Saturday , 24 August 2019

Home » Slider News » ఆయన జీవితాన్ని పిల్లలకే కాదు నేటి ప్రజాప్రతినిధులకూ పాఠంగా చెప్పాలి

ఆయన జీవితాన్ని పిల్లలకే కాదు నేటి ప్రజాప్రతినిధులకూ పాఠంగా చెప్పాలి

March 20, 2017 2:08 pm by: Category: Slider News, ఫోకస్ Leave a comment A+ / A-

ప్రజల పక్ష పాతి పెండ్యాల రాఘవరావు

pendyala raghavarao EX MPపార్లమెంటు సభ్యుడుగానేకాదు పంచాయతీ సర్పంచ్‌గా సైతం ప్రజాసేవ చేయవచ్చునని ఆయన్ను చూసి నేర్చుకోవాలి.
అగ్రవర్ణానికీ, ఆధిపత్య వర్గాలకు చెందినా అణుక్షణం సామాజిక మార్పుకోసం ఆలోచించిన పెండ్యాల రాఘవరావు గారిగురించి ఆయన శతజయంతి సందర్భంగా మనమందరం తెలుసుకొవాలి.
వరంగల్ లోక్‌సభకు తొలిసభ్యుడైన (1952-57) పెండ్యాల రాఘవరావు పూర్వపు వరంగల్ జిల్లా చిన పెండ్యాల గ్రామం‌లో భూస్వాముల కుటుంబమైన పెండ్యాల రామచంద్రారావు, రామానుజమ్మ దంపతులకు 1917లో జన్మించారు. మార్క్సిజాన్ని అధ్యయనం చేసిన రాఘవరావు సమసమాజం సాకారానికి కేవలం ఆర్ధిక సమానత్వమేకాక సామాజిక అంతరాలుకూడా తొలగాలని అందుకు కార్యాచరణ తమ ఇంటినుండే ప్రారంభించారు. గ్రామం‌లోని దళితులను తమ ఇంట్లోకే తీసుకురావడంతో తండ్రి రామచంద్రరావు ఆగ్రహానికి గురికాక తప్పలేదు. ఆస్తులపంపకంకోసం తండ్రీకొడుకులు గొడవపడటం నేటికీ కనిపించే సామాన్యదృశ్యం. కానీ వీరి గొడవలెపుడూ రాజకీయాలు, సామాజిక మార్పుకు సంబంధించినవే.
రెండో ప్రపంచ యుధ్ధకాలం (1939-45)లో ఖర్చులకోసం బ్రిటిష్ ప్రభుత్వం తన పరిపాలిత ప్రాంతాల్లో నేరుగానూ, సంస్థానాలనుండి పన్నులపై పన్నులు లాగుతున్న కాలం. దొరలు, దేశ్‌ముఖ్‌లూ తమ విలాసాలను ఏమాత్రం తగ్గించుకోకుండా యుధ్ధంపేరుతోనే ప్రజలను పీడించి పన్నులు, శిస్తులు ఫసూలుచేస్తున్న కాలం. ఈ పరిస్థితులతో అవకాశమున్న పిల్లలు విద్యనుకోల్పోకూడదని రాఘవరావుగారు హన్మకొండలో విద్యార్ధులకోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు.
మహమహోపాధ్యాయులు చుక్కా రామయ్యగారు ఆవిద్యార్ధుల్లో ఒకరు. “ఆయన తినిపించిన బియ్యం గింజల్లోనున్నవి కార్బోహైడ్రేట్లుకావు, దేశభక్తి, అమ్మ అనురాగ’మని రామయ్యగారు రాశారు. నేటి వార్డెన్ల మాదిరిగా మార్కులు రాంకుల గురించి కాకుండా ‘మక్సీం గోర్కీ -అమ్మ నవల చదివావా? రష్యా గురించి ఏమేమి తెల్సుకున్నావు? కమ్యూనిజం అంటే తెలుసా?’ అంటూ మహానుభావులు, త్యాగధనుల చరిత్రగల మోనోగ్రాఫులను ఇచ్చేవారు. ఆయన అమ్మలా లాలన, నాన్నలా పాలన, గురువులా విషయాన్ని అర్ధం చేయించేవారు. ఆయనవల్లనే జీవితం‌లో తమకింతటి క్రమశిక్షణ వచ్చిందని’ రామయ్యగారు వివరించారు.
ఆంధ్ర మహాసభలో చీలికలు రావడం, రాఘవరావుగారు కమ్యూనిస్టులతో చేరి సాయుధపోరాటంకోసం అజ్ఞాతం‌లోకి (1946-51) వెళ్ళడం జరిగాయి. ప్రజాజీవితం‌లోనున్నవారు నైతికవిలువలకు, ఋజువర్తనకు కట్టుబడిఉండాలని విశ్వ్వసించే రాఘవరావుగారు తమదళం‌లో శంకర్‌అనే సభ్యుడు మహిళలతో చేసిన అనుచితప్రవర్తనకు అతన్ని మందలించడంతోపాటు దళం‌నుండి పంపించార’ని సీపీఐ అగ్రనేత చెన్నమనేని రాజేశ్వర రావుగారు గుర్తు చేసుకున్నారు. “గాంభీర్యం, శత్రువులపట్ల అసహనం, కంచుకంఠంతో ఖండితంగా ప్రకటించడం పెండ్యాలవారి” ప్రత్యేకతలుగా ఆయన ప్రశంసించారు.
