Tuesday , 25 June 2019

Home » Slider News » నిరుద్యోగులపై ఇంత దౌర్జన్యమా !

నిరుద్యోగులపై ఇంత దౌర్జన్యమా !

February 23, 2017 12:09 pm by: Category: Slider News, ఫోకస్ Leave a comment A+ / A-

ఎంత అణిచి వేయాలనుకుంటే  తెలంగాణ ప్రజలు అంతగా ఎగిసి పడతారన్న విషయం గుర్తెరిగినంత కాలమే  పాలకులు పదిలంగా ఉంటారు

telangana unemployees rally ప్రొఫెసర్‌ కోదండ రామ్‌ నాయకత్వంలో తలపెట్టిన నిరుద్యోగ ర్యాలీ విషయంలో కెసిఆర్ సర్కార్ వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరం. కడుపు కాలిన నిరుద్యోగులు కదం తొక్కితే ఇంత దౌర్జన్యం చేస్తారా ? ఇదసలు ప్రజా ప్రభుత్వమేనా ? దుఖ్ఖం తన్నుకు వస్తోంది. పిల్లల గోస చూసి వాళ్ల తల్లి దండ్రులు బేజారయ్యిండ్లు. తెలంగాణ వస్తే బతుకు దెరువు వస్తదని ఆంధ్రోళ్లు పోతరని  మన ఉద్యోగాలు మనకే దక్కుతయని ఉద్యమ సమయంలో తల్లి దండ్రులకు నచ్చచెప్పిన తెలంగాణ విద్యార్థులు… వారి తల్లి దండ్రులకే  ఇప్పుడు ముఖం చూప లేక పస్తులతో పట్నాల్లో తిరుగుతూ పరేశాన్ లో పడ్డారు. వారి భాద ఎవరి కర్దం కావాలి?  పట్టించు కునేవారు పట్టించు కోక ముచ్చట్లతోనే కాలం గడుపుతుంటే కోదండరాం ముందు పడ్డడు.

ఉద్యోగాలడిగితే  ఇంత రచ్చ చేస్తారా?  జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సహా రాష్ర్టంలో ఎక్కడి కక్కడే నిరుద్యోగులను నిర్భందించి పోలీస్ ఠానాలను కారాగారాలుగా మార్చిన కెసిఆర్ నీకు ఏ నవాబు సాటి రాడు. గరీబులంటే నీకెంత భయమో….ఎంత కసో మరో సారి అక్షరసత్యాలు అయ్యాయి.

