Friday , 19 July 2019

Home » Slider News » తెలంగాణ ప్రజా బాహుబలుడు కెసిఆర్…………..ఉద్యమ రథసారధికే జనం జేజేలు

తెలంగాణ ప్రజా బాహుబలుడు కెసిఆర్…………..ఉద్యమ రథసారధికే జనం జేజేలు

December 12, 2018 10:58 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on తెలంగాణ ప్రజా బాహుబలుడు కెసిఆర్…………..ఉద్యమ రథసారధికే జనం జేజేలు A+ / A-

kcr birth day celebratedతెలంగాణ జనం తీర్పు వెలువడింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కెసిఆర్ అఖండ మెజార్టీతో అధికారం నిలుపు కున్నారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ పోరులో అగ్ర భాగాన నిలిచిన నేత వెంటే జనం నిలిచారు. పాలనా పగ్గాలు మీచేతుల్లోనే  ఉండాలని తీర్పు ఇచ్చారు. తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి అర్దాంతరంగా నిలిచి పోరాదని కెసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు మున్ముందుకు సాగి పోవాల్సిందేనని తెలంగాణ జనం తేల్చేశారు. కెసిఆర్ ఇప్పుడు తిరుగు లేని నాయకుడు. రాజకీ రంగంలో అశేష  తెలంగాణ జనం బలంతో శక్తివంతంగా  ఎవరికి అందనంతగా కొండంత ఎత్తుకు ఎదిగిన “బాహుబలుడు”.

గెలుపు ఓటములపై అనేక విధాలుగా విశ్లేషణలు ఉన్నాయి. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమంటే కూటమి కట్టిన నాలుగు పార్టీల ప్రతి పక్షాలు మరో వైపు కేంద్రంలో అధ్కారంలో ఉన్న  బిజెపితో  పాటు ఇతరత్రా చిన్నా చితక రాజకీయ  పక్షాలు కల్సి కెసిఆర్ పై తలపడగా కెసిఆర్ ఒకే ఒక్కడు ఒంటి చేత్తో ఎన్నికలు ఎదుర్కొన్నాడు.  కెసిఆర్ తరుచూ తనకు తాను తన రూపురేఖలపై జోకులు వేస్తుంటాడు. తాను పెద్దగా అందగాన్ని కాదని  అయినా తెలంగాణ జనం అండతో ఇదంతా సాధించానని చెబుతుంటాడు. తెలంగాణ ప్రజలను తన మాటలతో సమ్మోహితులను చేయటంలో కెసిఆర్ ను మించిన నాయకుడు ఎవరూ లేరు.  తెలంగాణ స్వరాష్ర్టం కోసం14 సంవత్సరాలు సాగిన సుదీర్ఘ పోరాటంలో ఆయన తెలంగాణ ప్రజల ఏకాత్మగా విలిచారు. తెలంగాణ ప్రజలు కూడ కెసిఆర్ పై పూర్తి భరోసా ఉంచారు.

ఇప్పుడప్పుడే కెసిఆర్ లేని పాలనను తెలంగాణ జనం ఊహించు కునే స్థాయిలోలేరు. అందుకే  రాష్ర్టం ఏర్పడిన అనంతరం జరిగే రెండో దఫా ఎన్నికల్లో కెసిఆరే తమ నాయకుడిగా కొనసాగాలని మీ వెంటే మేమున్నామంటూ

తెలంగాణ ప్రజలు తీర్పిచ్చారు.

కెసిఆర్ పై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. కొత్తగా ఏర్పడిన రాష్ర్టంలో నాలుగున్నర ఏండ్లు పాలించిన కెసిఆర్ పాలనకు ఆమోద ముద్ర వేశారు. 2014 లో తెలంగాణ రాష్ర్ట  తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారు.  వికలాంగులు, వృద్ధాప్య పెన్షన్లు,  కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, వంటి పథకాలు ఈ ఎన్నికల్లో ఆయనకు బాగా ఉపకరించాయి. వీటికి తోడు దేశంలో ఎక్కడా లేని విదంగా రైతుల కోసం రూపొందించిన రైతు భందు పథకంతో పాటుగా రైతు భీమా పథకం  కూడ తోడైంది. కెసిఆర్ స్వయంగా పథక రచన చేసి రూపొందించిన ఈ పథకాలు జనామోదం పొందడమే కాదు బుహుల ప్రజాదరణ పొందాయని ఈ ఎన్నికలు రుజువు చేసాయి.  రైతు భందు పథకంలో అంద చేసే పంట పెట్టు బడి సహాయం కౌలు రైతులకు ఇవ్వనందుకు వారంతా ఆగ్రహంతో ఉన్నారనే అంశం ఈ ఎన్నికల్లో ప్రభావం చూప లేక పోయింది. కెసిఆర్ కు ఈ ఎన్నికల్లో మైనస్ పాయింటవుతుందనుకున్న  ప్రాజెక్టుల రీడీజైన్ అంశం కూడ అంతగా జనం పట్టించు కోలేదు.  ఉపాధి, ఉద్యోగ, నిరుద్యోగ సమస్యలు కూడ ఈ ఎన్నికల్లో కెసి ఆర్ కు సమస్య కాలేక పోయాయి.  నిరుద్యోగులకు నెల నెల ఉద్యోగ భృతి ఇస్తానని కెసిఆర్ ఎన్నికల మానిఫెస్టోలో చేర్చారు. దాంతో నిరుద్యోగులు కొంతలో కొంత తాత్కాలికంగా ఉపశమనం పొంది ఉండవచ్చు.  ఇక కుటుంబ సబ్యుల పెత్తనంపై వచ్చిన ప్రతి పక్షాల ఆరోపణలు, విమర్శనాస్ర్తాలు కూడ జనం అంతగా పట్టించు కోలేదు.

రేవంత్ రెడ్డి వంటి నేతలు పదే పదే కెసిఆర్ ను ఆయన పరివారాన్ని ఆడి పోసు కోవడం ఒక రకంగా కెసిఆర్ కే లాభించింది. ఈ రోజుల్లో కుటుంబ సబ్యుల పెత్తనం లేని వారసత్వ రాజకీయాలు దేశ వ్యాప్తంగా కామన్  అయి పోయాయని జనం లైట్ తీసుకుని ఉండవచ్చు.

కెసీఆర్ అర్దాంతరంగా అసెంబ్లి రద్దు చేసి సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. అంతే కాకుండా అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా అవేవి కెసిఆర్ కనీసం పరిగణన లోకి తీసు కోకుండా ఒకరిద్దరికి మినహా అందరికి టికెట్లు ఇచ్చాడు. మీరంతా జయ కేతనంతో  విజేతలై తిరిగి వస్తారని బి ఫాంలు ఇచ్చి పంపించాడు. అసెంబ్లి రద్దు అనంతరం సిట్టింగ్ ఎమ్మల్యేలలో 105 మందికి ఏకంగా  టికెట్లు ఇచ్చి  పంపినపుడు ఆయన స్వంత పార్టీ ఎమ్మేల్యేలే  అనేక మంది గెలిచి రాగలమాలేదా అని  తీవ్ర సందిగ్దంలో పడ్డారు.  ప్రస్తుతం చివరి వరకు అసలు బయట పడగలమా లేదా అని కొట్టు మిట్టాడిన అనేక మంది సిట్టింగులు ఆఖరికి తమ కొచ్చిన మెజార్టి చూసి  సంభ్రమాశ్చర్యాల్లో మునిగి పోయారు.

ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే స్థానికంగా అభ్యర్థులపై ఉన్న ప్రజా వ్యతిరేకత  కూడ అంతగా ప్రబావం చూప లేక పోయిందని చెప్ప వచ్చు. స్థానిక అభ్యర్థుల వ్యవహార శైలి నచ్చక పోయినా జనం కెసిఆర్ ముఖం చూసి ఓట్లేసారు.  ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు చిత్తుగా ఓడి పోతారకున్న వారు అనేక మంది ఈ సారి భారి మెజార్టీతో గెలిచారు.

ఉద్యమ నేతగా అసలు కెసిఆర్ కు రాష్ర్టంలో ఎదురు ఉండనే వద్దు. నాలుగు ప్రధాన  ప్రతి పక్షాలు ఆయకు వ్యతిరేకంగా కూటమి కట్టడం ఈ ఎన్ని కల్లో కెసిఆర్ కు  ఓ పెద్ద సవాల్ గా మారింది. అయినా ఈ ప్రతి కూల పరిస్థితుల్లో ప్రజా కూటమి ఎత్తులను  కెసిఆర్ ఎంతో  సమయస్పూర్తితో ఎదుర్కున్నారు. కూటమి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. తెలంగాణ ప్రజల నాడిని బాగా ఎరిగిన నేతగా తన వద్ద ఉండే అస్త్ర శస్ర్తాలను  గురి చూసి వదిలారు. చంద్రబాబు రూపంలో ఆయనకు అన్నిటికన్నా మించి బ్రహ్మాస్త్రం లభించింది. గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడ కెసిఆర్ వదులు కోలేదు. అధికార దుర్వినియోగం జరిగిందని పోలీసుల చేత దౌర్జన్యాలు చేయించారని  ధన ప్రవాహం విచ్చల విడిగా  జరిగిందని విపక్షాలు ఆరోపించాయి. ప్రజా కూటమి నేతల వ్యూహాలకు తెలంగాణ జనం చేజారి  పోకుండా కెసిఆర్ వారిని తన చాకచక్యంతో కట్టి పడేసారు.

ఈ ఎన్నికల్లో అఖండ విజయం స్వంతం చేసుకున్న ఘనత కెసిఆర్ కే దక్కుతుంది. ఈ విజయం కేవలం ఆయన వ్యక్తి గత ప్రతిష్టతో సిద్దించింది. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ జనం వెంట నిలిచి అహోరాత్రులు శ్రమించినందుకు  తెలంగాణ జనం ఆయనకు బ్రహ్మరథం పట్టి రెండో సారి పట్టం గట్టారు.

కూనమహేందర్

సీనియర్ జర్నలిస్ట్

ప్రజాతంత్ర దినపత్రిక 12-12-2018

తెలంగాణ ప్రజా బాహుబలుడు కెసిఆర్…………..ఉద్యమ రథసారధికే జనం జేజేలు Reviewed by on . తెలంగాణ జనం తీర్పు వెలువడింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కెసిఆర్ అఖండ మెజార్టీతో అధికారం నిలుపు కున్నారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ పోరులో అగ్ర భాగాన నిలిచిన నేత తెలంగాణ జనం తీర్పు వెలువడింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కెసిఆర్ అఖండ మెజార్టీతో అధికారం నిలుపు కున్నారు. ఉద్యమ నాయకుడిగా తెలంగాణ పోరులో అగ్ర భాగాన నిలిచిన నేత Rating: 0
scroll to top