Monday , 20 May 2019

Home » Slider News » గందరగోళ సర్వేలు….గడబిడ ఫలితాలు…. ఫ్రశ్నార్దక  మైన విశ్వస నీయత

గందరగోళ సర్వేలు….గడబిడ ఫలితాలు…. ఫ్రశ్నార్దక  మైన విశ్వస నీయత

December 9, 2018 6:00 pm by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Comments Off on గందరగోళ సర్వేలు….గడబిడ ఫలితాలు…. ఫ్రశ్నార్దక  మైన విశ్వస నీయత A+ / A-

theen murthyపోలింగ్ ముగిసి  ఓటర్ల నిర్ణయం ఇవిఎం లలో భద్రమైంది. డిసెంబర్ 11 వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుకు ఇంకా  గడువు ఉండడంతో ఫలితాలపై చర్చోప చర్చలు సాగుతున్నాయి. ఈ సారి  ఆ చర్చలన్ని సర్వేల చుట్టూ సాగుతున్నాయి.  కారణం తెలియదు కాని అనేక సర్వే సంస్థలు తెలంగాణ ఎన్నికలపై అమితాసక్తి చూపాయి. ఏ సర్వే సంస్థను నమ్మాలో ఏ సంస్థ ఫలితాలు వాస్తవమో అంతా గందరగోళం. ఏ ప్రజా ప్రయోజనాల కోసం ఈ సంస్థలు సర్వే చేశాయో తెలియదు. ఆయా సంస్థలు స్వయంగా తమ స్వంత ఖర్చు వెచ్చించి సర్వే చేశాయా లేక ఎవరికైనా అమ్ముడు పోయాయా అనేది కూడ తెలియదు. సర్వేలన్ని గుప్తంగా చీకటి ఒప్పందాలతో జరిగి పోయినట్లు అవి ప్రకటించిన ఫలితాలు చూస్తే అర్దం అవుతోంది.

ఎన్నికల సర్వేలు జరిపిన వాటిలో ఇండిపెండెంట్ సంస్థలతో పాటు ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు కూడ చాలా ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి కనుక పరిస్థితులు అంచనా వేసేందుకు బహుశా ఈ సంస్థలు ఉత్సాహం చూపి ఉండ వచ్చు. లేదా పెయిడ్ న్యూస్ లెక్కనే సర్వే సంస్థలు రాజకీయ పార్టీల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొంది అనుకూలంగా ఉండే విదంగా సర్వేలు తయారు చేసి ఇచ్చి ఉండవవచ్చనే విమర్శలు కూడ ఉన్నాయి.

సర్వేలలో  అనేక విధాల  సర్వేలు ఉన్నాయి. ప్రిపోల్, సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలు అనేవి సంస్థలు దశల వారీగా  నిర్వహిస్తుంటాయి. ఎవరు గెలస్తారో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి రాబోతోందో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ముందుగానే తెల్సుకో వాలనుకునే ఉత్సుకత అందరిలో ఉంటుంది. ఆయా పార్టీల నాయకత్వం కూడ ఇలాంటి సర్వేలు చేయించి ఏవైనా లోపాలు ఉండి ఉంటే సరి చేసుకునేందుకు వీలుంటదని సర్వేలు చేయిస్తారు.

తెలంగాణ రాష్ర్టంలో రెండేళ్ళ క్రితం నుండే తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత  కెసిఆర్ నోటి వెంట పలుమార్లు ఈ సర్వేల మాట విన్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిగిన పార్టి  సమావేశాలలో కెసిఆర్ తన వద్ద సర్వే రిపోర్టులు బోలెడు మీ చిట్టా అంతా  ఉందని హెచ్చరించే వారు. అసెంబ్లిరద్దు చేసిన అనంతరం అంతకు ముందు కూడ కెసిఆర్ అనేక సర్వేలు జరిపించినట్లు ఆయన మాటల్లోనే స్వయంగా వెల్లడించారు. అన్ని సర్వేలలో కూడ తమకు బ్రహ్మాండంగా ఉందని  119 స్థానాలకు నూట పది గెలవ బోతున్నామని కెసిఆర్  ఆయన తనయుడు కెటిఆర్ పలు సందర్భాల్లో చెప్పుకున్నారు.

