Friday , 19 July 2019

Home » Slider News » ఉద్యమ పత్రికకు గుర్తింపు ఏది ?

ఉద్యమ పత్రికకు గుర్తింపు ఏది ?

January 5, 2017 6:01 pm by: Category: Slider News, ఫోర్త్ పాయింట్ Leave a comment A+ / A-

“వార్త యందు జగము వర్దిల్లు చుండును” అనేది నన్నయ మహాభారతంలో రాసిన హితోక్తి. నిజాం కాలంలో తెలంగాణ ప్రజలను జాగృతం చేసేందుకు తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాప రెడ్డి నడిపిన గొల్కొండ పత్రిక మొదటి పేజీల్లో ఈ హితోక్తిని (టాగ్ ) ముద్రించే వారు. వార్తకున్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో తెలియ చేసేందుకు ఆ రోజుల్లోనన్నయ హితోక్తి కి స్థానం కల్పించారు. తెలంగాణ సామాజిక స్థితి గతులను అధ్యయనం చేసి వెలుగు లోకి తెచ్చేందుకు ఆ నాటి నుండే సురవరం ప్రతాప రెడ్డి జిల్లా, తాలూకా స్థాయిల్లో ఔత్సాహికులను ప్రోత్సహించి వార్తలు రాయించారు. వార్తకు అప్పటికి ఇప్పటికి ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదు. కాక పోతే వార్త ఇప్పుడు కాలంతో పోటి పడుతోంది. సాంకేతిక సౌలభ్యాలు అందుబాటులోకి రావడంతో పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎలక్ర్టానిక్ మీడియా రాకతో వార్త స్వరూపం మారినప్పటికి రూపం మాత్రం ఒక్కటే…వార్తలు సేకరించి చేరవేసే విధానాలు వేరైనా వర్తమానంలో పత్రికా రంగమైనా ఎలక్ర్టానిక్ మీడియా రంగమైనా ఏ మీడియా అయినా వార్త రూపం స్వరూపం ఒక్కటే. వీటిని సేకరించే వారిని రకరకాల పేర్లతో యాజమాన్యాలు పిలుస్తుంటాయి. విలేఖరి నుండి సంపాదకుడి వరకు ఇందులో నిచ్చెన మెట్ల వంటి హోదాలు చాలా ఉన్నాయి.
ఇదంతా ఎందుకు చెప్పడ మంటే సమాజంలో అన్ని రకాల వార్తలు అందరి ఈతి భాదలు తనవిగా చేసుకుని గడియారం ముల్లు లాగా గిర గిరా తిరిగి వార్తలు సేకరించే జర్నలిస్టుల సమస్యలు ఈ రోజు ఓ వార్తలుగా మారాయి కనుకనే ప్రస్తావించాల్సి వస్తోంది.
తెలంగాణ రాష్ర్టంలో జర్నలిస్టులకు అనేక సమస్యలు ఉన్నాయి. ఓ వైపు యాజమాన్యాలకు సంభందించిన వేతన సమస్యలు. మరో వైపు వృత్తి పరంగా ఎదురవుతున్న సమస్యలు వాటికి తోడుగా ప్రభుత్వ పరంగా ఉత్పన్నమయ్యే సమస్యలు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన అనంతరం ప్రభుత్వపరంగా ఏ సమస్యలు ఉండ బోవని అందరికి న్యాయం జరుగుతుందని ప్రభుత్వపరంగా అందే అన్ని రకాల సహాయ సహకారాలు అంద చేసి తీరుతామని స్వయంగా ఆనాటి ఉద్యమ నాయకుడు ఈ నాటి ముఖ్యమంత్రి కె,చంద్రశేఖర్ రావు (కెసిఆర్) అనేక సార్లు ప్రకటించారు. తెలంగాణ జర్నలిస్టుల పట్ల కెసిఆర్ కు ఉన్న ధృక్పథం చాలా గొప్పది. దాన్ని ఎవరూ శంకించాల్సిన అవసరంలేదు. ఉద్యమ సమయంలో జర్నలిస్టులు తమ భాదలు దిగ మింగుకున్నారే తప్ప ఏనాడూ తమ సమస్యలు ఎవరికి మొర పెట్టుకోలేదు. అవి కావాలని ఇవి కావాలని ఎనాడూ అడగ లేదు. తెలంగాణ సాకారం చేసుకోవడే లక్ష్యంగా ఉద్యమంలో అగ్ర బాగాన నిలిచారు. జర్న లిస్టుల మనోగతాన్ని అర్దం చేసుకుని ఇండ్ల స్థలాలు,డబుల్ బెడ్ రూం ఇండ్లు, నగరాల్లో అయితే త్రిబుల్ బెడ్ రూం ఇండ్లు, ఉచిత ఆరోగ్య చికిత్స సౌకర్యంతో పాటు జర్నలిస్టులకు పెన్షన్లు ఇస్తామని ఎన్నికల మానిఫెస్టోలో హామీలిచ్చారు. నిజంగా దేశంలో ఏ రాష్ర్టంలో కూడ ఎన్నికల మానిఫెస్ట్ లో జర్నలిస్టుల సమస్యలు చేర్చిన రాజకీయ పార్టీలు లేవు ఆ ఘనత ఒక్క కెసిఆర్ కే దక్కుతుంది. విలేఖరి, సబ్ ఎడిటర్,ఎడిటర్ అనే తేడా లేకుండా అందిరికి అక్రిడిటేషన్లు ఇస్తామని చెప్పారు. ఎన్నికల హామీలలో కొన్ని నెరవేర్చారు. మొదటి సారిగా జర్నలిస్టుల సంక్షేమ నిధిని సమ కూర్చారు. మొదట రూ 10 కోట్లు ఆ తర్వాత మరో రూ 20 కోట్లు కేటాయించారు. ఈ నిధిని రూ 100 కోట్లకు పెంచనున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఇంకా నెర వేర్చాల్సిన సమస్యల్లో అక్రిడిటేషన్లది ప్రధాన సమస్య. అక్రిడిటేషన్ అంటే ప్రభుత్వం నుండి ఇచ్చే గుర్తింపు. సంక్షేమ పథకాల కన్నా జర్నలిస్టులకు ఈ అక్రిడిటేషన్ అనేది అన్నిటికన్నా ప్రధానమైంది.
తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన అనంతరం జర్నలిస్టులకు సంభందించిన అక్రిడిటేషన్ల జారి ప్రక్రియ అనేది కొరకరాని సమస్యగా మారింది. రాష్ర్టం ఏర్పడి రెండున్నరేండ్లు గడిచినా మూడు నెల్ల కోసారి ఆరు నెల్ల కోసారి పాత అక్రిడిటేషన్లే రెన్యువల్ చేస్తూ వచ్చారు. 2012 లో రాష్ర్ట విభజనకు ముందు జారి చేసిన అక్రిడిటేషన్లను ఇంత కాలం పొడిగిస్తూ వచ్చారు తప్ప కొత్తగా తెలంగాణ రాష్ర్టం అక్రిడిటేషన్లు జారి చేయలేక పోయింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పితే సరి పోదు. విధి విధానాలు రూపొందించడంలో కాలయాపన జరగడంతో పాటు వాటిని ఆమోదించడంలో అధికార యంత్రాంగం కాల యాపన చేయడం ఆలస్యానికి ప్రదాన కారణం అయింది. జారి చేసిన జీవోలో కూడ విధివిధానాలు సంతృప్తికరంగా లేవు.
. తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్- 2016 -జి.వో నెంబర్ 239 పేరిట ప్రభుత్వం జారి చేసిన రూల్స్ జర్నలిస్టులను ఆందోళనకు గురి చేశాయి. ఈ జి.వో ప్రకారం అయితే ఒక్క జర్నలిస్టుకు అక్రిడిటేషన్ రాదు. ఇందులో ఆంధ్ర బడా బాబులు నడిపిస్తున్న పత్రికలకు తప్ప హంగులు ఆర్భాటాలు లేని తెలంగాణ పత్రికలకు స్థానం లేకుండా పోయింది. తెలంగాణ లో పత్రిక లేని కొరత తీర్చేందుకు అష్టకష్టాల కోర్చి ఎంతో ఆర్థిక భారంతో ఏర్పాటు చేసి పత్రికను నెట్టు కొస్తున్న ప్రజాతంత్ర వంటి దిన పత్రికలకు తీరని అన్యాయం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత అయినా ఈ పత్రికకు సముచిత గౌరవం ఇవ్వలేక పోయారు. సర్కులేషన్ లేక పోయినా అడ్డ దారుల్లో దొంగ సర్కులేషన్ లెక్కలు చూపి కోట్లాది రూపాయల మేరకు ప్రభుత్వ అడ్వర్టైజ్ మెంట్లను కొల్ల గోట్టుకు పోతున్న మీడియా హౌజ్ లకు సంభందించిన పత్రికలు, చానెళ్ళలో పనిచేసే వారికి మాత్రమే అక్రిడిటేషన్లు దక్కేలా జి.