Friday , 21 September 2018

Home » Slider News » చారిత్రక మహోద్యమం చంపారన్ సత్యాగ్రహం

చారిత్రక మహోద్యమం చంపారన్ సత్యాగ్రహం

August 22, 2017 9:48 am by: Category: Slider News, ఫోకస్ Comments Off on చారిత్రక మహోద్యమం చంపారన్ సత్యాగ్రహం A+ / A-

పుస్తక సమీక్ష

farmers strugles100 సంవత్సరాల కిందట రైతుల స్థితి గతులు ఎలా ఉన్నాయో .. నేడు ఎలా ఉన్నాయో , వారి జీవితాలలో ఏమైనా మారుపు ఉందొ లేదో … స్వపాలకులు రైతుల పక్షపాతులం అని చెప్పే మాటలు ఎంత నిజమో ! మనం, “చారిత్రక మహోద్యమం చంపారన్ సత్యాగ్రహం -(100 సంవత్సరాల చంపారన్ ఉద్యమ విశ్లేషణా వ్యాసాలు)”- చదువుతే ఇట్టే తెలిసిపోతుంది. రైతు ఉద్యమాలను ఎలా నిర్మించవచ్చో కూడా చంపారన్ ఉద్యమ విశ్లేషణా వ్యాసాలు ఓ స్ఫూర్తి గా పనికి వస్తాయి అని నేను గట్టిగా చెప్పగలను. ఈ వ్యాసాలకు మూలం తుషార్ గాంధీ, ఇర్ఫాన్ హబీబ్ మరియు ఆచార్య జె. బి. కృపాలనీ లు. స్వేచ్చానువాదం గౌరవ్. వీటిని సంకలనం రూపం లో తీసుక వచ్చి రైతు ఉద్యమాలలో పనిచేస్తున్న ఉద్యమకారులకు అందించేటందుకు పి. జనార్దన్ రెడ్డి (మాజీ శాసన సభ్యులు) మరియు రావెల సోమయ్య లు కృషి చేసారు.
సంకలన కర్తల “మా మాట” ను చదువుతే మహాత్మా గాంధీ ని వ్యతిరేకించే వారిలో పునరాలోచన కలుగకమానదు. సంకలన కర్తల మాటలలో “దిక్కులేని అన్నదాతలు వారి గోడు వినేనాథుడే కనబడక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. యాంత్రికమైన స్థబ్దతనే నాగరికతగా భ్రమిస్తోన్న నేటి యువతరానికి మానవీయ స్పృహ తో కూడిన ఒక నిరసన అవసరమని తెలపడమే మా ఉద్దేశం” .. ఈ పదాలు చదువుతే ఒక్క సారి హృదయం ఆగిపోయి మళ్ళీ కొట్టుకునే పరిస్థితి పాఠకులకు కలుగుతుంది. నెత్తి పై ఓ మొట్టికాయ వేసి బాధ్యతను గుర్తుచేస్తున్నట్లు పాఠకులకు అనిపిస్తుంది. సంకలన కర్తల మనసులలో ఎంత ఆవేదన ఉందొ పై వాక్యాలు చెపుతాయి. పి. జనార్దన్ రెడ్డి (మాజీ శాసన సభ్యులు) వయసు 80, రావెల సోమయ్య వయసు 75, అయినప్పటికీ ఎంతో విలువైన వ్యాసాలను సంకలనం రూపం లో తీసుక వచ్చుటకు వారి వయసు అడ్డుచెప్పలేదు. కానీ తపన వారిలో కనిపిస్తుంది.
ముందు మాట రాసిన డా. ఎ. బి . కె. ప్రసాద్ .. రైతు సత్యాగ్రహ పోరాటాలు శత సంవత్సర సంరంభం అన్నారు . నీలి మందు రైతుల దుస్థితి కి వ్యతిరేకంగా గాంధీ సత్యాగ్రహ ఉద్యమం బీహార్ సరిహద్దులు దాటి యావత్ భారతాన్ని కదిలించిన విషయం చాలా స్పష్టంగా రాసారు. ముందు మాట లో మనకు నేటి రాజకీయ పరిస్థితులను డా. ఎ. బి . కె. ప్రసాద్ చెప్పకనే చెపుతారు. నాడు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పరాయి పాలకుల దోపిడీ వల్ల రైతాంగం కునారిల్లి పోగా … నేడు అవే ప్రజా