Friday , 19 July 2019

Home » Slider News » జనరంజక పాలనే అయితే తండ్రి తనయుల అసహనం ఎందుకో?

జనరంజక పాలనే అయితే తండ్రి తనయుల అసహనం ఎందుకో?

November 24, 2018 9:18 am by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on జనరంజక పాలనే అయితే తండ్రి తనయుల అసహనం ఎందుకో? A+ / A-

kcr and ktr“రాజ్యం వీరభోజ్యం” అనేది రాచరిక కాలం నుండి బహుళ ప్రాచుర్యం పొందిన  ఓ ఆర్యోక్తి. ఇందులో ఓ ధర్మ సూక్ష్మం ఇమిడి ఉంది. వీరులకే రాజ్యం దక్కుతుందనే అర్దంలో ఈ సామెతను తరుచూ ఉపయోగిస్తుంటారు. ఎక్కువగా చారిత్రక గాధల్లో ఈ పదం తారస పడుతుంటుంది. తిరుగు లేని మహారాజుగా వెలుగొందిన తెలంగాణ  అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన మంత్రి వర్గంలో కొనసాగిన ఆయన తనయుడు కల్వకుంట్ల తారకరామారావు ఇద్దరూ విపక్షాలపై కత్తులు దూసి కవాతు నిర్వహించడంలో ఆరి తేరిన వారు. ఇంకా గడువు ముగియక ముందే అసెంబ్లీని హఠాత్తుగా రద్దు పరిచి ముందుస్తు ఎన్నికలకు సైరన్ ఊదిన వారు. వందకు పైగా సీట్లు మావేనంటూ బీరాలు పలికి పోటీకి ఎవరొస్తారో రండంటూ సవాల్ విసిరిన వారు. ఎందుకో కాని హఠాత్తుగా తండ్రి తనయులను ఇద్దరిని  ఏదో తెలియని అసహనం వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది.  ఇద్దరూ వేరు వేరు సందర్భాలలో బాహాటంగానే తమ అసహనాన్ని పబ్లిక్ గా  వెల్లగక్కారు.

ఓడిపోతే సన్యాసం పుచ్చుకుంటానని ఈ దేశంలోనే ఉండబోనని తనయుడు కెటిఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో అసహనం వెల్ల గక్కారు. ఓటమా?  మాకా?  నెవర్….. అంటూ  జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలతో సహనం కోల్పోయిన తారక రాముడు చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద చర్చ నీయాంశంగానే మారాయి. ఇదే మీట్ ది ప్రెస్ లో జర్నలిస్టులు సంధించిన అనేక ప్రశ్నలకు కెటిఆర్ అహం దెబ్బతింది. అధికార అదిలింపులతో వెటకారపు విరుపులతో జర్నలిస్టులపైనా వార్తలపైనా వాటి  విలువలపైనా ఇంకా అనేక విసుర్లే విసిరాడు. నామినేషన్లు వేసిన సందర్భంగా  తండ్రి కొడుకుల మద్య అప్పుల లావాదేవీలు జరిగినట్లు అఫిడవిట్ లో సమర్పించిన వివరాల మేరకు పత్రికల్లో  వార్తలు వచ్చాయి. అసలు అది వార్తాంశం ఎట్లా అవుతుందని కెటిఆర్ జర్నలిస్టులను  ఎదురు ప్రశ్నించారు.  ఏం…. తండ్రి కొడుకుల మద్య ఆర్థిక లావాదేవీలు ఉండకూడదా? అంటూ నేను మీతో వాదనలు చేయదల్చుకోలేదంటూనే వాదనకు దిగారు. అసలు లావాదేవీలు ఉండకూడదని ఏ జర్నలిస్టు అనలేదు. . అఫిడవిట్లో ఇట్లా పొందు పరిచారని మాత్రమే వార్తలు రాసారు. సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చేరవేయడమే నేరమైనట్లు కెటిఆర్ మాట్లాడటం ఎంత వరకు సహేతుకమో ఆయనకే వదిలేద్దాం. ఎన్నికల కమీషన్ కు వెల్లడించిన ఆస్తుల వివరాల్లో  ప్రమాణ పూర్వకంగా సత్య మెంతో ఆయనకే తెలియాలి.  ఆ మాట కొస్తే కెటిఆరే కాదు అభ్యర్థులందరూ ఎన్నికల కమీషన్ కు అసత్యాలతో కూడిన ఆస్తుల వివరాలు సమర్పిస్తున్నారు. ఆ విషయాన్నింటిని జర్నలిస్టులు వదిలి పెట్టలేదు.