సర్వేల ఫలితాల మేరకే కెసిఆర్ అసెంబ్లి రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాడనే విషయం ఆయన నోటి నుండి వెలు వడిన వివరాల మేరకు అర్దం అవుతుంది. మొదటి నుండి ఈ సర్వేలు  వెల్లడించిన ఫలితాలు అధికార టిఆర్ఎస్ కు బాగా అనుకూలంగా ఉన్నాయి. ప్రిపోల్ ఫలితాలు టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయని చెప్పిన సంస్థలు  పోలింగ్ ముగిసిన రోజు క్షణం ఆలస్యం చేయుకండా వెంటనే ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు వెల్లడించాయి. అన్నింట్లో కూడ టిఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందని మాజిక్ ఫిగర్ మించిన మెజార్టి వస్తుందని వెల్లడించాయి.

టైమ్స్ నౌ- సిఎన్ ఎక్స్, ఇండియా టుడే, రిపబ్లిక్ టివి- జన్ కి బాత్, న్యూస్ నేషన్, టివి 9, టివి 5 సంస్థలు ఉన్నాయి.

దాదాపు జాతీయ సంస్థల ఫలితాలు అన్ని ఒకే విదంగా ఉండగా అందుకు భిన్నంగా ఆశ్చర్య కరమైన రీతిలో  ఆంధ్ర ఆక్టోపస్ గా పేరు స్థిర పడి పోయిన  లగడ పాటి కూడ ఆయన సర్వే ఫలితాలు వెల్లడించారు. టిఆర్ఎస్ అధికారం కోల్పోతోందని ప్రజా కూటమి అధికారం లోకి రాబోతోందని చెప్పటంతో సర్వే ఫలితాలపై సర్వత్రా దుమారం రేగింది.

టివి సంస్థల్లో అయితే విరామం లేకుండా చర్చలు జరిగాయి. రాష్ర్ట విభజనను వ్యతిరేకిస్తూ  చివరి వరకు ఆంధ్ర ప్రాంత నేత లగడ పాటిరాజగోపాల్ ప్రయత్నాలు చేసి ఉండవచ్చు కాని ఆయన సర్వే చాలా సార్లు మంచి ఫలితాలు ఇచ్చిందనే వాదనలు ఉన్నాయి. జాతీయ మీడియా సంస్థలు దక్షిణాధి ప్రాంతంలో సరైన అంచనా వేయలేవని ఇక్కడి ప్రజల నాడిని పసి గట్టలేవని లగడ పాటి సర్వే ఫలితాల వెల్లడి సందర్బంగా చెప్పుకొచ్చారు.

లగడ పాటి చెప్పిన దాంట్లో నిజం లేకపోదు. గతంలో ఢిల్లీ  ఎన్నికల సందర్భంగాను ఆ తర్వాత జరిగిన వివిద రాష్ర్టాల ఎన్నికల సందర్భంగా సర్వే సంస్థల అంచనాలు లెక్క తప్పాయి.

