Thursday , 19 July 2018

Latest News
Home » Slider News » ధర్నా చౌక్‌ కోసం జంతర్ మంతర్ లో ధర్నా

ధర్నా చౌక్‌ కోసం జంతర్ మంతర్ లో ధర్నా

August 22, 2017 10:05 am by: Category: Slider News, ప్రధాన వార్తలు Comments Off on ధర్నా చౌక్‌ కోసం జంతర్ మంతర్ లో ధర్నా A+ / A-

జంతర్‌ మంతర్‌ వద్ద గళమెత్తిన విపక్షాలు

Telangana JAC Dharna at Delhi Jantar mantar for Dharna Chowkడిల్లీ: ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు ఢిల్లీలో గళమెత్తాయి. ధర్నాలను నిషేధించి సీఎం కేసీఆర్‌ నిజాం పాలనను మరిపించేలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడ్డారు. సోమవారం విపక్ష పార్టీలు జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాయి. దీనికి టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్, సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ ఎంపీలు వీహెచ్, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సంపత్‌కుమార్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకట్‌రెడ్డి, ఆప్‌ నేత ప్రొ.విశ్వేశ్వరరావు, ప్రజా సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కోదండరాం మాట్లాడుతూ.. ధర్నాచౌక్‌ను తిరిగి సాధించుకున్నప్పుడే తెలంగాణలో ప్రజాస్వామ్య జీవితాన్ని పునరుద్ధరించుకున్నట్టని అన్నారు.

తెలంగాణ సాధించుకున్నా ఏ వర్గమూ సంతోషంగా లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని కుంతియా విమర్శించారు. కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం లేకనే.. ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు యత్నిస్తున్నారని ఉత్తమ్‌ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక దందాలు, భూ కుంభకోణాల్లో మునిగితేలుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. భావస్వేచ్ఛను హరిస్తూ పోలీసుల పహారాలో ప్రభుత్వం పాలన సాగిస్తోందని చాడ వెంకటరెడ్డి అన్నారు. ఇందిరాపార్కు వద్ద ధర్నాలకు అనుమతించకపోతే హైదరాబాద్‌ అంతా ధర్నాచౌక్‌గా మారుతుందని తమ్మినేని హెచ్చరించారు.

కేసీఆర్‌ రాజకీయాల్లోకి రాకముందే ఉంది
కేసీఆర్‌ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ధర్నాచౌక్‌ ఉంది. పార్లమెంటుకు అర కిలోమీటరు దూరంలో ఉన్న జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాలు చేసుకునేందుకు కేంద్రం అనుమతిస్తోంది. అలాంటిది రాష్ట్ర ప్రభుత్వం ధర్నాచౌక్‌ వద్ద ఎందుకు అనుమతి ఇవ్వదు. ఉద్యమ సమయంలో ధర్నాచౌక్‌లో చేసిన ధర్నాలు కేసీఆర్‌కు గుర్తుకు లేవా?

– సురవరం సుధాకర్‌రెడ్డి

బాబ్రీ మసీదు ఘటన తర్వాత ఢిల్లీ బైట్‌ క్లబ్‌లో ఉన్న ధర్నాచౌక్‌ను అప్పటి కేంద్రం ఢిల్లీ వెలుపలకు తరలించింది. కానీ అప్పుడు పోరాడి జంతర్‌మంతర్‌ను సాధించుకున్నాం. అదే స్ఫూర్తితో ధర్నా చౌక్‌ను సాధించుకుంటాం.
– సీతారాం ఏచూరి
ధర్నాచౌక్‌ను పునరుద్ధరించేలా ఆదేశాల్విండి
రాజ్‌నాథ్‌కు నేతల విన్నపం
ఇందిరాపార్క్‌ వద్ద ప్రభుత్వం ఎత్తేసిన ధర్నాచౌక్‌ను పునరుద్ధరించేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను నేతలు కోరారు. ఎంపీ డి.రాజా నేతృత్వంలో కోదండరాం, వీహెచ్, చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం తదితరులు సోమవారం రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ధర్నా చౌక్‌ కోసం జంతర్ మంతర్ లో ధర్నా Reviewed by on . జంతర్‌ మంతర్‌ వద్ద గళమెత్తిన విపక్షాలు డిల్లీ: ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు ఢిల్లీలో గళమెత్తాయి. ధర్నాలను నిషేధి జంతర్‌ మంతర్‌ వద్ద గళమెత్తిన విపక్షాలు డిల్లీ: ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు ఢిల్లీలో గళమెత్తాయి. ధర్నాలను నిషేధి Rating: 0

Related Posts

scroll to top