Tuesday , 25 June 2019

Home » Slider News » అరమెరిక – ట్రంప్ గోడలు-డాలర్ మేడలు

అరమెరిక – ట్రంప్ గోడలు-డాలర్ మేడలు

February 7, 2017 7:57 pm by: Category: Slider News, ఫోకస్ Leave a comment A+ / A-

అమెరికన్ల కోసమే అమెరికా ! చేసిందే చట్టం!చెప్పిందే వేదం!

TRUMP WALS IN COUNTRIESదేశమేదయినా తమకు దాసోహం కావాలి! ఎవరిని దువ్వినా! తాము ఎవరిపైకి కాలు దువ్వినా, ఎవరిని వంచించినా తాము ఎవరెవరిని పెంచి పోషించినా అమెరికా పాలకులదే పైచేయి కావాలి.

గొప్పవాళ్ళు తలచుకుంటే గొడవలకు కొదవేముంటుంది? గోడలు కూడ గొడవలకు కేంద్ర బిందువులవుతాయి. అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పుణ్యమా అని ‘గోడ’ ఇప్పుడొక ప్రపంచ వార్త! గొడవలతో అధ్యక్ష ఎన్నికల బరిలో దునికిన ఆయన గోడలతో పాలనను ప్రారంభిచాడు. అమెరికా – మెక్సికో దేశాల సరిహద్దులో గోడను నిర్మించేందుకు ఉద్దేశించిన ఫైలుపై సంతకం చేసేశారు! శుభం!!

గోడలు వేదికగా ఇకనుండి గొడవలే గొడవలు! ఆ గోడ కట్టడానికయ్యే ఖర్చు కూడ అణా పైసలతో సహా గోళ్ళు ఊడగొట్టి మరి వసూలు చేస్తానంటున్నాడు డోనాల్డ్‌ ట్రంప్‌! ఆ పప్పులేవీ మా దగ్గర ఉడకవు పొమ్మంటున్నాడు మెక్సికో అధ్యక్షుడు ఎన్రికో నీటో! ఈ ఉడుక్కోవడాలు ఇక్కడికే పరివితమవుతాయాలేక రెండు దేశాలను రేపటి రోజున అట్టుడికిస్తాయా అన్నది, ఇప్పకిప్పుడు తేలే సమస్య కాదు. చూడబోతే ట్రంప్‌ చేసిన ‘పోల్‌ వార్‌’ కంటే ఈ ‘వాల్‌ వార్‌’ మరింత వేడిని పెంచబోతన్నట్లు పరిస్థితులను బట్టి అర్థమవుతున్నది. ఒకవైపు మెక్సికో వైపు గోడకడుతూనే  మరో వైపు ఇతరులు తమ దేశంలోకి ప్రవేశించకుండ అడ్డగోడల ఆంక్షలు పెడుతున్నరు. ముస్లిం దేశస్తులకు వీసాల నిరాకరణ కేవలం ఒక సాంపిల్‌ మాత్రమే.!

దేశదేశాల మధ్య గోడల్ని చెరిపివేసి ప్రపంచాన్ని గ్లోబల్‌ విలేజీగా మార్చే పనిని భుజానికెత్తుకున్న వాళ్ళకు తమచుట్టూ గోడలు కట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తిందన్నది, ఇప్పటి ప్రశ్న! తమ దాకా వస్తే  తప్ప ఎవరికైనా తత్వం భోదపడదన్నమాట. తాము మేడలు కట్టుకోవడానికి  పొరుగువాళ్ళ గోడల్ని కూల్చాలి. వాళ్ళ కొంపలు ఆర్చాలి. కానీ తాము మాత్రం గోడలరక్షణలో సరక్షితంగా జీవించాలి. ఒకవేళ తమకు జీవించడం దుర్భరమైనట్లైతే  ఇతరులెవరూ  ప్రశాంతంగా బతకడానికి వీల్లేదు.  గోడ(లు) ఇక్కడొక సాకు మాత్రమే! గొడవలు మాత్రం అనివార్యం! గోడల్ని నిర్మించి కొత్తగా మరికొన్ని గొడవల్ని సృష్టించడం తద్వారా తన భవిష్యత్‌ రాజకీయ జీవితానికి పటిష్టమైన కోటగోడలను నిర్మించుకోవడవే ట్రంప్‌ మహాశయుడి ప్రథమ ప్రాధాన్యతగా కనిపిస్తున్నది. అందవల్లనే ‘ఇది గోడలు కట్టే సమయం కాద’న్న ఇరాన్‌ అధ్యకుడి హితవచనం ఉత్త గోడు వెళ్లబోసుకున్నట్లుగా ఆయనకు కనిపించింది! అందుకే తమ ఆధిపత్యమే లక్ష్యంగా ఆయుధ నిల్వల పెంపుకోసం ట్రంప్‌ మరో అడుగు వెయ్యనే వేశాడు. ఎన్ని అడుగులైనా వేస్తాను. వెనకడుగు మాత్రం వెయ్యను . ఉగ్రవాదమనే నిప్పును నిప్పుతోనే ఎదర్కొంటానని అని హూంకరిస్తన్నాడు. ఇంతకీ ఏది ఉగ్రవాదం? ఎవరు ఉగ్రవాదులు అన్నది, ఎవరు నిర్ధారించాలి? ప్రపంచాన్ని ఉగ్రభూతపు కోరల్లోకి నెట్టేసే వాళ్లను ఎవరు నిలువరించాలి?