కెటిఆర్ మీట్ ది ప్రెస్ సందర్భంగా ఆయన పొగరుగా ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. కెటిఆర్ ఈ రాష్ర్ట ముఖ్యమంత్రికి ముద్దుల తనయుడే కావచ్చు. రేపటి ఎన్నికల్లో మెజార్టి వస్తే అందరూ ఊహించే విదంగా  ఏదో ఒక సుముహుర్తంలో ముఖ్యమంత్రి అయినా  ఆశ్చర్యం లేదు. అయితే జర్నలిస్టులతో మాట్లాడే సన్నివేశంలో తన అధికార దర్పాన్ని  అహంకారాన్ని ప్రదర్శించటం చూసిన వారికెవరికి నచ్చలేదు.

ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల ప్రచార పర్యటన సందర్భంగా అపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడ అసహనాన్ని వెల్లగక్కారు. స్వంత పార్టి కార్యకర్తల పైనా నాయకులపైనా తరుచూ అసహనం వెల్లగక్కడం కెసిఆర్ కు అలవాటే కాని ఈసారి ఏకంగా తెలంగాణ ప్రజానీకంపైనే అసహనం ప్రదర్శించారు. “నేను ఓడిపోతే నాకే నష్టం లేదని….. ఫాం హౌవుజులో వ్యవసాయం చేసుకుంటానని మీ పరిస్థితిమి ఏమవుతుందంటూ”  కెసిఆర్ ఎన్నికల బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలు కల కలం రేపాయి. తండ్రి, తనయులు చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు అస్ర్తాలయ్యాయి.

అసలు ఓడిపోతే సన్యసిస్తాననడమేమిటి? అసలీదేశంలోనే ఉండబోనని కెటీఆర్  చెప్పడం ఏమిటి? మీరు గెలిస్తే సరే కాని ఇతరులెవరు గెలిచినా భరించ లేరా? ప్రజాస్వామ్యం పట్ల మీకున్న గౌరవ మర్యాదలు ఇవేనా? ప్రజానీకం ఇచ్చే తీర్పును మీరు శిరసా వహించరా?

విపక్షాల విమర్శలు పక్కన పెడితే…….నేనోడితే ఫాం హౌవుజ్ లో పడుకుంటానని…….. నష్ట పోయే వారు మీరేనని కెసిఆర్ మాట్లాడిన మాటలు ఎట్లా అర్దం చేసుకోవాలి? ఇది ప్రజలను నేరుగా బ్లాక్ మెయిల్ చేయడం కాదా? ఎపి సిఎం చంద్రబాబు నాయుడు బూచి చూపి ప్రజలను భయ పెట్టడం కాదా? అంటు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

నూట 19 సీట్లకు గాను నూరు పైన సీట్లు మావే నంటూ పలు సార్లు  ప్రకటించారే….ఇప్పుడేమైంది?  సడెన్ గా ఎదురు గాలి మొదలైందా? విపక్షాలది సింగిల్ డిజిటే నని తమకు మాత్రం మూడు డిజిట్లకు సీట్లు తగ్గవని చెప్పిన మీకు ఓటమి భయం ఎందుకు పట్టుకుంది?. మీ పాలన జనరంజక పాలనే అయితే గెలుపుపై ధీమా ఉంటే తండ్రి కొడుకులు ఇద్దరికి  భయమేల?

ఎందుకంటే కెసిఆర్ అనుకున్నదొకటి అయితే అయ్యింది ఒకటి. రాష్ర్టంలో జనరంజక పాలన సాగుతోందని ముందస్తు ఎన్నికలకు వెళితే అఖండ విజయం తధ్యమని భావించి అసెంబ్లీని రద్దు చేసి అందరికన్నా ముందుగానే  సిట్టింగ్ అభ్యర్థులకే సీట్లు ఖరారు చేస్తూ జాబితా  ప్రకటించారు. ఇక వెళ్ళండి ప్రచారానికి అంటూ మార్గ నిర్దేశనం చేసారు. గ్రామాలకు వెళితే కాని ఎమ్మెల్యేలకు పరిస్థితి తెల్సి వచ్చింది కాదు. ఏం చేశారంటూ జనం నిలదీస్తూ అడుగుతుంటే ఏం సమాధానాలు చెప్ప లేక నీళ్లు నమిలారు.

కెసిఆర్ చేయించిన సర్వేల మాటేమిటో కాని జనం రియాక్షన్ చూస్తే ఏదో తెలియని అసంతృప్తి మాత్రం ఉందనేది స్పష్టం అయితే తమ పార్టిపైన కాని పార్టి అధినేతపై కాని వ్యతిరేకత లేదని స్థానికంగా అభ్యర్థులపై కొంత వ్యతిరేకత ఉంటే ఉండవచ్చని ఇవన్ని తమ నాయకుడు ప్రచారం మొదలు పెడితే తుడుచుకు పోతాయంటూ సరి పుచ్చుకున్న పార్టి వర్గాలను సైతం గెలుపు పట్ల అనుమానాలు వెంటాడుతున్నాయి.