వో ఉందనేది సీనియర్ జర్నలిస్టుల నుండి వచ్చిన విమర్శలు. అక్రిడిటేషన్ల కోసం మీడియా హౌజ్ లు దొంగ పత్రాలు సృష్టించే పరిస్థితి నెల కొంది. ప్రధాన పత్రికలు అని చెప్పుకునే వాటికి కూడ ఈ రోజు ఏబిసి (ఆడిట్ బూరో సర్కులే,న్ సర్టిఫికేట్ ) లేవు. ఆడిటర్ ఇచ్చే సర్టిఫికేట్ తో ప్రభుత్వ అడ్వర్టైజ్ మెంట్లు కాజేసినట్లే అక్రెడిటేషన్ల కోసం కూడ తప్పుడు పత్రాలు సమర్పిస్తున్నారు. అక్రెడిటేషన్ల జి.వో తో తెలంగాణ లో చిన్న చితకా పత్రికలు మూత పడే ప్రమాదం నెల కొంది. ఎన్ పానెల్ విధాన మంటూ ఏర్పాటు చేసి ఆ జాబితాలో చేర్చిన పత్రికలకు కూడ అక్రిడిటేషన్ పొందే ఆర్హత లేకుండా చేసారు. తెలంగాణ లో ఆంధ్ర బడా బాబులతో పోటి పడి రంగులు హంగులతో పత్రికలు, చానెళ్ళు నడిపే వారు లేక పోవచ్చు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప్ రెడ్డి స్పూర్తితో చిత్త శుద్దితో తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో పనిచేసిన జర్నలిస్టులు ఉన్నారు. తెలంగాణ వార్తలకు పత్రికల్లో ఒక్క ఇంచు స్థలం కూడ దక్కని రోజుల్లో తెలంగాణ ప్రజల కోసం నేనున్నానంటూ పుట్టుకు వచ్చిన పత్రిక ప్రజాతంత్ర దిన పత్రిక. నవ తరానికి చెందిన సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ సంపాదకత్వంలో ఆయన సోదరుడు అజయ్ సారద్యంలో ఎన్. వేణుగోపాల్, అల్లం నారాయణ, కె. శ్రీనివాస్ వంటి నిఖార్సైన ఎందరో తెలంగాణ జర్నలిస్టుల కలాల నుండి వెలువడిన పదాలను అస్ర్తాలుగా మలిచి మా తెలంగాణ మాక్కావాలంటూ సీమాంద్ర పాలకులను పొలిమేర్ల వరకు తరిమేయడంలో చివరి మజిలి వరకు నిలిచిన పత్రిక ప్రజాతంత్ర.. తెలంగాణ గడ్డమీద నాటి తెలంగాణ ప్రజల కోసం సురవరం ప్రతాప రెడ్డి రాస్తాలో… నేడు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నది ప్రజాతంత్ర దిన పత్రిక. ఇదే కోవలో అనేక మంది చిన్న పత్రికల ద్వారానే జర్నలిస్టులు తెలంగాణ భావజాల వ్యాప్తికి విశేష కృషి చేశారు. ఇదంతా తెలంగాణ ఉద్యమ చరిత్ర అవగాహనలో ఉన్న వారికి తెలియందేమి కాదు. యాజమాన్యాల భాదలు భరించారు. తెలంగాణ వార్తలు రాస్తే ప్రమో,న్లు ఇచ్చే బదులు డిమోషన్లు ఇచ్చి ఇండ్లకు పంపిస్తామని మెమోలిచ్చినా తెలంగాణ కోసం దిగమింగి తెలంగాణకు జరిగిన అన్యాయాలను బహు రాపాల్లో ప్రదర్శించారు. జరిగిన అన్యాయాలను నయా పైస లెక్కలతో సహా బయటికి తీసి సీమాంధ్ర పాలకుల దోపిడి భాగోతాన్ని బయట పెట్టింది ఈ గడ్డ బిడ్డలే……ఈ గడ్డ పత్రికలే…ఇదీ మన తెలంగాణ చరిత్ర…….తెలంగాణ జర్నలిస్టుల చరిత్ర……..ఈ చరిత్రను రాసింది పాత్రికేయులమే……మా చరిత్రకు మేమే సాక్షులం…..కాని ఇప్పుడు ఈ చరిత్రంతా తెలియనట్లు నటిస్తున్నారు కొందరు.