అంతా ప్రశాంతంగా వుంటే అమెరికన్‌ పాలకులకు ఏమీ తోచదు. ఎదుట ఉన్నవాళ్ళంతా ఏదో ఒక సమస్యతో సతమతమవుతు ఉండాలి. అందుకనే ఏదో ఒక దేశాన్ని చీల్చాలి! ఎవడో ఒక పాలకుడిని కూల్చాలి!  చమురు మంటలు రేపి చలి కాచుకోవాలి! ఆఫ్ఘనిస్థాన్‌, ఇరాక్‌ – దేశమేదయినా తమకు దాసోహం కావాలి! ఎవరిని దువ్వినా! తాము ఎవరిపైకి కాలు దువ్వినా, ఎవరిని వంచించినా తాము ఎవరెవరిని పెంచి పోషించినా అమెరికా పాలకులదే పైచేయి కావాలి. తమ దేశానికే ఆ ప్రయోజనాలన్నీ  రావాలి!  ఇంతకంటే మించి ఇంకొకటి జరగడానికి వీలులేదు మరి! ఒకప్పుడు తాలిబాన్లను తలకెత్తుకున్నా ఇప్పుడు సిరియాలో ఉగ్ర జ్వాలలకు ఆజ్యం పోసినా ఈ సూత్రమే అంత:సూత్రంగా పనిచేస్తూ వస్తున్నది. తాము పూయించిన ‘మల్లె విప్లవాలు’ సారాంశంలో ఉత్త ‘డొల్ల విప్లవాలు’ గా తేలిపోయిన తరువాత కొల్లగొట్టడానికి కొన్ని కొత్త ప్రాంతాలు అవసరం వచ్చిపడింది.

అమెరిక్ల కోసమే అమెరికా అనే నినాదం ఆవిదంగానే పుట్టుకువచ్చింది. అద్యక్షులు వారి అంతరంగాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే తప్ప అందులోని అంతరార్దం అట్టే భోదపడదు. అందులో భాగంగానే ఇప్పుడు మరిన్ని కొత్త చట్టాలు మరింత పదును తేలి ప్రపంచం పైకి దూసుకు రాబోతున్నాయి.! తాము చేసిందే చట్టం! తాము చెప్పిందే వేదం! ఇదే అమెరికన్ల రీతి! అమెరికా నీతి! ఇకమీదట దేశాలు దేశాలుగా వుండకపోవచ్చు. ప్రపంచానికి ప్రశాంతత కరవు కావచ్చు! క్యూబా, ఉత్తర కొరియాలు కుదురుగా పాలన సాగించలేకపోవచ్చు. ప్రాంతానికో పాలస్తీనా పుట్టుకు రావచ్చు! అమెరికన్ల కోసమే అమెరికా! అవును! అసలు ప్రపంచమే అమెరికన్ల కోసం! అందుకే అమెరికన్ల ‘గోడలు’ వర్థిల్లాలి! ఆ గోడల పునాదులపై నిర్మించుకున్న మేడలూ  వర్థిల్లాలి! అమెరికన్ల అవసరాలు వర్థిల్లాలి! వారి ఆలోచనా విధానాలూ వర్థిల్లాలి! ట్రంప్‌ గారి విజయఢంకా, రెండోసారీ మోగితీరాలి! ప్రపంచం ఎప్పటిలాగే అమెరికా పాలకుల పడగనీడనే బిక్కుబిక్కు మంటు తమ బతకులు వెళ్లమార్చాలి.


GUNDEBOINA SRINIVAS
– గుండెబోయిన శ్రీనివాస్‌

సెల్‌ : 9985194697

అరమెరిక – ట్రంప్ గోడలు-డాలర్ మేడలు Reviewed by on . అమెరికన్ల కోసమే అమెరికా ! చేసిందే చట్టం!చెప్పిందే వేదం! దేశమేదయినా తమకు దాసోహం కావాలి! ఎవరిని దువ్వినా! తాము ఎవరిపైకి కాలు దువ్వినా, ఎవరిని వంచించినా తాము ఎవరెవ అమెరికన్ల కోసమే అమెరికా ! చేసిందే చట్టం!చెప్పిందే వేదం! దేశమేదయినా తమకు దాసోహం కావాలి! ఎవరిని దువ్వినా! తాము ఎవరిపైకి కాలు దువ్వినా, ఎవరిని వంచించినా తాము ఎవరెవ Rating: 0

Related Posts

scroll to top