషన్‌లో ఒక్కొక్కరిని 20 మందికి పైగా కొట్టారు. స్థానికులను కడుపులో తొక్కడం, అనేక రకాలుగా దూషిస్తూ కొట్టడం, క్రిందా పైనా కర్రలు దింపి, చెవులకి, మర్మాంగాలకి కరెంట్ షాక్‌లు పెట్టి, వేడి నీళ్లు పోసి చిత్రహింసలు పెట్టారు. జైలరు వారి ఆరోగ్య స్థితి చూసి జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకునేందుకు నిరాకరించారు. అప్పుడు మాత్రమే అది బయటి ప్రజలకి తెలిసింది. జైలర్‌ని ప్రభుత్వ పెద్దలు స్వయంగా బెదిరించారని కూడా తెలిసింది. అసలు విచారణ జరగకుండా, సాక్ష్యాలు లేకుండా ఎందుకు దొంగతనంగా తీసుకపోయినారు? నేరస్థులో కాదో తెలుసుకోకుండా ఇంత చిత్ర హింసలకు దారితీసిన సంఘటనలు ఏమిటి? జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ముందు బాధితులు తమని కులం పేరుతో దూషించారని చెప్పినా కూడా సంబంధిత పోలీసు అధికారిపై ఎందుకు చర్య తీసుకోలేదు? తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా? అసలు ఇక్కడి వనరులు ఎక్కడికి తరలుతున్నాయి? రాష్ట్ర మొత్తం మీద ఇసుక నుంచి 400 వందల కోట్లు వస్తున్నాయని చెపుతారు కానీ సిరిసిల్ల ప్రాంతం గురించి ఎందుకు చెప్పరు? ఒక ఊర్లో ఒక లాగా మిగిలిన ఊళ్ళకి మరొక లాగా నష్టపరిహారం చెల్లించడంలో అర్థం చెప్పగలరా?

ఈ ఘటన వెనుక కులం, వర్గం, వనరుల దోపిడీ, నిరంకుశ పాలన స్పష్టంగా కనపడుతుంది. ఏది ఏమైనా పెద్ద ప్రజా పోరాటాలకు మరొక భూమిక ఏర్పడడము నేరెళ్ల సంఘటనతో ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ప్రజాసంఘాల నాయకుల ధర్నాని అడ్డుకున్నా, నిన్న ఢిల్లీ నుండి వచ్చిన మీరా కుమార్‌ని అడ్డుకోలేక పోయినారు, ఆ ఒక్క రోజే వెయ్యిమంది పోలీసులు ఉన్నట్టు సమాచారం. తెలంగాణ ప్రాంతం అన్యాయాన్ని సహించదు. పోరాటాలు, జైళ్లు, కేసులు కొత్త కాదు. రక్తాలొడ్చిన నేల ఇది. ప్రజాస్వామ్య, సామాజిక, హక్కుల పోరాటాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందనే విషయాన్ని ఇక్కడి పాలకులు తెలుసుకుంటే మంచిది. నేరెళ్ల బాధితులకి న్యాయం జరిగే వరకు ప్రజలు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆందోళనకి సిద్ధమౌతున్నాయి.
తమకి జరిగిన అన్యాయం కంటే ముఖ్యమంత్రి స్పందించిన తీరు నేరెళ్ళ ఇసుక లారీ బాధితుల్ని, వాళ్ళ కొరకు పని చేసే హక్కుల సంఘాలని, ప్రజాస్వామిక వాదులని మరింత బాధపెట్టింది. కేవలం ఇద్దరో ముగ్గురో దళితులు ఉన్నరు అని, అది దళిత సమస్య కాదని అనడం సరికాదు. ఇద్దరో ముగ్గురో ఉంటే దళిత సమస్య కాదా? అక్కడ ఉన్న ఇతర బీసీ కులాలు మనుషులు కారా? వాళ్ళని ఎన్ని చిత్రహింసలైనా పెట్టొచ్చా?

అసలు ఇసుక లారీల మీద ప్రేమ అక్కడ మనుషుల మీద ఉన్నదా? ఇంకా ఈ లారీలు ఎంత మందిని పొట్టన బెట్టుకోవాలి? అసలు ఒక చిన్న ఊర్లో అతి స్పీడ్‌తో ఇసుక లారీలు నడపొచ్చా? హైదరాబాద్ లాంటి బస్తీలలోనే ఎన్నో స్పీడ్ బ్రేకర్‌లు వేస్తాం, లారీలన్నీ వేరే రోడ్డు మీదుగా కేవలం రాత్రి వేళలో మాత్రమే నడుపుతాం. అలాంటిది పేద ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా? ఢిల్లీ నుండి వచ్చిన మీరా కుమార్‌ని వ్యంగ్యంగా మాట్లాడడం ఎంతవరకు సబబు? ఇంత జరిగినా పట్టించుకోని దళిత ఎమ్మెల్యేల్ని చూసి జాలిపడుతున్నారు ప్రజలు.

Sujata Surepellyసుజాత సూరేపల్లి
శాతవాహన యూనివర్సిటీ

ప్రజాతంత్ర ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికలలో ప్రచురితం 

04-ఆగస్ట్2017 – 05ఆగస్ట్2017

నెత్తురోడుతున్న నేరెళ్ల Reviewed by on . [caption id="attachment_4724" align="aligncenter" width="550"] ఎస్సి ఎస్టి కమీషన్ ముందు గోడు వెల్లబోసుకుంటున్న భాదితులు[/caption] తమకి జరిగిన అన్యాయం కంటే ముఖ్య [caption id="attachment_4724" align="aligncenter" width="550"] ఎస్సి ఎస్టి కమీషన్ ముందు గోడు వెల్లబోసుకుంటున్న భాదితులు[/caption] తమకి జరిగిన అన్యాయం కంటే ముఖ్య Rating: 0
scroll to top