Friday , 19 July 2019

Home » Slider News »    కారు…… సారు……. పదిలమేనా ?

   కారు…… సారు……. పదిలమేనా ?

December 7, 2018 6:01 pm by: Category: Slider News, ఫోకస్ Comments Off on    కారు…… సారు……. పదిలమేనా ? A+ / A-

  టిఆర్ఎస్ వోటు బాంకు ఎంత ? బహుముఖ పోటీలో మిగిలే బాలెన్సు ఎంత ?

టిఆర్ఎస్ లెక్క తేల్చనున్న 2018 ఎన్నికలు

 

 

kcr and his car storyరాజకీయ పార్టీల పరపతిని వోటు బాంకు లెక్కలు చూసి అంచనా వేయవచ్చు. జాతీయ పార్టీ అయిన, ప్రాంతీయ పార్టీ అయిన  గుర్తింపు పొందిన  ప్రతి పార్టీకి  ఎంతో కొంత ఓటు బాంకు  ఉంటుంది. ఎన్నికల సమయంలో ఏ పార్టీకి ఎంత వోటు బాంకు ఉందో గత ఎన్నికల సమయంలో ఎన్ని వోట్లు ఎంత శాతం మేరకు పోలయ్యాయనే లెక్కలు తీసి బలా బలాల అంచనా వేస్తుంటారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం సాధించే ఏకైక లక్ష్యంతో ఏర్పాటైన  తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీకి ఇప్పటి వరకు నిర్ధిష్టమైన వోటు బాంకు లేదు. కాంగ్రేస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలకు అట్లాగే ఉభయ కమ్యునిస్టు పార్టీలకు ఓ నిర్ధిష్టమైన వోటు బాంకు ఉంది. ఎవరు చెప్పినా చెప్పక పోయినా వోటర్లు గుర్తు తెల్సుకుని మరి వోటు వేస్తుంటారు. దేశంలో 2004 నుండి 2014 వరకు వరుసగా రెండు సార్లు కేంద్రంలో యుపిఏ వన్, యుపిఏ టు కు సారధ్యం వహించిన కాంగ్రేస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 లోక్ సభ సాధారణ ఎన్నికల్లో  33 రాష్ర్టాలలో 400 సీట్లకు కాంగ్రేస్ పార్టి పోటి చేయగా 145 లోక్ సభ సీట్లలో గెలిచింది. భారతీయ జనతా పార్టి 31 రాష్ర్టాలలో 364 స్థానాలలో పోటి చేయగా 130 స్థానాలు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీకి 34.43% వోట్లు బిజెపికి 34.39% శాతం వోట్లు వచ్చాయి.  రెండు జాతీయ పార్టీలకు కేవలం స్వల్ప తేడాతో వోట్లు పోలయ్యాయి. కాని కాంగ్రేస్ పార్టి యుపిఏ భాగస్వామ్య పక్షాలతో కల్సి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

2009 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టి 33 రాష్ర్టాలలో 400 సీట్లకు పోటి చేయగా 206 స్థానాలలో గెలిచి 37 శాతం వోట్లు సంపాదించింది. భిజెపి 116 స్థానాలలో గెలిచి 21.36 శాతం వోట్లు సాధించింది. 2014 ఎన్నికల్లో  కాంగ్రేస్ పార్టీ ఘోర పరాజయంతో యుపిఏ అధికారం కోల్పోయింది. కాంగ్రేస్ పార్టీ కేవలం 44 స్థానాలలో  మాత్రమే గెలిచింది. ఆ పార్టీ వోటు బాంకు 19.3 శాతానికి పడి పోయింది. అధికారంలోకి వచ్చిన బిజెపి 286 స్థానాల భారి మెజార్టీతో అఖండ విజయం సాధించి 31 శాతం వోట్లు స్వంతం చేసుకుంది.