ఓటమి చెందితే నాకేమి నష్టం లేదని అధినేత చెప్పడం పార్టి వర్గాల అనుమానాలకు మరింత బలం చేకూర్చి నట్లు అయింది. కాంగ్రేస్, తెలుగుదేశం,కోదండరాం అధ్వర్యంలోని తెలంగాణ జన సమితి, సిపిఐ పార్టీల కూటమి కుదురుంతా అనుకున్న టిఆర్ఎస్ నేతలకు కూటమి ఓ పెద్ద భూతంలా కనిపిస్తోంది. అందుకే అధినేత కెసిఆర్ ఇక తన అంబుల పొదిలో ఉండే ఒక్కో అస్ర్తం బయటికి తీసి వదులుతున్నాడని విశ్లేషిస్తున్నారు. గెలిపిస్తే సరే సరి లేదంటే నాకైతే ఏం నష్టం లేదనడాన్ని తెలుగు దేశం పార్టి అధినేత చంద్రబాబు నాయుడును ఎక్కువగా టార్గెట్ చేసి విరుచుకు పడటం అంతా కెసిఆర్ వ్యూహాస్త్రాలలో భాగమే నని చెప్ప వచ్చు.

తెలంగాణ ప్రజల నాడి ఎరిగిన నాయకుడిగా కెసిఆర్ కూటమి వస్తే జరగ బోయే నష్టాలను ఎన్నికల సభల్లో పూసగుచ్చినట్లు ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుపై కెసిఆర్ ఎన్నికల ప్రచార సభల్లో చివరి వరకు దాడిని కొనసాగించేందుకే సిద్దపడినట్లు ఆయన ప్రచార సభల ప్రసంగాలు తెలియ చేస్తున్నాయి.

కూటమి వస్తే చంద్రబాబు పెత్తనమే ఉంటుందని దరఖాస్తులు పట్టుకుని ఆమరావతికి వెళ్లాల్సి ఉంటుందని  ప్రాజెక్టులు నిలిచి పోతాయని, అంధకారం మిగులుతుందని ఎంతో కష్ట పడి తెచ్చుకున్న తెలంగాణ లో అభివృద్ధి  అడుగంటి పోతుందని కెసిఆర్  సెంటిమెంట్ తో కూడిన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కెసిఆర్.

ఆయన వాదనలను కాంగ్రేస్ నాయకులు ఎన్నికల సభలలో తిప్పి కొడుతున్నారు. ఇంత కాలం మీరు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని ఎవరు ఆపారంటూ కెసిఆర్ ను నిలదీస్తున్నారు. కాంగ్రేస్ నేత రేవంత్ రెడ్డి అయితే కెటిఆర్ ఆర్థిక నేరగాడని దుయ్య బడుతూ  అతని పాస్ పోర్టు రద్దు చేసి రెడ్ కార్నర్ నోటీస్ జారి చేయాలని ఎన్నికల కమీషన్ కు విజ్ఞప్తి చేశారు. మొత్తానికి కెసిఆర్ వ్యూహాలను కూటమి భాగస్వామ్యులు ప్రతి వ్యూహాలతో తిప్పి కొట్టే యత్నాలు చేస్తుండడంతో ఎన్నికల సభలు వేడెక్కాయి.

కూన మహేందర్

సీనియర్ జర్నలిస్ట్

(ప్రజాతంత్ర దినపత్రిక 24-11-2018)

జనరంజక పాలనే అయితే తండ్రి తనయుల అసహనం ఎందుకో? Reviewed by on . “రాజ్యం వీరభోజ్యం” అనేది రాచరిక కాలం నుండి బహుళ ప్రాచుర్యం పొందిన  ఓ ఆర్యోక్తి. ఇందులో ఓ ధర్మ సూక్ష్మం ఇమిడి ఉంది. వీరులకే రాజ్యం దక్కుతుందనే అర్దంలో ఈ సామెతను “రాజ్యం వీరభోజ్యం” అనేది రాచరిక కాలం నుండి బహుళ ప్రాచుర్యం పొందిన  ఓ ఆర్యోక్తి. ఇందులో ఓ ధర్మ సూక్ష్మం ఇమిడి ఉంది. వీరులకే రాజ్యం దక్కుతుందనే అర్దంలో ఈ సామెతను Rating: 0
scroll to top