నేటి పాత్రికేయులు రాసేదే రేపటి చరితగా నిలుస్తుంది. అలాంటి వర్తమాన చరిత్ర కారులైన పాత్రికేయులకు ఆత్మ గౌరవ సమస్యలు తలెత్తితే రేపటి చరిత్రలో అదే స్థిర పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ కోసం ముఖులిత హస్తాలతో వేడుకుంటున్నాం……మమ్మల్ని అక్రిడిటేషన్ల దగ్గర అవమానాల పాలు చేయవద్దు. అక్రిడిటేషన్లంటే ఎవరి దయా దాక్షిణ్యాలతోనే ఇచ్చే వరాలు కావు…అమాత్యులతో ఇప్పించే సంక్షేమ ఫలాలు అంతకన్నా కావు…..నా తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి నిరంతరం నా చూపుడు వేలుతో ప్రశ్నించడం నాజన్మ హక్కు. పత్రికే నియంత పక్కలో బల్లెమ్ము అన్నారు తొలి తరం నాటి సుప్రసిద్ద పాత్రికేయులుగా చెప్పుకునే నార్ల వెంకటేశ్వర్ రావు. కాని పాలకుల పక్కనే పాత్రికేయులను అన్నిటికోసం దేబురించేలాగా చేసారు. ప్రజల కోసం నిష్పక్ష పాతంగా పాలకుల పక్కలో బల్లెంబు కాదు పాలకుల పక్కనే బెల్లంగా మార్చి అక్రిడిటేషన్ల కోసం చేతులు చాపేలా చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి పాత్రికేయ లోకానికి చాలా ప్రమాదం. గతంలో ఎన్నడూ ఇలాంటి సాంప్రదాయాన్ని చూడ లేదు. అసలే మీడియా హౌజ్ లు పార్టీకోటిగా మారి పలచ డి పోయిన రోజులు.
ఏ విలువలు ఆశించి ఈ వృత్తిలోకి వచ్చామో చివరి వరకు ఆవిలువల కోసం పోరాడడంలోనే సంతృప్తి మిగులు తుంది. హక్కుల కోసం యాచించడం కాదు…..శాసించే సాంప్రదాయం కొనసాగిద్దాం…….సమాజం హితం కోరి పనిచేస్తూ సముచిత గౌరవ మర్యాదల కోసం పోరాడుదాం….తెలంగాణ జన హితమే మన అభిమతం..

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఎలుగెత్తి చాటిన దాశరథి స్పూర్తితో నా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లే వరకు మన ప్రస్తానం…….కొనసాగిద్దాం.

కూన మహేందర్

జర్నలిస్టు

(6-01-2017 -ప్రజాతంత్ర)
ఉద్యమ పత్రికకు గుర్తింపు ఏది ? Reviewed by on . “వార్త యందు జగము వర్దిల్లు చుండును” అనేది నన్నయ మహాభారతంలో రాసిన హితోక్తి. నిజాం కాలంలో తెలంగాణ ప్రజలను జాగృతం చేసేందుకు తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాప రెడ్డి “వార్త యందు జగము వర్దిల్లు చుండును” అనేది నన్నయ మహాభారతంలో రాసిన హితోక్తి. నిజాం కాలంలో తెలంగాణ ప్రజలను జాగృతం చేసేందుకు తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాప రెడ్డి Rating: 0
scroll to top