తమిళనాడు,కర్నాటక రాష్ర్టాల ఎన్నికల ఫలితాలలో కూడ అంచనా తప్పాయి. ఏ సంస్థ అంచనా అయినా కొన్ని సందర్భాలలో ఫలించ వచ్చు లేక ఫలించక పోవచ్చు . సర్వేలు పూర్తిగ రాండమ్ సర్వేలు కాబోవు. కేవలం సాంపిల్ గా ఓ కొద్ది మందిని ఎంపిక చేసుకుని చేసే సర్వేలు మాత్రమే. వీటికి ఎంత మాత్రం శాస్ర్తీయత అనేది  లేనే లేదు. ఏ పద్దతిలో సర్వే జరిపారో సంస్థలు వెల్లడించవు. ఏ విధానాలు పాటించారో చెప్పరు. ఎంత మందిని సంప్రదించారో  చెప్ప కుండా గోప్యంగా ఉంచుతారు. పూర్తిగా పారదర్శకత లోపించిన సర్వేలను జనాలపైకి వదిలి చర్చలకు ఊదర గొడుతుంటారు. అసలు ఈ సర్వే సంస్థలకు ఓ అడ్రస్ అంటూ ఉందా …ఆ సంస్థలు చేసేపని ఏమిటి…… బాక్ ట్రాక్ ఏమిటి….వాటికున్న విశ్వస నీయత ఎంత అనే విషయాలు కూడ అర్దం కావు. ఎన్నికలనగానే సర్వే సంస్థల ఫలితాలు ఓ దానివెంట ఓటి వస్తుంటాయి. సర్వేలపై ఎన్నికల కమీన్ నిషేదం ఉన్నా ఏదో ఓ రూపంలో వాటిని లీక్ చేయడం లేదా ఇప్పుడు అందు బాటులోకి వచ్చిన సోషల్ మీడియాలో జొప్పించడం చేస్తున్నారు.

ఇలాంటి సర్వేలు ప్రజా స్వామ్యానికి తీవ్ర విఘాతమైనవని తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొపెసర్ నాగేశ్వర్ రావు చర్చల సందర్భంగా  పేర్కొన్నారు.  ఓటర్లను  ఏ రకంగా ప్రబావితం చేసే సర్వేలు అయినా  చాలా ప్రమాదకర మైనవని పేర్కొన్నారు. తెలంగాణ లో పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ ఫోల్ ఫలితాల అనంతరం ప్రముఖులు అనేక మంది అనేక విధాలుగా  సర్వేలపై తమ అభిప్రాయాలు చెప్పారు.

ఎన్నికల కమీషన్ కు చిక్కకుండా సర్వే సంస్థలు వోటర్లను ప్రభావితం చేసే రీతిలో ఫలితాలు వెల్లడిస్తున్నాయనే విమర్శలు వచ్చాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అనేక విధానాలు ఎన్నికల్లో అమలు చేస్తున్నపార్టీలు ఈ సంస్థలను ఎన్నికల సమయంలో  తమకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసే విదంగా వ్యూహాలు పన్నుతున్నాయి.  సర్వేల పేరిట ఓటర్లను  మాయ చేసే సంస్థలకు అవకాశం లేకుండా పూర్తిగా నిషేదించాల్సిన అవసరం ప్రజాస్వామ్యానికి ఎంతో శ్రేయస్కరం.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ప్కడ్బందీగా జరిగేందుకు ఇంకా అనేక  సంస్కరణలు రూపొందించి ఆమలు జరగాల్సిన అవసరం ఉంది.

కూన మహేందర్

జర్నలిస్ట్        

ప్రజాతంత్ర దిన పత్రిక 09-12-2018

గందరగోళ సర్వేలు….గడబిడ ఫలితాలు…. ఫ్రశ్నార్దక  మైన విశ్వస నీయత Reviewed by on . పోలింగ్ ముగిసి  ఓటర్ల నిర్ణయం ఇవిఎం లలో భద్రమైంది. డిసెంబర్ 11 వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుకు ఇంకా  గడువు ఉండడంతో ఫలితాలపై చర్చోప చర్చలు సాగుతున్నాయి. ఈ సారి  ఆ పోలింగ్ ముగిసి  ఓటర్ల నిర్ణయం ఇవిఎం లలో భద్రమైంది. డిసెంబర్ 11 వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుకు ఇంకా  గడువు ఉండడంతో ఫలితాలపై చర్చోప చర్చలు సాగుతున్నాయి. ఈ సారి  ఆ Rating: 0
scroll to top