Monday , 17 December 2018

Home » Slider News » ఒళ్ళు వంచింది లేదు….బట్టలు నలిగింది లేదు… కూలీ మాత్రం లక్షల్లో..

ఒళ్ళు వంచింది లేదు….బట్టలు నలిగింది లేదు… కూలీ మాత్రం లక్షల్లో..

April 19, 2017 11:22 pm by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Leave a comment A+ / A-

టిఆర్ఎస్ సభకు లక్షలకు లక్షలు……….

కెటిఆర్ ఐస్ క్రీమ్ బాగా కాస్ట్లి గురూ…….

ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీకి మహా అయితే రోజుకు మూడు వందలు లబించొచ్చు. అదే అడ్డా మీది కూలీ అయితే ఎక్కువలో ఎక్కువగా అయిదు వందల వరకు కూలీ డబ్బులు దొరుకొచ్చు. దానికి రోజంతా  చెమటోడిస్తే సాయంత్రం కూలి లభిస్తుంది. ఉదయం తొమ్మిది గంటలకు పనిలోకి ఎక్కితే, సాయంత్రం అయిదు గంటల వరకు నడుము వంచి పనిచేయాల్సిందే. అందునా ఎండాకాలమైతే ఇక వారి బాధ వర్ణనాతీతం. అన్ని పనులు నీడపట్టున ఉండవుకదా. ప్రచండ భానుడి తీక్షణ వీక్షణాలకు ఒళ్ళు వేడెక్కి, శరీరమంతా చెమటమయమై ఎర్రబడుతున్నా ఆ ఎండలో పనిచేస్తేగాని రాత్రికి బుక్కెడు బువ్వ దొరకదు. కాని, ఇదే సీజన్‌లో తెలంగాణలో విచిత్రమైన కూలీలు కనిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఈ కూలీలు క్షణాల్లో తమ పని ముగించుకుని లక్షలకు లక్షల సొమ్మును ఎంక్కా జేబులో పెట్టుకుని పోతుంటే అవురా అని ఆశ్చర్యపడుతున్నారు నిత్య దినసరి కూలీలు. ఈ కొత్త రకం కూలీలు వేసుకున్న చొక్కా నలిగేదిలేదు. చెమటోడ్చేదీ లేదు. పోనీ దినమంతా కష్టపడుతున్నారా అంటే అదీ లేదు. వీరెక్కడ కూలీ చేసినా పది నిమిషాలనుండి అరగంట లోపే. కాని, వారికి లభిస్తున్న కూలీ డబ్బులు మాత్రం ల క్షలు. అయితే కూలీల్లో వ్యత్యాసం ఉన్నట్లు వీళ్ళల్లోనూ కనిపిస్తోంది. బడా నాయకులు పోతే లక్షలు, వారి అనుచరులు పోతే వేలల్లోనే గిట్టుబాటు కలుగుతోంది. ఇప్పటికే ఈ ప్రత్యేకమైన కూలీలెవరో తెలిసిపోయే ఉంటుంది. ఈ నె 27న వరంగల్ లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి పదహారేళ్ళు పూర్తిఅయి పదిహేడేళ్ళకు చేరుకున్న సందర్భంగా వార్షికోత్సవ సభ  నిర్వహించబోతోంది. గతంలో దేశంలోనే ఎక్కడా జరుగని రీతిలో  దీన్ని జరుపాలని ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ సభకు కనీసం పదిహేను లక్షలకు తక్కువ కాకుండా జనం హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది ఆ పార్టీ. ఈ సభ విజయవంతం పైనే గత మూడేళ్ళ కాలంగా అధికారంలో ఉన్న తమ పార్టీ ప్రతిష్ట ఆధారపడి ఉందన్న రీతిలో టిఆర్‌ఎస్‌ సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. దీని విజయవంతం కోసం  నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని గత పదిహేను, ఇరవై రోజులుగా శ్రమిస్తోంది. ఇందుకోసం దాదాపు పదకొండు వందల ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం వివిధ జిల్లాల, ప్రాంతాలనుండి వచ్చే వాహనాలకోసమే ఎనిమిది వందల ఎకరాల స్థలాన్ని కేటాయించిందంటేనే వారి అంచనా ఎంత భారీ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సభకు వచ్చే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా స్వచ్చందంగా తరలి వస్తారన్నది ఆ పార్టీ చెబుతున్న మాట. ఆ పార్టీ అధినేత కెసిఆర్‌ మాటలలో చెప్పాలంటే ఎవరి దారిభత్యం వారే పెట్టుకోవాలని. సభకు వచ్చిపోయే రవాణా ఖర్చు, తిండి ఖర్చు అన్నీ మీరే భరించాలని, అందుకు వారం రోజుల పాటు కూలీలుగా మారాలని పిుపునిచ్చారు కెసిఆర్‌. ఈ నె 14 నుండి 20వ తేదీ వరకు