వ్యతిరేక వలస పాలన చట్టాలు కొనసాగడం వల్ల రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తి పని వార్ల అగచాట్లు పెరిగిపోతున్నాయి అని పాలకులకు ఒక హెచ్చరిక చేసారు. ఇంకో అడుగు ముందుకు వేసి ” విభిన్న జాతులు , మతాలు, సంప్రదాయాలు, భిన్న సంస్కృతులతో కూడివున్న భారతదేశాన్ని లౌకిక స్ఫూర్తి తో సదా నిలపడానికి గాంధి చేసిన సత్యాగ్రహ ప్రయోగం భిన్న రాజకీయ పక్షాలు, విభిన్న పార్టీల నాయకులకు అంతే విభిన్న కోణాల నుంచి భిన్నంగా తోచవచ్చు” అని కుండలు బద్దలు కొట్టి చెప్పారు. “ముందు మాట” వ్యాసాల చదువరులకు ఓ దారి చూపుతుంది.
ఇందులో మొత్తం 6 వ్యాసాలు. ఒక్కో వ్యాసం, నేటి ఉద్యమకారులకు గాంధేయ వాదం లో ప్రజలను ఎలా ఉద్యమాలలోకి తీసుక రావచ్చో ఓ క్లారిటీ ఇస్తాయి. ప్రభుత్వాలు ప్రజల పట్ల తమ బాధ్యతలను మరచి పోతే ఎలా గుర్తు చేయవచ్చో ఈ వ్యాసాలు ఉద్యమకారులకు ఒక మార్గం అవుతాయి. గాంధీ, ఆర్ ఎస్ ఎస్ కి హిందూ ద్రోహి గాను, ముస్లీమ్ లీగ్ కు ముస్లీమ్ ద్రోహి గాను, కమ్యూనిస్టులకు బూర్జువాగాను, అంబేద్కరిస్టుల దృష్టిలో బనియా గాను, కాంగ్రెస్ కు కడుపు మంటగాను, సోషలిస్టులకు స్వోత్కర్ష గాను భావిస్తారని “అణచివేతపై అన్నదాతల చెర్నాకోల చంపారన్ సత్యాగ్రహం ” గౌరవ్ రాసిన వ్యాసం లో, ఎవరి మొఖాల పై వారే ఎలా రాసుకున్నారో కదా ! అని పాఠకులకు ఆ వ్యాసం చదువుతే అనిపిస్తుంది. అప్పుడూ స్త్రీల విద్యకోసం ప్రచారం చేసారు. 100 సంవత్సరాల తరువాత కూడా స్త్రీల విద్యపై ప్రచారం చేయవలసిన పరిస్థితే !
ఇదే వ్యాసం లో గౌరవ్, చంపారన్ సత్యాగ్రహం గురించి .. ఇది ఒక నూతన తరహా ఉద్యమ రూపానికి ఆరంభ స్వరూపం. ప్రపంచ దేశాలలో హింసాత్మక రూపాల్లో వెల్లువెత్తుతున్న తిరుగుబాట్లకు విరుద్ధంగా అద్వితీయ రీతిలో ఆధునిక భారతదేశంతో మొట్టమొదటిసారి రైతు ఉద్యమాన్ని నిర్మాణాత్మకంగా సుస్థిర రూపంలో ఎలా కొనసాగించి, ఎలా విజయం సాధించారో మనకు ఈ వ్యాసాలలో కనిపిస్తుంది. పరిశ్రమల పేరుతో పంట భూములను నాశనం చేసుకుంటూ, అభివృద్ధి అనుకుంటూ వినాశనాన్ని కొని తెచ్చుకుంటున్న విషయాన్ని గాంధీ ఎలా గుర్తించాడో, పరిష్కార ప్రయత్నాలు ఎలా చేసాడో మనకు ఈ వ్యాసాలలో తెలుస్తుంది. ఇప్పుడు మనం నర్మదా బచావో, జల్ జంగల్ జమీన్ నినాదాలు అదే కోవకు చెందినవే. ఈ వ్యాసం ను పాఠకులకు చదువుతూ పోతే ” మర్క్స్ , ఏంగిల్స్ , లెనిన్ , స్టాలిన్ , మావో , అంబెడ్కర్ , రాయ్ , లోహియా , పెరియార్, పూలె, అందరూ జీవితాంతం మారుతూనే వచ్చారు, వారి మానసిక పరిణామం ప్రగతిశీలమయితే .. ఒక్క గాంధీ పరిణామం మాత్రం తిరోగమనం ఎందుకయ్యింది? అని వ్యాస కర్త ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నలో చిరు కోపం, ఓ లాంటి ధిక్కార స్వరం పాఠకులు గమనించక పోరు. ఈ వ్యాస కర్త ఇంకా ఒకడుగు ముందుకు వేసి లౌకిక వదులుగా వుంది మతస్థులైన నాయకుల్ని అంతా మనకోసమే చేసారని సమర్ధించుకుంటాము , కానీ సామాన్య మతస్తుడిగా మొదలై గాంధీ లౌకిక వాదిగా మరీనా పరిణామాన్ని ఎందుకు అర్ధం చేసుకోవడం లో విఫలమౌతున్నాం అంటూ … ఫాసిజాన్ని సమర్ధించినా తప్పులేదు కానీ గాంధీని క్షమించడం అంత నేరం మరోటి లేదనే వాతావరం ను ప్రగతిశీల వాదులు సృష్టించారు.. అని తల ఎగిరేసి చెపుతున్నట్లు పాఠకుల మనసుకు హత్తుకుంటది. గౌరవ్ హృదయం నుండి, చెమ్మగిల్లిన కనులతో రాసాడా ఇది అనేంతగా .. ఈ పదాలు వ్యాసం కు చివరిలో అంటాడు .. “దేశం లో అన్ని ప్రాంతాల అన్నదాతలు అసహాయంగా ఆత్మహత్యలకి పాల్పడుతూ , దినకూలీలుగా , వాచ్మెన్ లుగా వలసపోతూ మానసికంగా శవాలై పోయి, ముద్దపెట్టి ఆదరించిన వ్యవస్థ చేతనే దిక్కుమాలిన వాళ్ళుగా చూడబడుతూ, వ్యవసాయం అంటేనే పనికిమాలిన పనిగా చూస్తున్న ప్రస్తుత పరిస్థితులలో , దేశ చరిత్రలో తొలిసారిగా తమ వీపులపై స్వారీ చేస్తూ , తమ చెమటని రక్తాన్ని జుర్రుకుంటూ వికటహాసం చేస్తున్న దోపిడీదారులకు ఎదురు నిల్చి వారి దురాగతాలకు చరమ గీతం పడేలా చెర్నాకోల విదిలించిన రైతు విప్లవ శంఖారావమైన చంపారన్ సత్యాగ్రహం .. ఈ తరం లో కొద్దిమందైన గ్రహించి వాదవివాదాలకతీతంగా నా దేశపు రైతు పక్షాన ప్రశ్నించి నిలవడానికి నిర్ణయించుకుంటే .. ఈ వ్యాసాల సంకలనాల ప్రయత్నానికి ప్రయోజనం”.
రెండవ వ్యాసం తుషార్ గాంధీ రాసిన “చంపారన్ సత్యాగ్రహం 100 సంవత్సరాల రైతుల యధాతథ స్థితి” లో నీలిమందు రైతుల స్థితి 100 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో .. ఈనాడు రైతులందరి పరిస్థితి ఆధునిక భారత దేశంలో అలానే ఉంది అనే దానికి కళ్ళకు కట్టి చూపించింది. ఇంకో వ్యాసం ఇర్ఫాన్ హబీబ్ రాసిన “చారిత్రక మహోద్యమం – చంపారన్ సత్యేగ్రహం ” లో ఆనాడు నీలిమందు తోటలను పండించే రైతుల దీనగాథ ఎలాంటి దో మనం ఇందులో చూడవచ్చు. ప్రభుత్వం, రైతుల పంటలకు ధర లను ఎలా నిర్ణయిస్తుందో ఉదాహారణలతో సహా పాఠకులకు సులభంగా అర్దమయ్యేటట్లు రచయిత రాసారు. ఇక్కడ మనం అంటే పాఠకులు గమనించాలిసింది వ్యాస కర్త ఇర్ఫాన్ హబీబ్ మార్క్సిస్టు మరియు గాంధీని వ్యతిరేకించే వారిలో ఒకరు, అయినప్పటికిని చంపారన్ రైతుల హక్కులను కాపాడెకోసం గాంధీ చేసిన సత్యాగ్రహం గురించి రాసిన ఒక్కోపదం ను చదువుతూ పోతే … నిజమేనా .. గాంధీ వ్యతిరేకుల్లో ఒకరునా?! అనే అనుమానం పాఠకులకు వస్తుంది. ఆనాడు వ్యవసాయ చట్టం తీసుక వచ్చేటట్లు ప్రభుత్వం పై గాంధీ ఎలా ఒత్తిడి పెట్టాడో పాఠకుల కళ్ళముందు వ్యాస కర్త సజీవంగా చూపించాడు. మరో వ్యాసం “మొట్టమొదటి