ఉమ్మడి రాష్ర్టంలో తెలంగాణ రాష్ర్ట సమితి పార్టి వోట్ల శాతం 2004 సాధారణ ఎన్నికల నుండి తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన అనంతరం జరిగిన 2014  తొలి ఎన్నికల వరకు పరిశీలిస్తే గణనీయంగా పెరిగింది.  ఇతర పార్టీలకు ఉన్న రీతిలో ఈ పార్టీకి పర్మనెంట్ వోటు బాంకు లేదు. తెలంగాణ కావాలనుకున్న ప్రతి ఒక్కరు ఈ పార్టీకి వోటు బాంకుగా మారారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ వాదులు తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీని ఆదరించారు. 2004 లో కాంగ్రేస్ పార్టీతో  పొత్తు పెట్టుకున్న తెరాస  54 స్థానాలకు పోటి చేసి 26 స్థానాలలో గెలిచింది. అప్పట్లో  ఆ పార్టీకి దక్కిన  వోట్ల శాతం  కేవలం 6.68% మాత్రమే. 2009 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో తెరాస తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకుని 45 స్థానాలకు పోటి చేసి కేవలం 10 స్థానాలలో మాత్రమే గెలిచి 3.99% శాతం వోట్లు స్వంతం చేసుకుంది.

తెలంగాణ సాదన కోసం తెరాస అధినేత కెసిఆర్ పలు మార్లు పదవులకు రాజీనామాలు చేసి మద్యంతరంగా ఎన్నికలకు పోయి  గెలిచిన సందర్భాలలో భారి మెజార్టి స్వంతం చేసుకున్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ర్టంలో ప్రభుత్వ బాగస్వామ్యం నుండి బయటికి వచ్చి మద్యంతర ఎన్నికలకు వెళ్ళింది.  వై.ఎస్ హయాంలో ఆయన ఆపరేషన్ ఆకర్ష్ కారణంగా 10 మంది తెరాస ఎమ్మెల్యేలు తెరాసను వదిలి కాంగ్రేస్ పార్టీలో కొనసాగారు. 2008 లో తెరాస ఎమ్మెల్యేలు 16 మంది పదవులకు రాజీనామాలు చేసి మద్యంతర ఎన్నికల్లో పోటి చేయగా ఐదు స్థానాల్లో ఓడి 7 స్థానాల్లో గెలిచారు.

2014 సంవత్సరంలో  తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన అనంతరం జరిగిన ఎన్నికల్లో  తెరాస ఒంటరిగా 119 స్థానాలకు పోటి చేసి  63 స్థానాలు గెలిచింది. తెరాసకు మొత్తం పోలయిన  వోట్లు 6619129 అంటే 33.83 శాతం స్వంతం చేసుకుంది. కాంగ్రేస్ పార్టీకి .4857332 వోట్లతో 24.8 శాతం, తెలుగుదేశం పార్టీకి 2792891 వోట్లతో 14.27 శాతం వోట్లు వచ్చా.యి. టిఆర్ఎస్ పార్టి వోట్ల శాతం 2009 సంవత్సరం పోలైన వోట్లతో పోల్చితే  ఏకంగా 53 శాతం పెరిగాయి.

2004 సంవత్సరం నుండి 2014 వరకు జరిగిన ప్రతి ఎన్నికలు ఆ ఎన్నికలకు మద్యలో పార్లమెంట్, అసెంబ్లి స్థానాలకు జరిగిన మద్యంతరం ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ సమాజం యావత్తు అండగా నిలిచింది. తెలంగాణ కోరుకున్న మేధావులు, విద్యాధికులు, ఉద్యోగులు మొదలు సామాన్య జనం వరకు అందరూ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ కోసం తెరాసను బలపరుస్తూ కారు గుర్తుకు వోట్లు వేశారు. 2014 లో తెలంగాణ  సాదించిన విజయ గర్వంతో మెజార్టి ప్రజలు కెసిఆర్ కు బేషరుతుగా మద్దతు ఇచ్చి గెలిపించారు. ఇతర పార్టీలకు చెందిన వారు కూడ అనేక మంది కెసిఆర్ పైన అబిమానంతో ఆయన పార్టీని ఆదరించారు.  మన  రాష్ర్టం ఏర్పడబోతోందని ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి కెసిఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ర్టం బాగుపడాలని ఆశించి వోట్లు వేసారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చినట్లు చెప్పుకున్న కాంగ్రేస్ పార్టీ  కేవలం 21 స్థానాలలో మాత్రమే  గెలిచింది.