నా చిన్నతనంలో ఆలిండియా రేడియోలో జలసమాధి అని ఒక నాటకం విన్నాను. నాకు ఇప్పటికు బాగా గుర్తు. అందులో ఇద్దరు వ్యక్తులు పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడుతారు. అందులో ఒకరు ధైర్యంగా ఉద్యమం నడిపేవాడైతే, రెండవ వాడు మేథావి. వ్యూహకర్త, భావవ్యాప్తిలో దిట్ట. ఈ ఇద్దరు సాహసంతో సిహాసనం పై ఉన్న నియంతను కూలుస్తారు. తర్వాత  కథ మామూలే. ఉద్యమాన్ని నడిపిన వాడు సింహాసనాన్ని ఎక్కి పాత నియంత కంటే ఎక్కువ అరాచకాలు చేస్తుంటాడు. ఇది చూసి సహించలేని మేథావి తిరిగి తన కలానికి పదును పెడతాడు. అధికారంలో ఉన్న స్నేహితుడు మేథావి రెండు చేతులు నరికేస్తాడు. మేథావి తన గళానికి పని చెబుతాడు. ఇక లాభం లేదని ఒక నీటి తొట్టిలో పడేసి నీళ్లు వదులుతారు. నీరు గొంతు వరకు వచ్చే వరకు ప్రభుత్వానికి తొత్తులా మారితే వదిలేస్తామని లొంగి పోయే అవకాశం ఇస్తారు. కానీ మేథావి తన గొంతులో ప్రాణం ఉండగా అది జరగదంటాడు. గొంతు మునిగింది.. ఇదే నేను చిన్న తనంలో విన్న జలసమాధి నాటకం. ఇదే చరిత్రని తెల్సు కోలేక పోయాను. నాలాగే తెలంగాణ ప్రజలు విద్యార్థులు, విద్యావేత్తలు మేధావులు మోస పోయారు. తాజ్‌మహల్‌ రూపక్పన చేసిన శిల్పులను పాలకులు ఏం చేసారు.? రాళ్లెత్తిన కూలీల చేతులు విరిచి అందమైన తాజ్ మహల్ నిర్మాతలుగా చరిత్ర కెక్కారు. ఇదే రాజుల వ్యూహం. మళ్లీ అటువంటి కళాఖండం  ఎక్కడా కనిపించొద్దని. ఇప్పుడు కేసీఆర్‌ సర్కార్ వైఖరి కూడ ఇట్లాగే కనిపిస్తోంది. తెంగాణ ఉద్యమంలో అనుసరించిన ప్రజాస్వామిక పోరాట విధానాలను, నిరసనలను స్వరాష్ట్రంలో తమ భాదలు వెల్లగక్కనీయకుండా గొంతు నులిమే ప్రయత్నం చేశారు. తెంగాణ సాధించుకున్నది స్వపాలన కోసం తప్ప నియంత పాలన కోసం కాదు కదా?. ‘‘తెంగాణ ఉద్యమంలో ఏనాడు ఏ పోలీస్‌ అధికారి ఇంత రాత్రి వేళ నాయింటి గడప తొక్కలేదు’’, అని  జేఏసీ నేత కోదండరాం ఆవేదన. తమ ర్యాలీ శాంతి యుతంగా ఉంటుందని. అది కేవలం నిరసన రూపమని, ప్రజాస్వామిక హక్కు అని పలుమార్లు పునరుద్ఘాటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని ముందుగానే విద్యార్ధులకు, నిరుద్యోగులకు ఒకటికి పలు మార్లు చెప్పారు. అయినా సర్కార్ కు వణుకు పుట్టింది. పునాదులు కదులు తాయని హడలెత్తింది. ర్యాలీ విజయవంతం అవుతుందన్న విషయం ప్రభుత్వానికి తెల్సు. అసలైన ఇక్కడి ప్రజల మొక్కులు పట్టించు కోకుండా దేవుళ్ల మొక్కులంటూ కెసిఆర్ పోలీసులకు అప్పజెప్పి తమాశా చూశాడు. నిరుద్యోగ ర్యాలీని నిర్వీర్యం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. ఆఖరికి

హడావుడిగా పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షా ఫలితాలు విడుదల చేసారు. ఆగమేఘాల మీద నోటిఫికేషన్లు  విడుదల చేసి పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వానికి ఫలితాు విడుదల  చేయడంలో జాప్యం ఎందుకో తెలియదు. తప్పు ఎవరి వైపు ఉందో సర్కారుకు బాగా తెల్సు. అందుకే కోదండరాం తపెట్టిన ఉద్యమానికి జంకింది. సమాధానం చెప్పాల్సిన వాళ్లు తప్పించుకొని, స్థాయి లేని వాళ్లతో తిట్టించడం అసమర్ధతకు నిదర్శనం. ర్యాలీని అడ్డుకోవడం అంతకన్నా పిరికిపంద చర్య. ఇప్పటి వరకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం, ప్రజాస్వామిక హక్కులను కాలరాయడం దుర్మార్గమే అవుతుంది. ఎంత అణిచి వేయాలనుకుంటే  తెలంగాణ ప్రజలు అంతగా ఎగిసి పడతారన్న విషయం గుర్తెరిగినంత కాలమే  పాలకులు పదిలంగా ఉంటారు. ఇది గతం నేర్పిన పాఠం. ఇదే నా మనోగతం.

చీర భరత్ కుమార్

 

 

 

నిరుద్యోగులపై ఇంత దౌర్జన్యమా ! Reviewed by on . ఎంత అణిచి వేయాలనుకుంటే  తెలంగాణ ప్రజలు అంతగా ఎగిసి పడతారన్న విషయం గుర్తెరిగినంత కాలమే  పాలకులు పదిలంగా ఉంటారు ప్రొఫెసర్‌ కోదండ రామ్‌ నాయకత్వంలో తలపెట్టిన నిరుద్ ఎంత అణిచి వేయాలనుకుంటే  తెలంగాణ ప్రజలు అంతగా ఎగిసి పడతారన్న విషయం గుర్తెరిగినంత కాలమే  పాలకులు పదిలంగా ఉంటారు ప్రొఫెసర్‌ కోదండ రామ్‌ నాయకత్వంలో తలపెట్టిన నిరుద్ Rating: 0
scroll to top