గ్రామస్థాయి కార్యకర్తనుంచి రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి వరకుకూడా ఎక్కడో ఒక చోట కూలీ పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో ప్లీనరీ సభకు తరలి రావాని విజ్ఞప్తి చేశారు. ఇంకేముంది మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంపీలు, జిల్లా, మండలస్థాయి నాయకులంతా గులాబి కూలీలుగా మారిపోయారు. వీరంతా బట్టలు నలుగకుండా, చెమటచుక్కలు రాల్చకుండా ఇప్పటికే లక్షలాది రూపాయలను పోగేశారు. పార్టీ అధినేత కెసిఆర్‌ కుమారుడు, ఐటి, మున్సిపల్‌ శాఖ మంత్రి కెటిఆర్‌ ఎండకాలమనుకున్నాడో ఏమో చల్లని నీడపట్టున పని ఎంచుకున్నాడు. నగరంలోని కుత్భుల్లాపూర్‌లో ఓ ఐస్‌ క్రీమ్‌ షాపులో పనిచేసి ఏకంగా ఏడున్నర లక్షలు సంపాదించాడంటే ఆయన ఎంతటి కాస్ట్లీ కూలీనో అర్థమవుతోంది. కేవలం కొన్ని నిమిషాలకే అన్ని లక్షల రూపాయలను సంపాదించిన కెటిఆర్‌ను చూసి దినసరి కూలీలు  ముక్కున వేలేసుకుంటున్నారు. విచిత్రమేమంటే అందులో అయిదు లక్షల రూపాయలిచ్చి ఐస్‌క్రీమ్‌ను కొనుగోలు చేసింది అదే పార్టీకి చెందిన ఎంపి కావడం. నిజామాబాద్‌ జిల్లాలో కెసిఆర్‌ కూతురు క్వకుంట్ల కవిత ఓ బట్టల షాపులో పది నిమిషాలు పనిచేసి ఏడు లక్షల కూలీ డబ్బులు సంపాదించారు. మంత్రి హరీష్‌రావు వరంగల్‌లో ఓ ప్రైవేటు ఆసపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తే తొమ్మిది లక్షలొచ్చాయి. అదే మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఓ భవనానికి రంగేస్తే రెండు లక్షలు లభించాయి.  మరో మంత్రి శ్రీనివాస్ యాదవ్‌ రైస్‌ మిల్లులో పనిచేస్తే దక్కింది డెబ్బై వేలే. ఇది కాస్ట్లీ కూలీల్లో ఉన్న తేడా. రాజకీయ పార్టీల విరాళాల మీద పు నిబంధనలు ఖఠిన తరుణం చేసినక్రమంలో  పార్టీ విరాళాలకు టిఆర్ఎస్  కూలీపనులతో ప్రత్యామ్నాయం చూపించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి కూలీ పనులకు ఉద్యమ స్పూర్తితో దాతలు కూలీలు చెల్లించారు. సామాన్య జనం కూడ దానిని ఆమోదించారు. కాని ఇప్పుడు  టిఆర్ఎస్ పార్టి ఫక్తు రాజకీయ పార్టి కనుక ప్రతి పైసకు లెక్కలు చూపాల్సిన అవసరం ఉంది. విరాళాలకు  మారు పేరుతో ముద్దుగా కూలిపని పేరిట సాగుతున్న ఈ తంతు అంతా ఒక డ్రామాలాగే ఉంది. అయితే ఇంతేనా కూలి డబ్బులతోనే సభ నిర్వహణ పూర్తి అవుతుందని చెప్పలేం. సభ పేరిట తెర వెనకాల పార్టి నిధుల సేకరణ విచ్చల విడిగానే జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. అంతెందుకు  వరంగల్ అర్బన్ జిల్లాలో మున్సిపల్, కుడా, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్ మెంట్లతో పాటు  అన్ని డిపార్ట్ మెంట్ల అధికారులు సభను విజయ వంతం చేసే పనిలో ఉన్నారు.  నభూతో నభవిష్యత్‌ అన్నట్లుగా సభ  నిర్వహించి తీరుతారు మరి ఇందులో ఏ అనుమానాలు లేవు.

 మండువ రవీందర్ రావు

ప్రజాతంత్ర లో ప్రచురితం

20-04-2017

 

ఒళ్ళు వంచింది లేదు….బట్టలు నలిగింది లేదు… కూలీ మాత్రం లక్షల్లో.. Reviewed by on . టిఆర్ఎస్ సభకు లక్షలకు లక్షలు.......... కెటిఆర్ ఐస్ క్రీమ్ బాగా కాస్ట్లి గురూ....... ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీకి మహా అయితే రోజుకు మూడు వందలు లబించొచ్చు. టిఆర్ఎస్ సభకు లక్షలకు లక్షలు.......... కెటిఆర్ ఐస్ క్రీమ్ బాగా కాస్ట్లి గురూ....... ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీకి మహా అయితే రోజుకు మూడు వందలు లబించొచ్చు. Rating: 0

Related Posts

scroll to top