2014 ఎన్నికల్లో అంతకు ముందు కెసిఆర్ తొడ కొట్టినప్పుడల్లా తెలంగాణ వాదులు మెడ కోసుకున్నారు.  ఉప ఎన్నికలలో పోటి చేసిన సందర్భాలలో తెలంగాణ ప్రజలు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా కేవలం తెలంగాణ కోసమే ముక్కు ముఖం తెలియని వారికి కూడ వోటు వేశారు. ఆయా ఎన్నికల్లో టిఆర్ఎస్ కు పోలైన వోట్లన్ని ఆ పార్టి వోటు బాంకు ఖాతాలో జమ కట్టలేం. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టి సిద్దాంతాలు కెసిఆర్ విధానాలు  నచ్చినా నచ్చక పోయినా  తెలంగాణ కోసం ఈ ఒక్క సారి అంటూ అన్ని వర్గాల వారు  వోట్లు వేశారు.  ఎర్ఎస్ఎస్ నుండి మొదలు ఆర్ఎస్ యు వరకు భావస్వారూప్యత లేక పోయినా తెలంగాణ కోసం ఒక్కటయ్యారు.

అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే మాత్రం తెరాస ఏటికి ఎదురీదుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి గడ్డు పరిస్థితులు కొట్టొచ్చి నట్లు కనిపిస్తున్నాయి.  తెలంగాణ రాష్ర్టంలో ఈ నాలుగున్నర ఏళ్ల పాలనలో కెసిఆర్ పాలన, రాష్ర్టంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు చేయలేని పనులు అన్ని స్వయంగా చూసిన తెలంగాణ వోటర్లు ఎవరికి వారు తమకు అనుభవంలోకి వచ్చిన అంచనాలతో ఉన్నారు. పాలన నచ్చిన వారితో పాటు  పాలన నచ్చని వారు తయారయ్యారు. కెసిఆర్ తెరాసను ఏర్పాటు చేసి 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా తెలంగాణ కోసం చేసిన పోరాటం ఆద్యంతం చూసిన వారు ఆయన నాయకత్వానికి ఆయన ప్రసంగాలకు ఫిదా అయి పోయిన తెలంగాణ జనం చాలా మంది ప్రస్తుతం సందిగ్దంలో ఉన్నారు.  తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ ఏం చేసినా అండగా నిలబడ్డ తెలంగాణ ఉద్యమ సమాజం ప్రస్తుతం ఏ గట్టున ఉందో తెలియని పరిస్థితి ఉంది.

ఎన్టీరామారావు తెలుగు దేశం పార్టి ఏర్పాటు చేసిన సమయంలో తెలంగాణ లో పీపుల్స్ వార్ (మావోయిస్టు) పార్టి కార్యకలాపాలు ఉధృతంగా ఉండేవి. పీపుల్స్ వార్ అనుభంద రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ఆదిపత్యంలో ఉండేది.  తెలుగు దేశం పార్టి ఏర్పాటు అనంతరం అనేక మంది రాడికల్ స్టూడెంట్ యూనియన్ నాయకులు ఆ పార్టీలో చేరారు. క్రమంగా పార్టీలో నాయకులుగా ఎదిగిన వారి ఉదాహరణలు చాలా ఉన్నాయి.

తెరాస ఏర్పాటు అనంతరం కూడ వామపక్ష తీవ్ర వాద భావజాలం కలిగిన వారు అనేక మంది ఆ పార్టీలో చేరి పోయి కెసిఆర్ కు సన్నిహితులయ్యారు. కెసిఆర్ ఓ అడుగు ముందుకేసి నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అని ప్రకటించుకున్నారు. ఆయన వెంట అందుకే జనశక్తిలో  పనిచేసిన వారు పీపుల్స్ వార్ లో పనిచేసిన వారు నడిచారు. వీరిలో కొందరు కెసిఆర్ విధానం నచ్చక మద్యలోనే  పార్టీని  వీడిపోగా  ఇంకా కొందరు ఇప్పటికి కెసిఆర్ కు అత్యంత సన్నిహితులుగా పార్టి కార్యక్రమాలు భుజాన వేసుకుని ఆయనకు నమ్మిన బంటుల్లాగా  పనిచేస్తున్నారు.