సత్యాగ్రహం ” ఆచార్య జె. బి. కృపాలనీ రాసిన దానిలో గాంధీ ని నేపాల్ దేశం సరిహద్దులకు దగ్గెర గా బీహార్ రాష్ట్రము లో వున్నా చంపారన్ జిల్లాకు ఎలా తీసుక వెళ్లారో, గాంధీ ప్రభుత్వ నిర్బంధాన్ని ఎలా ఎదుర్కొన్నాడో , రైతుల మనసులలో స్థానం ను గాంధీ ఎలా సంపాయించుకున్నాడో, ఇప్పుడు జరుగుతున్నదా అనే భ్రమ పాఠకులకు కలుగుతుంది. ఈ వ్యాసాలలో మహాత్మా గాంధీ రాసిన “నీలిమందు మచ్చ ” చూడవచ్చు. గాంధీ చంపారన్ కు వెళ్ళేటందుకు కారకుడైన రైతు రాజకుమార్ శుక్లా, శుక్లా గురించి ఎలా ఆలోచించాడో వివరంగా పాఠకులకు ఈ వ్యాసం లో కనిపిస్తుంది. నేటికీ అలాంటి రైతులే ఉద్యమకారులకు కనిపిస్తారు. ఇందులో అనుమానమే లేదు. పేజీ 43 నుండి 61 వ పేజీ వరకు గాంధీ మాటలలో చంపారన్ రైతు ఉద్యమాన్ని, స్కూళ్ల ఏర్పాటు , వైద్యం – ఆరోగ్యం, ఆడవాళ్ళ పరిస్థితి , సమస్యలు వినవచ్చు. ఇప్పటికీ మహిళల పరిస్థితి అలానే ఉంది అని నేను చెప్పటం ఏమి అతిశయోక్తి కాదు అంటాను. చివరిది, “చంపారన్ ను స్మరించుకోవడం గాంధీని స్మరించుకోవడమే” సుధీర్ చంద్ర రాసారు. వ్యాసాలు చదవటం అయిపోతున్న క్రమం లో , స్మరించుకోవడం ఒక్కటే కాదు, గాంధీ పై ఉన్న వ్యతిరేక అభిప్రాయాలూ, చర్చించుకునే అంశాలుగా మారుతాయని నేనంటాను.
ఈ పుస్తక ముఖ చిత్రం చూపరులను ఆకర్శించేటట్లుంది. ముఖ చిత్రం లోపల, చివర పెట్టిన కొటేషన్స్ గాంధీ అంటే ఏంటో అర్ధం చేపిస్తాయి. ఈ వ్యాసాలు నేడు, ముందుతరాల ఉద్యమాల నిర్మాణం లో మార్గం చూపిస్తాయి అని చెప్పేటందుకు నాకెలాంటి సందేహం లేదు. ఈ పుస్తకం తేది:14-08-2017 న తెలంగాణ రాష్ట్రం హోమ్ మినిష్టర్ నాయిని నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా మార్కెట్ లోకి వచ్చింది. అందరూ చదవవలసిన వ్యాసాల పుస్తకం.
పుస్తకం ధర : 30/- రూపాయలు, ప్రతులకు హైదరాబాద్ రైటర్స్ , ప్రింటర్స్, పబ్లిషర్స్ కో ఆపరేటివ్ సొసైటీ, డో. నెం. 1-2-597/26ఎ, దోమలగూడ, హైదరాబాద్ -500029, సెల్: 9290814360, 8121898440.
సమీక్షకులు……. జయ వింధ్యాల, లాయర్ & రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , పౌరహక్కుల ప్రజా సంఘం, తెలంగాణ రాష్ట్రం
మొబైల్ : 9440430263

చారిత్రక మహోద్యమం చంపారన్ సత్యాగ్రహం Reviewed by on . పుస్తక సమీక్ష 100 సంవత్సరాల కిందట రైతుల స్థితి గతులు ఎలా ఉన్నాయో .. నేడు ఎలా ఉన్నాయో , వారి జీవితాలలో ఏమైనా మారుపు ఉందొ లేదో ... స్వపాలకులు రైతుల పక్షపాతులం అని పుస్తక సమీక్ష 100 సంవత్సరాల కిందట రైతుల స్థితి గతులు ఎలా ఉన్నాయో .. నేడు ఎలా ఉన్నాయో , వారి జీవితాలలో ఏమైనా మారుపు ఉందొ లేదో ... స్వపాలకులు రైతుల పక్షపాతులం అని Rating: 0

Related Posts

scroll to top