సాయుధపోరాట విరమణానంతరం భారత కమ్యూనిస్టు పార్టీ ఆదేశాలమెరకు వరంగల్ లోక్‌సభ స్థానంతోపాటు మరొమూడు అసెంబ్లీ స్థానాలకు పిడీయఫ్ అభ్యర్ధిగా పొటీచేసి వరంగల్ అసెంబ్లీ స్థానం మినహా అన్నింటిలోనూ గెలిచి అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీలు సమసమాజాన్ని తీసుకువస్తారని పలువురు కాంగ్రేస్, కమ్యూనిస్టు నాయకుల్లాగే ఆయనా విశ్వసించి, తదుపరి కాలాల్లో నిస్ఫృహకు గురయ్యారు. పార్లమెంటు సభ్యత్వం తర్వాత కమ్యూనిస్టు పార్టీలో విబేధాలు, గ్రూపురాజకీయాలకు విసుగుచెంది గ్రామ సర్పంచ్‌గా కన్నఊరికి సేవచేశారు.
ఎదుటివారి సందేహాలు తీరుస్తూ తను విశ్వసించే కమ్యూనిజాన్ని వివరించి వారిని మెప్పించేవాడు. కఠినత్వం, కరుణ, క్రమశిక్షణతోపాటు ఆయనకు లలితకళల్లో ప్రవేశముంది. పాకశాస్త్రం‌లో ఆయనతో పోటీపడెవారు లేరనీ, హృద్యమైన చిత్రాలుగీయడంతో పాటు హృదయాన్ని ఆకట్టుకునే కవిత్వాన్ని రాసేవారనీ రాఘవరావుగారి దాయాది ప్రముఖ విప్లవకవి వరవరరావుగారు రాశారు. ఆయన 1949-50 సం. అజ్ఞ్జాతం‌లోనున్నప్పుడు రాసిన గేయం‌లోని ఒక నాలుగు లైన్లు చదువుదాం.
“వలసవిధానపు వరమేరా ఇది/ తెల్లోడుబెట్టిన తెగులేరా ఇది/ నల్లోడు నేడు నడుపుతున్నాడు/ దోపిడీవర్గాల దాపునున్నాడు”
ఇదిరాసి డెబ్బదేళ్ళు కావస్తున్నా పరిస్థితుల్లో నేటికీ మార్పులేదు.
ఇన్ని ఒత్తిళ్ళలోకూడా ఆయన తన సంతానాన్ని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దారు. పెద్దకొడుకు కిషన్‌రావు సామాజికబాధ్యతగా విప్లవపంధానెంచుకొని వీరమరణం పొందగా మిగిలిన ముగ్గురు కొడుకులు, ఇద్దరుకూతుళ్ళ తమకు ఆసక్తిగల రంగాల్లో సేవచేస్తూ ఉద్యోగవిరమణ పొందారు. ఆయన రాసిన ‘నాప్రజా జీవితం’ బహుళ జనాదరణ పొందింది. కుమార్తె కొండపల్లి నీహారిణి (ప్రఖ్యత చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావుగారి కోడలు) రాసిన “పెండ్యాల రాఘవరావు” మోనోగ్రాఫ్‌ను నాల్గో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడెమీవారు ప్రచురించారు.
“ఆయననుండి పాఠాలతోపాటు రాజకీయాల్లో ఆయన పొందిన గుణపాఠాలను నేర్చుకున్నాం, ఇప్పటికీ, ఎప్పటికీ ఆయనే మా రోల్‌మాడల్” అని వీక్షణం పత్రిక సంపాదకులు, రాఘవరావుగారి సమీప బంధువు నెల్లుట్ల వేణుగోపాల్ రాశారు.
పెండ్యాల రాఘవరావుగారి శతజయంత్యుత్సవాలు నేడు సుందరయ్య విజ్ఞాన భవన్‌లో ప్రారంభమౌతున్నాయి. ఈమహనీయుడి ఆదర్శాలలో కొన్నింటినైనా ఆచరించగల్గడమే ఆయనకు నిజమైన నివాళి.
రాజేశ్వర్ రావు రావిచెట్టు
విశ్రాంత ఉపాధ్యాయుడు
ఆయన జీవితాన్ని పిల్లలకే కాదు నేటి ప్రజాప్రతినిధులకూ పాఠంగా చెప్పాలి Reviewed by on . ప్రజల పక్ష పాతి పెండ్యాల రాఘవరావు పార్లమెంటు సభ్యుడుగానేకాదు పంచాయతీ సర్పంచ్‌గా సైతం ప్రజాసేవ చేయవచ్చునని ఆయన్ను చూసి నేర్చుకోవాలి. అగ్రవర్ణానికీ, ఆధిపత్య వర్గా ప్రజల పక్ష పాతి పెండ్యాల రాఘవరావు పార్లమెంటు సభ్యుడుగానేకాదు పంచాయతీ సర్పంచ్‌గా సైతం ప్రజాసేవ చేయవచ్చునని ఆయన్ను చూసి నేర్చుకోవాలి. అగ్రవర్ణానికీ, ఆధిపత్య వర్గా Rating: 0
scroll to top