తెలాంగాణ సాదించే క్రమంలో కెసీఆర్ ఏం చేసినా నడిచింది కాని ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుత ఎన్నికలు తెలంగాణ రాష్ర్ట సమితి పార్టీకి ఆ పార్టి అధినేత కెసిఆర్ కు కీలకమైనవి. పార్టి పది కాలాల పాటు తెలంగాణ లో  నిలువ గలుగుతుందా… అధికారం నిలుపుకో గలుతుందా…. ఏకాకిగా బరిలో నిలిచిన పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది…ఎంత  శాతం మేరకు వోట్లు షేర్ చేస్తుందనే విషయాలు ఎన్నికల ఫలితాలతో తేల నున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి లభించే వోట్ల సరళిని బట్టి ఆ పార్టి తెలంగాణ లో వోటర్ల బలాన్ని ఏ మేరకు కూడగట్టుకుందనే లెక్కలు తేలనున్నాయి.

సాధారణ జనం సంగతి ఎట్లా ఉన్నా  తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన  మేధావులు, విద్యాధికులు, ప్రజా సంఘాలు, పౌరసంఘాలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు తెలంగాణ ఉద్యమ సమయంలో నచ్చినా నచ్చక పోయినా  కెసిఆర్ కు అండగా నిలబడినట్లు ప్రస్తుతం ఎన్నికల్లో ఎంత వరకు నిలుస్తారనేది ప్రశ్నార్దకం. వీరంతా ఎక్కువగా కెసిఆర్ విధానాలు నచ్చక అగ్రహంతో ఉన్నారు.

2014 ఎన్నికల్లో తెరాసకు  63 స్థానాల్లోవిజయం లభించినా ఆ తర్వాత “ఆపరేషన్  ఆకర్ష్” తో ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని అసెంబ్లి రద్దు నాటికి బలాన్ని 90 సీట్లకు  పెంచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో  119 సీట్లలో పోటీలో ఉంది. ఇందులో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్న హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో 7 స్థానాలలో మైత్రి పూర్వక పోటీలో ఉంది.

2014 ఎన్నికల వోట్లను విశ్లేషిస్తే తెరాస 63 స్థానాలలో గెలిచి 33.83 శాతం వోట్ల తో అధికారం లోకి వచ్చినా  ఆ పార్టీకి లబించిన వోట్లకంటే కాంగ్రేస్ పార్టీకి లబించిన 24.8 శాతం వోట్లు, తెలుగుదేశం పార్టీకి లభించిన 14.27 శాతం వోట్లు కూడగా వచ్చే వోట్ల శాతం ఎక్కువ. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో పాటు సిపిఐ, తెలంగాణ జన సమితి పార్టీలు కల్సి  మహా కూటమి కట్టి  బరిలో నిలిచి తెరాసకు ముచ్చెమటు పట్టిస్తున్నాయి..

 

కూన మహేందర్

సీనియర్ జర్నలిస్ట్

ప్రజాతంత్ర దిన పత్రిక 07-12-2016

   కారు…… సారు……. పదిలమేనా ? Reviewed by on .   టిఆర్ఎస్ వోటు బాంకు ఎంత ? బహుముఖ పోటీలో మిగిలే బాలెన్సు ఎంత ? టిఆర్ఎస్ లెక్క తేల్చనున్న 2018 ఎన్నికలు     రాజకీయ పార్టీల పరపతిని వోటు బాంకు లెక్కలు   టిఆర్ఎస్ వోటు బాంకు ఎంత ? బహుముఖ పోటీలో మిగిలే బాలెన్సు ఎంత ? టిఆర్ఎస్ లెక్క తేల్చనున్న 2018 ఎన్నికలు     రాజకీయ పార్టీల పరపతిని వోటు బాంకు లెక్కలు Rating: 0
scroll to top