Friday , 19 July 2019

Home » Slider News » దూసుకుపోయిన కారు

దూసుకుపోయిన కారు

December 12, 2018 11:12 am by: Category: Slider News, ఫోకస్ Comments Off on దూసుకుపోయిన కారు A+ / A-

kcr and his car storyతెలంగాణ మరోసారి తెరాస హస్తగతమైంది. ఎన్ని చెప్పినా ప్రజలు ప్రజాకూటమి పక్షాన నిలువలేదు. తెరాసకు ప్రత్యమ్నాయం అనుకున్న జనసమితిని ప్రజలు ఏమాత్రం ఆదరించకపోవడం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిం చింది. ఈ ఎన్నికల వార్‌ ‌వన్‌సైడ్‌గా నిలిచింది. ప్రజాకూటమి పక్షాన పోటీ పడిన హేమాహేమీలందరూ ప్రజలచే నిర్ద్వంద్వంగా తిరస్కరించబడ్డారు. ప్రధానంగా కాంగ్రెస్‌ ‌దిగ్గజాల కోటలన్నీ బీటలువారాయి. ముఖ్యమంత్రి సింహాసనంపై పెట్టుకున్నవారి ఆశలన్నీ అడియాశలైనాయి. కాంగ్రెస్‌ ‌నేతలు కుందూరు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, దామోదరం రాజనర్సింహ, డికె ఆరుణ, సర్వే సత్యనారాణ లాంటివారంతా ఓటమి చవిచూడాల్సి రాగా, రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్‌, ‌మంత్రులు కెటిఆర్‌, ‌హరీష్‌రావులు విజయోత్సాహంలో మునిగితేలారు. హరిష్‌రావు గెలుపు ఈసారి రికార్డును సాధించింది. ఆరవసారి నెగ్గిన హరీష్‌రావు ఈసారి లక్షా ఇరవై వేలకు మించి మెజార్టీని సాధించడంద్వారా ఆయన తన గత రికార్డును తానే బద్దలు కొట్టారు. కెటిఆర్‌ ‌కూడా దాదాపుగా ఎనబై వేల వోట్ల మెజార్టీతో విజయం సాధించడం తెరాస నేతల్లో ఆమితోత్సాహానికి కారణమైంది. కాని, టిఆర్‌ఎస్‌లో సీనియర్‌ ‌మంత్రులుగా ఉన్న జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, మహెందర్‌ ‌రెడ్డిలు పోటీలో నిలువలేకపోయారు. అయినప్పటికీ మొత్తంమీద టిఆర్‌ఎస్‌ ‌మొదటి నుండీ చెబుతున్నట్లు వందకు చేరుకోకున్నా చెప్పుకోదగ్గ స్థాయిలో, అందరి అంచనాలకు మించి ఎనబై ఏడు స్థానాలను గెలుచుకోగలిగింది.

మంగళవారం ఉదయం ఎనిమిదిగంటలకు వోట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుండీ కారు వేగంగా దూసుకుపోయింది. ప్రతీ నియోజకవర్గంలోనూ తెరాస మొదటి రౌండు నుండే తన ఆధిక్యతను నిలుపుకుంటూనే వచ్చింది. ప్రతీ రౌండ్‌లో తెరాస అభ్యర్థులు అదే తరహాలో ముందంజలో నిలుస్తూ వచ్చారు. ఆదిలాద్‌బాద్‌, ‌మహబూబ్‌నగర్‌ ‌లాంటి జిల్లాల్లో కనీసం ఒక స్థానాన్ని కూడా విపక్షాలు సాధించుకోకపోవడమే కారు ఎంత వేగాన్ని పుంజుకున్నదన్నది అర్థమవుతోంది. టిడిపికి మంచి పట్టు ఉంటుందని చెప్పే హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బావమరిది నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసిని లాంటివారు ఓటమి చవిచూడాల్సిరావడం విచిత్రకరపరిణామం. దీంతో హైదరాబాద్‌లోని సెటిలర్స్ అం‌తా తెలంగాణ పక్షాన నిలిచారన్నది దీనితో స్పష్టమైంది. సెటిలర్స్ అన్న పదాన్నే వాడవద్దని, తెలంగాణలో నివసిస్తున్నవారంతా తెలంగాణవారేనని, వారిని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్న తెరాస అధినేత కెసిఆర్‌ ‌మాటలపట్ల వారు విశ్వాసాన్ని కనబర్చినట్లు ఈ ఫలితాలవల్ల తెలుస్తోంది. ఫలితంగా రాజకీయ సన్యాసం గురించి తరుచూ సవాల్‌ ‌విసురుకునే కొడంగల్‌ ‌నియోజకవర్గంనుండి పోటీపడిన టైగర్‌ ‌రేవంత్‌రెడ్డి లాంటివారు కూడా ఇంటిబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తెరాసను ఏకాకిని చేయడంద్వారా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామనుకున్న కాంగ్రెస్‌ ‌కూటమికి ఎదురుదెబ్బ తాకింది. తన బద్ధ శత్రువైన టిడిపితో పొత్తు పెట్టుకోవడంద్వారా తిరుగులేని విజయం సాధిస్తామనుకుందా పార్టీ. తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఒక వేళ మ్యాజిక్‌ ‌ఫిగర్‌ ‌రాకపోయినా టిఆర్‌ఎస్‌ ‌కన్నా ఎక్కువ స్థానాలే వస్తాయని భావించింది. అదే ఉద్దేశ్యంతో ఫలితాలకన్నా ముందే రాష్ట్ర గవర్నర్‌ను కలిసి తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కూడా కోరింది. కాని కూటమికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ చెప్పినట్లు మరే పార్టీ మద్దతు అవసరంలేకుండా స్పష్టమైన మెజార్టీని తెరాస సాధించుకుంది. కాంగ్రెస్‌ ‌కేవలం రెండు పదులస్థానాలను పొందింది. తెలంగాణలో టిడిపి గట్టి క్యాడర్‌ ఉం‌దనుకున్నా అది కేవలం రెండు అంటే రెండు స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలో జంఢా ఎగురవేస్తామని చెప్పిన భారతీయ జనతాపార్టీ కూడా కేవలం ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది. టిజెఎస్‌కు కనీసం చంపుడు పందెం పుట్టకుండా పోయింది. కాగా టిఆర్‌ఎస్‌ అనూహ్యంగా ఎనభై ఏడు స్థానాలతో ఆఖండ విజయాన్ని సాధించుకుంది దీంతో తెరాస రెండవసారి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోంది. తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి త్వరలో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మండువ రవీందర్ రావు
సీనియర్ జర్నలిస్టు

దూసుకుపోయిన కారు Reviewed by on . తెలంగాణ మరోసారి తెరాస హస్తగతమైంది. ఎన్ని చెప్పినా ప్రజలు ప్రజాకూటమి పక్షాన నిలువలేదు. తెరాసకు ప్రత్యమ్నాయం అనుకున్న జనసమితిని ప్రజలు ఏమాత్రం ఆదరించకపోవడం ఈ ఎన్న తెలంగాణ మరోసారి తెరాస హస్తగతమైంది. ఎన్ని చెప్పినా ప్రజలు ప్రజాకూటమి పక్షాన నిలువలేదు. తెరాసకు ప్రత్యమ్నాయం అనుకున్న జనసమితిని ప్రజలు ఏమాత్రం ఆదరించకపోవడం ఈ ఎన్న Rating: 0
scroll to top